పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత..
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:49 AM
వైద్య రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. చైనా, రష్యాకు చెందిన వైద్యులు పక్షవాతానికి గురైన వ్యక్తికి వెన్నుపాము మార్పిడి చేసి రికార్డు సృష్టించారు. కణజాలాలను అతికించేలా రూపొందించిన ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ ఘనత సాధించారు.
ఇంటర్నెట్ డెస్క్: వైద్య రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. చైనా, రష్యాకు చెందిన వైద్యులు పక్షవాతానికి గురైన వ్యక్తికి వెన్నుపాము మార్పిడి చేసి రికార్డు సృష్టించారు. కణజాలాలను అతికించేలా రూపొందించిన ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ ఘనత సాధించారు.
చైనా సర్జన్ రెన్ జియావోపింగ్ ప్రకారం.. అక్టోబర్ 14, 15 తేదీల మధ్య దాదాపు 12 గంటల పాటు శ్రమించిన వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆపరేషన్‌లో రోగి వెన్నుపాములోని దెబ్బతిన్న భాగాన్ని బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి సేకరించిన కణజాలంతో భర్తీ చేశారు. రష్యాలోని స్క్లిఫోసోవ్స్కీ అత్యవసర వైద్య పరిశోధనా సంస్థలో ఈ ప్రక్రియను నిర్వహించినట్లు రెన్ తెలిపారు. ఆ రోగికి మూడేళ్ల కిందట వెన్నుపాముకు గాయమైంది. దెబ్బతిన్న భాగాన్ని తొలగించి, దాత నుంచి సేకరించిన భాగాన్ని దాని స్థానంలో వైద్యులు అమర్చారు. మైక్రోసర్జరీతో పాటు, కణ త్వచాలను కలపడానికి పాలిథిలిన్ గ్లైకాల్ అనే పదార్థాన్ని ఉపయోగించారు. దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి వెన్నుపాము మార్పిడిగా రెన్ అభివర్ణించారు.
గ్వాంగ్జీ యూనివర్సిటీ ఆఫ్ చైనీస్ మెడిసిన్‌కు అనుబంధంగా ఉన్న సెకండ్ అఫిలియేటెడ్ హాస్పిటల్‌కు చెందిన తన బృందం, రష్యన్ వైద్య నిపుణుల సహకారంతో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు రెన్ వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ తల మార్పిడి శస్త్రచికిత్స చేస్తానని రెన్ గతంలో ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం వెన్నుముక మార్పిడి చేయడంతో భవిష్యుత్తులో తల మార్పిడి ఘనత సాధిస్తారని పలువురు వైద్య రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమెరికాలో కనిపించిన యూఎఫ్ఓ.. తాజా నివేదికలో సంచలన విషయాలు
ప్రతిరోజూ తేనె తీసుకుంటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు!