Share News

టెహ్రాన్‌పై మరోసారి కాలు దువ్వుతున్న ట్రంప్.. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న ఇరాన్..

ABN , Publish Date - Oct 24 , 2026 | 07:56 AM

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై మరో సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా.. అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగితే గల్ఫ్ ప్రాంతంలోని సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.

టెహ్రాన్‌పై మరోసారి కాలు దువ్వుతున్న ట్రంప్.. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న ఇరాన్..
Donald Trump

వాషింగ్టన్, అక్టోబర్ 24: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై మరో సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా.. అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగితే గల్ఫ్ ప్రాంతంలోని సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.


మరో సైనిక చర్యపై ట్రంప్ వ్యాఖ్యలు

శుక్రవారం ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా మరోసారి ‘ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో సైనిక చర్య చేపట్టవచ్చని పేర్కొన్నారు. అయితే, కొత్త దాడులు ఎప్పుడు జరుగుతాయి, వాటి లక్ష్యాలేమిటి అనే విషయాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం దాదాపు ఎనిమిదో నెలలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు యుద్ధాన్ని త్వరగా ముగించే సామర్థ్యం అమెరికాకు ఉందనీ ట్రంప్ పేర్కొన్నారు. అయితే, వెంటనే ముగించాలా, లేక క్రమంగా తగ్గుముఖం పట్టేలా చూడాలా అన్నది నిర్ణయించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

దాడులు జరిగితే కేబుళ్లపై ప్రతిదాడి

అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇద్దరు సీనియర్ ఇరాన్ భద్రతా అధికారులు హెచ్చరించారు. అమెరికా దాడికి దిగితే గల్ఫ్‌లోని సముద్రగర్భ సమాచార కేబుళ్లను ధ్వంసం చేసే ప్రణాళికలను ఇరాన్ సిద్ధం చేసిందని వెల్లడించారు. అలాగే, హోర్ముజ్ జలసంధి కింద ఉన్న ఏడు ప్రధాన ఇంటర్నెట్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికారి యదొల్లా జవానీ కూడా హెచ్చరించారు.

ఈ కేబుళ్లు అంతర్జాతీయ ఇంటర్నెట్ సమాచార రవాణాకు కీలకం. వీటికి నష్టం జరిగితే ఇంటర్నెట్ వేగం తగ్గడం, ఆన్‌లైన్ లావాదేవీలు, ఈ-కామర్స్, క్లౌడ్ సేవలకు అంతరాయం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అయితే, ప్రపంచ అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌లో హోర్ముజ్ జలసంధి గుండా ఒక శాతం కంటే తక్కువే ప్రయాణిస్తోందని టెలికమ్యూనికేషన్ పరిశోధకులు పేర్కొంటున్నారు.


చర్చలకే ప్రాధాన్యమివ్వాలంటున్న దేశాలు..

ఇరాన్‌పై కొత్త దాడులు జరిగితే యుద్ధం ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందని తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ హెచ్చరించారు. ఫ్రాన్స్ కూడా తాజా సైనిక ఘర్షణలు చమురు ధరలను పెంచే ప్రమాదం ఉందని పేర్కొంది. దీనిపై జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఇరాన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాయని జర్మనీ విదేశాంగ మంత్రి తెలిపారు. కాగా, అమెరికా తదుపరి అడుగులు, ఇరాన్ ప్రతిస్పందన, దౌత్యపరమైన చర్చలు ఈ యుద్ధం భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. కొత్త దాడులు జరిగితే చమురు సరఫరాతో పాటు గల్ఫ్ ప్రాంతంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

అకస్మాత్తుగా ప్యాసింజర్లకు వాంతులు.. విమానంలో కలకలం

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..

Updated Date - Oct 24 , 2026 | 08:30 AM