Share News

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..

ABN , Publish Date - Oct 24 , 2026 | 07:18 AM

అమెరికా మధ్యంతర ఎన్నికల సమయంలో కెనడాకు ఊరట లభించింది. కెనడా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై విధించిన సుంకాలను తొలగిస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..
US Canada trade war

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల సమయంలో కెనడాకు ఊరట లభించింది. కెనడా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై విధించిన సుంకాలను తొలగిస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా వస్తువులపై గతంలో విధించిన 50 శాతం సుంకాల నుంచి కొన్ని ఉత్పత్తులకు మినహాయింపులు కల్పించారు. అదే సమయంలో మరికొన్ని వస్తువులపై కొత్తగా సుంకాలు విధించనున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది (Donald Trump Canada tariffs).


కెనడా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ప్లైవుడ్ పలకలు, కాగితపు ఉత్పత్తులు, ప్రత్యేక యంత్రాలు, శీతలీకరణ పరికరాలపై సుంకాల నుంచి మినహాయింపులు కల్పించారు. ప్యాకింగ్ పెట్టెలు, కొన్ని వ్యవసాయ అవసరాలకు సంబంధించిన ఉత్పత్తులకు కూడా ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం కలగనుంది. ఈ మార్పులు అక్టోబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. కెనడా నుంచి అవసరమైన పరికరాలు, ప్యాకేజింగ్ సామగ్రిని దిగుమతి చేసుకునే అమెరికా వ్యాపార సంస్థలు, రైతులకు దీని వల్ల కొంత ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది (US Canada trade war).


అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని అధ్యక్షుడు ట్రంప్‌నకు చెందిన రిపబ్లికన్ పార్టీ ప్రయత్నిస్తోంది (US midterm elections 2026). ఈ నేపథ్యంలో కెనడా సరిహద్దుకు ఆనుకుని ఉన్న మైనే రాష్ట్రంలో పోటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడ రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ సుసాన్ కాలిన్స్‌కు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ట్రాయ్ జాక్సన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కెనడా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాల కారణంగా స్థానిక రైతులు, వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాలిన్స్ వైట్‌హౌస్ దృష్టికి తీసుకెళ్లారు. తాజా మినహాయింపులతో మైనే రాష్ట్రంలోని బ్లూబెర్రీ, బంగాళాదుంప, యాపిల్, సముద్రపు నాచు ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలగవచ్చని ఆమె పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 07:21 AM