దీపావళి వేళ టపాసులు కాలుస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:06 PM
దీపావళి వేళ టపాసులు కాలుస్తున్నారా..? ప్రమాదకరమైన బాణసంచా పొగ నుంచి కాపాడుకునేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిఇంటా వెలుగులు నింపే దీపావళి రానేవచ్చింది. ఈ పండుగ సందర్భంగా అన్ని వయసుల వారూ ఇష్టంగా టపాసులు కాలుస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సంబరాలు జరుపుకొంటారు. అయితే బాణసంచా నుంచి వెలువడే పొగలోని కాలుష్య కణాలు.. ఆరోగ్యానికి హాని చేస్తాయి. కళ్లపై, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఈ టపాసుల కారణంగా అగ్నిప్రమాదాలూ జరగొచ్చు. అందుకే బాణసంచా కాలుస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అవి ఏంటంటే..?
దూరం.. దూరం..
టపాసులు కాలుస్తున్నప్పుడు వాటికి తగినంత దూరంలో ఉండాలి. పేలుతున్న బాణసంచాకు దగ్గరగా వెళ్లకూడదు. అలాగే పెద్దల సమక్షంలో మాత్రమే పిల్లలను టపాసులు కాల్చడానికి అనుమతించాలి.
కిటికీలు, తలుపులు మూసేయాలి
క్రాకర్ల నుంచి వెలువడే ప్రమాదకర పొగ ఇంటిలోకి రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ఇంటి తలుపులు, కిటికీలు మూసేయాలి. ఇలా చేయడం వల్ల పొగ నుంచి కాపాడుకోవచ్చు.
కళ్లను కాపాడుకోవాలి
టపాసుల పేలుస్తున్నప్పుడు కళ్లను కాపాడుకోవడం ముఖ్యం. బాణసంచా నుంచి వచ్చే పొగ నేరుగా కంటిని తాకితే.. కళ్లలో మంట, దురద, నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే టపాసులు కాలుస్తున్నప్పుడు పొగ వచ్చే దిశలో కాకుండా మరో దిశలో నిలబడాలి. కళ్లకు అద్దాలు వాడితే ఇంకా మంచిది. కంటికి సంబంధించి ఏదైన అసౌకర్యం కలిగితే వెంటనే క్రాకర్లు పేల్చడం ఆపేయాలి. తరువాత శుభ్రమైన నీటితో కళ్లను కడగాలి. అయినా సమస్య తగ్గనట్టు అనిపిస్తే.. వైద్యుడిని సంప్రదించడం అన్ని విధాలా మేలు.
మాస్క్ ముఖ్యం
దీపావళి పండుగ రోజు సాయంత్రం బయటకు వెళ్లకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్నిసార్లు బయటకు వెళ్లడం అనివార్యమవుతుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా ఎన్95 మాస్క్ ధరించాలి. ఇది లేకుండా బయటకు వెళ్లకూడదు.
ఇలాంటి వారు మరింత అప్రమత్తం..
శ్వాస సంబంధిత సమస్యలున్న వారు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు వీరు ఇంట్లో ఉండడానికే ప్రయత్నించాలి. అవసరమైన మందులు, ఇన్హేలర్లను దగ్గర ఉంచుకోవాలి. వైద్యులు ఇచ్చిన సూచనలు తు.చ. తప్పకుండా పాటించాలి.
ఈ దీపావళి సంబరాల్లో ఆనందం ఎంత ముఖ్యమో ఆరోగ్యమూ అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. అన్ని జాగ్రత్తలూ తీసుకుని పండుగను జరుపుకోవాలి. ఈ సమయంలో పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఈ వార్తలూ చదవండి
దీపావళి వేళ వాయు కాలుష్యంతో జాగ్రత్త.. ఆరోగ్యాన్ని
ఆకాశం నుంచి చెట్లపైకి ఎర్రటి పూల వర్షంలా పక్షుల సందడి.. వీడియో వైరల్