పల్లె పండుగకు నిధుల గండం
ABN , Publish Date - Oct 24 , 2026 | 01:55 AM
జిల్లాలో పల్లె పండుగ కింద చేపడుతున్న పనులకు నిధుల గండం పొంచి ఉంది. మంజూరు చేస్తున్నవి, వాటిలో పూర్తి చేసిన వాటికి బిల్లుల చెల్లింపులకు సరిపడా నిధులు అందుబాటులో కనిపించడం లేదు. అందుకు ఉపాధి (వీబీ జీరామ్‌జీ) పథకం రాష్ట్రం వాటా చెల్లింపుల్లో జాప్యమే కారణమని తెలుస్తోంది.
రెండు విడతలుగా రూ.186.48 కోట్ల పనులు
ఇప్పటికే రూ.113 కోట్ల బిల్లులు పెండింగ్
తాజాగా రూ.141.20 కోట్ల వర్క్‌లు మంజూరు
ఈ ఏడాది ఆఖరు వరకు రూ.110 కోట్లు మాత్రమే అందుబాటు
ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇస్తేనే ఈ పనులకు బిల్లులు
ఒంగోలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పల్లె పండుగ కింద చేపడుతున్న పనులకు నిధుల గండం పొంచి ఉంది. మంజూరు చేస్తున్నవి, వాటిలో పూర్తి చేసిన వాటికి బిల్లుల చెల్లింపులకు సరిపడా నిధులు అందుబాటులో కనిపించడం లేదు. అందుకు ఉపాధి (వీబీ జీరామ్‌జీ) పథకం రాష్ట్రం వాటా చెల్లింపుల్లో జాప్యమే కారణమని తెలుస్తోంది. అంతేకాక పథకం నిబంధనల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవ త్సరానికి కేవలం రూ.110కోట్లు మాత్రమే మెటీరియల్ కోటా కింద నిధులు అందుబాటులో ఉండను న్నాయి. ఆ మొత్తం గత రెండు విడతల నుంచి పెండింగ్ ఉన్న బిల్లులకే సరిపోవు. దీంతో తాజా గా మంజూరు చేసిన పనులకు నిధుల కొరత ఎదురుకానుంది. పల్లె పండుగకు నిధుల సమస్య ఎదురైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లె పండుగ కింద రెండు విడతలుగా జిల్లాలో సుమారు రూ.186.40 కోట్ల విలువైన పనులు జరిగాయి. వాటికి సంబంధించి ఇంకా సుమారు రూ.113 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత ఏడాది దాదాపు రూ.141 కోట్లకుపైగా విలువైన పనులు మంజూరు చేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకు లెక్కించినా రూ.110 కోట్లకు మించి నిధులు అందుబాటులో సంబంధిత శాఖ ద్వారా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఒకవైపు కూలీలకు పనుల కల్పన ద్వారా వేతనాలు, మరోవైపు ఆ పథకం మెటీరియల్ కోటా నిధుల నుంచి గ్రామాల్లో మౌలిక సదుపాయాల మెరుగు జరుగుతోంది.
భారీగా అభివృద్ధి పనులు
గతంలో కేంద్రం నుంచి అధిక నిధులు రాగా పెద్దఎత్తున జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2014-19 మధ్య కాలంలో గ్రామాలలో సిమెంటు రోడ్లు, డ్రెయిన్లు, వివిధ రకాల భవన నిర్మాణా లు, శ్మశానాలు, విద్యా సంస్థల అభివృద్ధి పనులు జరిగాయి. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె పండుగ పేరుతో ఈ నిధుల ద్వారా భారీగానే పనులు చేపట్టారు. అలా గత రెండేళ్లలో పల్లెపండుగ 1.0, 2.0 కింద సుమారు రూ.186.48 కోట్లు వెచ్చించారు. ఆ నిధులతో వందలాది గ్రామాలలో రోడ్లు, డ్రెయిన్లు, ఇతర పనులు జరిగాయి. అధికారవర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు విడతలలో సుమారు 250 కిలోమీటర్లకుపైగా సిమెంటు రోడ్లు, 77.53 కి.మీ తారురోడ్లు నిర్మించారు. ఇందుకోసం మొత్తం రూ.186.48 కోట్లు వెచ్చించగా అత్యధికంగా అద్దంకి నియోజకవర్గంలో సుమారు రు.49.50 కోట్లు ఖర్చుచేశారు.
