అమెరికాలో కనిపించిన యూఎఫ్ఓ.. తాజా నివేదికలో సంచలన విషయాలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 10:58 AM
అమెరికా రక్షణ శాఖ తాజాగా విడుదల చేసిన యూఎఫ్ఓ ఫైళ్లలో ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ అమెరికాలోని ఓ రహస్య భద్రతా కేంద్రం సమీపంలో నల్లటి త్రిభుజాకార వస్తువును గుర్తించినట్లు ఇద్దరు సీనియర్ పరిశీలకులు నివేదించారు.
వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖ తాజాగా విడుదల చేసిన యూఎఫ్ఓ (UFO) ఫైళ్లలో ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ అమెరికాలోని ఓ రహస్య భద్రతా కేంద్రం సమీపంలో నల్లటి త్రిభుజాకార వస్తువును గుర్తించినట్లు ఇద్దరు సీనియర్ పరిశీలకులు నివేదించారు. ఆ వస్తువు అసాధారణ వేగంతో ప్రయాణించి, ఎలాంటి శబ్దం చేయకుండా క్షణాల్లో అదృశ్యమైనట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే, దాని మూలం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.
సాధారణ విమానాల లక్షణాలు లేవు..!
2026లో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అమెరికా రక్షణ శాఖ అక్టోబర్ 23న విడుదల చేసిన పత్రాల్లో వెల్లడించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆ వస్తువు సాధారణ సైనిక విమానాల మాదిరిగా కనిపించలేదు. దాని వెనుక ఎలాంటి పొగ లేదా ఇంధన దహన ఆనవాళ్లు కనిపించలేదు. అలాగే అది ఎటువంటి శబ్దం లేకుండా వేగంగా కదిలి అదృశ్యమైందని నివేదిక పేర్కొంది. ఆ వస్తువు ఆకారం డెల్టా వింగ్ డ్రోన్‌ను పోలి ఉందని పరిశీలకులు అంచనా వేశారు. దాని రెక్కల వెడల్పు సుమారు 9 నుంచి 15 అడుగుల వరకు ఉండవచ్చని తెలిపారు. గంటకు సుమారు 2,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అంచనా వేసినట్లు నివేదికల్లో పేర్కొన్నారు.
ఫొటోలు కాదు.. వివరణాత్మక చిత్రాలే..!
ఈ ఘటనకు సంబంధించి విడుదల చేసిన పత్రాల్లో తొమ్మిది చిత్రాలు ఉన్నప్పటికీ, అవి అసలు ఘటనను చిత్రీకరించిన ఫొటోలు లేదా వీడియోలు కావు. ఆ వస్తువు కదలికను వివరించే ప్రయత్నం చేశారు. అందువల్ల ఈ చిత్రాలు ఘటనకు బలమైన ఆధారాలను అందించడం లేదని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన చరిత్ర పరిశోధకుడు గ్రెగ్ ఎగీషియన్ అభిప్రాయపడ్డారు.
గ్రహాంతర నౌకేనని నిర్ధారణ కాలేదు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎఫ్ఓలకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయాలన్న ప్రకటనతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, అది ప్రయోగాత్మక విమానమా, డ్రోనా, ఇతర దేశానికి చెందిన సాంకేతిక పరికరమా అనే విషయాలపై స్పష్టత లేదు. అలాగే, వస్తువు కనిపించిన కచ్చితమైన ప్రదేశం, సాక్షుల వివరాలు వెల్లడించలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
జోర్డాన్‌లో చర్చిపై కాల్పులు.. ఏడుగురి మృతి, 40 మందికి గాయాలు
వనాటు దీవుల సమీపంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం..