అకస్మాత్తుగా ప్యాసింజర్లకు వాంతులు.. విమానంలో కలకలం
ABN , Publish Date - Oct 23 , 2026 | 09:27 PM
ఐరోపాకు చెందిన ఓ ఎయిర్‌లైన్స్‌లో పలువురు ప్రయాణికులు అకస్మాత్తుగా అనారోగ్యం పాలుకావడం కలకలానికి దారి తీసింది. రోడ్స్ నుంచి డసల్‌డార్ఫ్ వెళుతున్న యూరోవింగ్స్ విమానంలో అక్టోబర్ 18న ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐరోపాకు చెందిన ఓ ఎయిర్‌లైన్స్‌లో పలువురు ప్రయాణికులు అకస్మాత్తుగా అనారోగ్యం పాలుకావడం కలకలానికి దారి తీసింది. రోడ్స్ నుంచి డసల్‌డార్ఫ్ వెళుతున్న యూరోవింగ్స్ విమానంలో అక్టోబర్ 18న ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్స్ నుంచి బయలుదేరిన కాసేపటికి పలువురు ప్రయాణికులు అనారోగ్యం పాలయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో సతమతం అయ్యారు. పలువురు వాంతులు చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాధితులు నోరోవైరస్ బారిన పడి ఉండవచ్చన్న భయాలు మొదలయ్యాయి.
విమానంలో కలకలం రేగడంతో ఫ్లైట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు సమాచారం అందించారు. ఈలోపు విమానం డసల్‌డార్ఫ్‌లో ల్యాండైంది. వైరస్ వ్యాప్తి భయాల నేపథ్యంలో అత్యవసర వైద్య సిబ్బంది హాజ్మాట్ సూట్స్‌లో విమానంలోకి వెళ్లారు. వైరస్ వ్యాప్తి కాకుండా అనేక క్వారంటైన్, స్క్రీనింగ్ ప్రోటోకాల్స్‌ను అనుసరిస్తూ ప్యాసింజర్లను చెక్ చేశారు. ఆ తరువాత బాధితులను ఆసుపత్రికి తరలించారు. విమానం ల్యాండైన దాదాపు 90 నిమిషాలకు ప్రయాణికులను కిందకు దిగేందుకు అనుమతించారు.
ప్యాసింజర్ల అనారోగ్యానికి కారణమేంటో తెలుసుకునేందుకు యూరోవింగ్స్ దర్యాప్తు ప్రారంభించింది. అయితే, రోడ్స్ నుంచి బయలుదేరినందున ప్యాసింజర్లు అక్కడ నోరోవైరస్ బారిన పడి ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. జులైలో నోరోవైరస్ వ్యాప్తి కారణంగా రోడ్స్‌లో కలకలం రేగింది.
ఈ వార్తలనూ చదవండి:
వచ్చే నెలలో భారత్‌కు రానున్న బంగ్లాదేశ్ ప్రధాని!
భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజెర్‌బైజాన్ విదేశాంగ మంత్రి