కోడ్‌కు ముందే భారీగా శంకుస్థాపనలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత నెలలో పల్లెపండుగ 3.0 కింద సుమారు రు.141 కోట్లకుపైగా విలువైన పనులను అధికారులు మంజూరు చేశారు. గత నెలాఖరులో వారం వ్యవధిలోనే సుమారు 171.43 కి.మీ మేర సిమెంటు, తారు, గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి రూ.131.48 కోట్ల విలువైన 435 పనులు మంజూరు చేశారు. ఈనెల తొలి వారంలో మరో రూ.10 కోట్ల పనులు కేటాయించారు. స్థానిక ఎన్నికల కోడ్ వచ్చేలోపు దాదాపు ఈ పనులన్నింటికీ శంకుస్థాపనలు చేశారు. అలా రెండు విడతల్లో పూర్తయిన రూ.186.48 కోట్లు, తాజాగా మంజూరు చేసిన రూ.141 కోట్లు కలిపి మొత్తం దాదాపు రూ.327.48 కోట్ల మేర పల్లెపండుగ కింద మూడు విడతులలో పనులు చేపట్టారు. అయితే తొలిరెండు విడతలలో రూ.186.48 కోట్ల పనులు పూర్తిచేసినా వాటిని చేసిన వారికి సగం బిల్లులు కూడా రాలేదు. సుమారు రూ.113 కోట్ల మేర బిల్లులు పెండింగ్ ఉన్నట్లు సమాచారం.
రూ.254కోట్ల మేర పెండింగ్
పాత బిల్లులు పెండింగ్‌తోపాటు తాజాగా మంజూరు చేసిన పనుల పూర్తితో మరో రూ.141కోట్లు వెరసి సుమారు రూ.254 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే అందులో సగం నిధులు కూడా సంబంధిత అధికారుల వద్ద అందుబాటులో లేవని తెలుస్తోంది. ఉపాధి పఽథకంగా గతంలో ఉన్న చట్టం ప్రస్తుతం వీబీ జీరామ్‌జీగా పేరు మారడంతోపాటు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా తగ్గాయి. సాధారణంగా ఉపాధి హామీ పఽథకంలో వేతన మొత్తంలో రెండొంతులు మెటీరియల్ కోటా కింద వెచ్చించే అవకాశం ఉంది. అందులో 90శాతం నిధులు కేంద్రం ద్వారా వస్తాయి. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అధికభారం లేకపోవడంతో భారీగా పనులు చేయడంతోపాటు బిల్లులు చెల్లింపు జరిగేది.
అందుబాటులో రూ.110కోట్లే!
ప్రస్తుత వీబీ జీరామ్‌జీ చట్టం ప్రకారం మొత్తం పఽథకం నిధులలో 40శాతం రాష్ట్రం సమకూర్చాల్సి ఉంటుంది. అలా రాష్ట్రంపై అధిక భారం పడనుండటంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. అంతేకాక పథకం నిబంధనల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి ఆఖరులోపు జిల్లాలో కేవలం రూ.110 కోట్లు మాత్రమే మెటీరియల్ కోటా కింద నిధులు అందుబాటులో ఉండనున్నాయి. ఆ మొత్తం సకాలంలో చెల్లింపు చేసినా గత రెండు విడతల నుంచి పెండింగ్ ఉన్న బిల్లులు క్లియర్ చేయడానికే సరిపోవు. దీంతో తాజాగా మంజూరు చేసిన పనులకు నిధుల కొరత ఎదురుకానుంది. ప్రత్యేకంగా ప్రభుత్వం ఈ పనుల కోసం అధికంగా నిధులు ఇస్తే తప్ప రెగ్యులర్ పథకం కోటా ప్రకారం అయితే అధిక శాతం పనులకు నిధుల సమస్య ఏర్పడనుంది.