పార్కింగ్ వివాదం.. టెక్ మహీంద్రా మాజీ బిజినెస్ హెడ్ హత్య..
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:06 PM
పార్కింగ్ వివాదం టెక్ మహీంద్రా మాజీ బిజినెస్ హెడ్ ప్రాణాలను తీసింది. చిన్న వివాదం కాస్తా ముదరడంతో పక్కింటి వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. 15 రౌండ్ల కాల్పుల్లో బాధితుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.
హర్యానా: పార్కింగ్ వివాదం టెక్ మహీంద్రా మాజీ బిజినెస్ హెడ్ ప్రాణాలను తీసింది. చిన్న వివాదం కాస్తా ముదరడంతో పక్కింటి వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. 15 రౌండ్ల కాల్పుల్లో బాధితుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో కలకలం రేపుతోంది.
ఫరీదాబాద్‌లోని సెక్టార్ 21Cలో పరమ్‌జీత్ ధన్‌కర్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. గతంలో ఆయన టెక్ మహీంద్రా ఆసియా పసిఫిక్ విభాగానికి రీజినల్ బిజినెస్ హెడ్‌గా పనిచేశారు. ప్రస్తుతం వృత్తిరీత్యా సింగపూర్‌లో ఉంటున్నారు. అయితే, మేనల్లుడి వివాహం కారణంగా నవంబర్ 5న భారత్‌కు వచ్చారు. ఈ నెల 6వ తేదీ రాత్రి సుమారు 8 గంటలకు జిమ్ నుంచి పరమ్‌జీత్ ఇంటికి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా పార్కింగ్ విషయంలో పొరుగింటి వ్యక్తి మోహన్ శర్మతో గొడవ జరిగింది. తనకు కేటాయించిన స్థలంలో కారు నిలిపి ఉంచడాన్ని ఆయన ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై, అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. మోహన్ తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ పిస్టల్‌తో పరమ్‌జీత్‌పై కాల్పులు జరిపాడు.
సుమారు 15 నుంచి 16 రౌండ్ల కాల్పులు జరగ్గా.. ఏడు బుల్లెట్లు పరమ్‌జీత్ శరీరంలోకి దూసుకెళ్లాయి. దీంతో అక్కడికక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం నిందితుడు కుటుంబంతో సహా పారిపోయాడు. పరమ్‌జీత్ కుమారుడు శౌర్య ధన్‌కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూరజ్‌కుండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ రోజు ఫరీదాబాద్‌లోని బల్లభ్‌గఢ్‌లో డీఎల్ఎఫ్ చౌక్ వద్ద మోహన్ శర్మను అరెస్ట్ చేశారు. విచారణలో ఇరు కుటుంబాల మధ్య పలు అంశాలకు సంబంధించి గతంలోనూ గొడవలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. రైలు నుంచి పడిపోయిన యువకుడు..
E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ..