ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. రైలు నుంచి పడిపోయిన యువకుడు..
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:23 PM
లోకల్ ట్రైన్‌లో ప్రయాణికుల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇద్దరు ప్రయాణికులు కదులుతున్న రైలులోనే ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు అదుపుతప్పి రైల్లోంచి నేరుగా పట్టాలపై పడిపోయాడు.
ముంబై: లోకల్ ట్రైన్‌లో ప్రయాణికుల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇద్దరు ప్రయాణికులు కదులుతున్న రైలులోనే ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు అదుపుతప్పి రైల్లోంచి నేరుగా పట్టాలపై పడిపోయాడు. అయితే, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి ముంబైలో చోటుచేసుకుంది.
శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటలకు చర్చ్‌గేట్-విరార్ ఫాస్ట్ లోకల్ రైలు వెళ్తోంది. రైలు డోర్ వద్ద నిలబడే విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదట వాగ్వాదం మొదలైనట్లు తెలుస్తోంది. అది కాస్తా తీవ్ర ఘర్షణగా మారింది. ఇద్దరూ సహనం కోల్పోయి కదులుతున్న రైలులోనే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కాగా.. అందులో ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకోవడం కనిపిస్తోంది. ఓ ప్రయాణికుడు ఎదుటి వ్యక్తి దాడి నుంచి తప్పించుకునేందుకు వెనక్కి అడుగులు వేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కదులుతున్న రైల్లోంచి కింద పడిపోయాడు.
కాగా, ఆ యువకుడు ముంబై సెంట్రల్ స్టేషన్ సమీపంలోని రైల్వే పట్టాలపై పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటంతో ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. చిన్నపాటి వాగ్వాదంతో మొదలైన గొడవ చివరకు ఓ ప్రయాణికుడు రైల్లోంచి పట్టాలపై పడిపోయే పరిస్థితికి చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రపంచ రికార్డు.. లద్దాఖ్‌లో 13,629 అడుగుల ఎత్తులో ఐఏఎఫ్ విమానం ల్యాండింగ్..
ఆకాశం నుంచి చెట్లపైకి ఎర్రటి పూల వర్షంలా పక్షుల సందడి.. వీడియో వైరల్