ప్రపంచ రికార్డు.. లద్దాఖ్‌లో 13,629 అడుగుల ఎత్తులో ఐఏఎఫ్ విమానం ల్యాండింగ్..
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:37 PM
భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్-76ఎండీ భారీ రవాణా విమానం చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ల్యాండ్ అయి రికార్డు నెలకొల్పింది.
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్-76ఎండీ భారీ రవాణా విమానం చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ల్యాండ్ అయి రికార్డు నెలకొల్పింది. లద్దాఖ్‌లోని న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో 13,629 అడుగుల ఎత్తులో విజయవంతంగా ల్యాండ్ కావడంతో ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని భారత వైమానిక దళం (Indian Air Force) తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ పలు ఫొటోలు, ఓ వీడియోను షేర్ చేసింది.
ఐఎల్-76ఎండీ విమానం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ల్యాండ్ కావడం ఇదే తొలిసారి అని ఐఏఎఫ్ పేర్కొంది. 13,629 అడుగుల ఎత్తులో సురక్షితంగా ల్యాండ్ కావడం విమానయాన చరిత్రలోనే ఓ కొత్త శిఖరమని అభివర్ణించింది. విమానం సామర్థ్యానికి, సిబ్బంది నైపుణ్యానికి ఈ ల్యాండింగ్ అద్భుతమైన నిదర్శనమని పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బంది నైపుణ్యం, కచ్చితత్వం, వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించింది. ఈ మైలురాయి భారతదేశ వ్యూహాత్మక వాయు రవాణా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని హర్షం వ్యక్తం చేసింది.
తూర్పు లద్దాఖ్‌లోని న్యోమా ప్రాంతం భారత్, చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC)కి సమీపంలో ఉంది. దీంతో న్యోమా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉంది. ఈ ఎయిర్‌ఫీల్డ్ అధిక ఎత్తులో ఉండటంతో ఇక్కడ విమాన కార్యకలాపాలు సవాళ్లతో కూడుకుని ఉంటాయి. ముఖ్యంగా భారీ రవాణా విమానాల టేకాఫ్, ల్యాండింగ్ క్లిష్టతరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎల్-76ఎండీ విమానం విజయవంతంగా ల్యాండ్ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, ఐఎల్-76ఎండీ రష్యాకు చెందిన నాలుగు ఇంజిన్ల భారీ రవాణా విమానం. సైనికులు, పరికరాలు, సరకులను రవాణా చేయడానికి దీనిని రూపొందించారు. మారుమూల ప్రాంతాలు, వ్యూహాత్మక ప్రదేశాలకు సిబ్బంది, అవసరమైన సామగ్రిని తరలించేందుకు ఈ విమానాన్ని వినియోగిస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి
E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ..
'ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది'.. బీజేపీపై సోనియా విమర్శలు