దీపావళి వేళ వాయు కాలుష్యంతో జాగ్రత్త.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ టిప్స్!
ABN , Publish Date - Oct 26 , 2026 | 09:24 PM
కలుషిత గాలిని పీల్చటం వల్ల ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శ్వాసవ్యవస్థలో చికాకు, వాపు ఏర్పడతాయి. దీనివల్ల ఆస్తమా, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి సమస్యలూ వస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: అతి త్వరలోనే దీపావళి రానుంది. పండగ వేళ టపాసుల వినియోగం నిరుడి కంటే ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి. దీనివల్ల వాయు కాలుష్యం మరింత పెరగవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఢిల్లీలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. కలుషిత గాలిని పీల్చటం వల్ల ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శ్వాసవ్యవస్థలో చికాకు, వాపు ఏర్పడతాయి. దీనివల్ల ఆస్తమా, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి సమస్యలూ వస్తాయి. కలుషిత గాలిలో ఉండే హానికర వాయువులు, సూక్ష్మ కణాల కారణంగా ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్య కోరల నుంచి కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
ఎయిర్ ఫిల్టర్ వాడాలి
బయటి గాలి కంటే ఇంట్లోని గాలి 2 నుంచి 5 రెట్లు ఎక్కువ కలుషితమయ్యే అవకాశముంది. అందుకే హై ఎఫిషియెన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ (High-Efficiency Particulate Air) ఫిల్టర్ ఉపయోగించాలి. ఇది గాలిలోని అతి చిన్న కణాలనూ తొలగిస్తుంది.
దోమల చక్రాలు వద్దు
75-100 సిగరేట్లకు సమానమైన రేణువులను ఒక్క దోమల చక్రం విడుదల చేయగలదు. అలాగే అగరబత్తీల పొగ కూడా గాలి నాణ్యతపై ప్రభావం చూపుతుంది. వీలైనంత వరకు వీటిని తక్కువగా వాడండి.
ఈ సమస్యలుంటే..
ఇప్పటికే శ్వాస సంబంధిత సమస్యలున్న వారు అవసరమైన ఇన్‌హేలర్లు అందుబాటులో ఉంచుకోవాలి. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యులు చెప్పిన సలహాలు, సూచనలూ తు.చ తప్పకుండా పాటించాలి.
మాస్క్ ముఖ్యం
గాలి నాణ్యత క్షీణిస్తుంటే మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలి. అయితే సర్జికల్స్ మాస్క్ మంచి ఎంపిక కాకపోవచ్చు. ఇది హానికర వాయుల నుంచి ఎలాంటి రక్షణ ఇవ్వదు. దీని బదులు ఎన్95 మాస్క్‌ను ఉపయోగించండి.
ఎక్కువ నీటిని తాగండి
ఎక్కువ నీటిని తాగండి. శరీరంలో నీటి శాతం తగినంత ఉంటే శ్వాసనాళాల రక్షణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. నీటితో పాటు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోండి.
ఆ సమయాల్లో ఇంటిపట్టున ఉండండి
సాధారణంగా తెల్లవారుజామున, చీకటి పడే ముందు వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ సమయాల్లో ఇంటిపట్టునే ఉండండి. బయట తక్కువ సమయం గడపండి. ఇలా చేయడం వల్ల వాయు కాలుష్యం నుంచి రక్షించుకోవచ్చు.
ఇవీ చదవండి
నోటిపూతతో బాధపడుతున్నారా..? మీకోసమే ఈ చిట్కాలు
ఆరోగ్యానికి పైనా‘పిల్’.. ఈ పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..