జోర్డాన్‌లో చర్చిపై కాల్పులు.. ఏడుగురి మృతి, 40 మందికి గాయాలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 08:28 AM
జోర్డాన్‌లోని ఓ చర్చిపై దుండగులు జరిపిన కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుండగా సాయుధులు దాడికి తెగబడ్డారు.
అమ్మాన్: జోర్డాన్‌లోని ఓ చర్చిపై దుండగులు జరిపిన కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుండగా సాయుధులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు సుమారు 180 కి.మీ. దూరంలోని కరాక్ ప్రాంతంలో ఉన్న గ్రీక్ ఆర్థడాక్స్ చర్చిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియలు ప్రారంభమైన సుమారు 15 నిమిషాల తర్వాత ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో అక్కడున్నవారు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు.
జోర్డాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు పిస్టళ్లతో చర్చి వద్దకు వచ్చి కాల్పులు జరపడం కనిపించింది. అనంతరం సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో వచ్చిన మరో వ్యక్తి కూడా కాల్పులకు తెగబడ్డాడు. వీడియోలో ముగ్గురూ చర్చి వైపు దూసుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి. వారి దాడిలో ఓ వ్యక్తి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. పలువురు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే, దాడిలో పాల్గొన్న వారి కచ్చితమైన సంఖ్యపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కాగా, కాల్పుల్లో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి ఇబ్రహీం అల్-బడూర్ వెల్లడించారు. దాడికి పాల్పడినవారు ఎవరు? వారి వెనుక ఏదైనా ఉగ్రవాద సంస్థ ఉందా? అనే విషయాలు ఇంకా నిర్ధారణ కాలేదు. ఘటనపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ దాడిని జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 తీవ్రంగా ఖండించారు. బాధ్యులకు కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఈ దాడికి ఉగ్రవాద భావజాలం, మతోన్మాదమే కారణమని ప్రధాని జాఫర్ హసన్ పేర్కొన్నారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి దాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఈ ఘటనతో జోర్డాన్ ప్రభుత్వం మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. కాగా, దుండగులను గుర్తించి పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థా అధికారికంగా ప్రకటన చేయలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
వచ్చే నెలలో భారత్‌కు రానున్న బంగ్లాదేశ్ ప్రధాని!
టెహ్రాన్‌పై మరోసారి కాలు దువ్వుతున్న ట్రంప్.. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న ఇరాన్..