అమెరికాతో వాణిజ్యం చేయలేరు.. భారత్-పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ మళ్లీ అవే వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 24 , 2026 | 10:37 AM
భారత్, పాకిస్థాన్ మధ్య 2025లో జరిగిన సైనిక ఘర్షణను తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఇరు దేశాలపై 250 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించడంతోనే కాల్పులు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య 2025లో జరిగిన సైనిక ఘర్షణను తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఇరు దేశాలపై 250 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించడంతోనే కాల్పులు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్యం చేసే అవకాశాన్ని కోల్పోతారని ఇరు దేశాల నాయకులను హెచ్చరించినట్లు చెప్పారు. అయితే, భారత్ మాత్రం ఈ ఘర్షణలో మూడో దేశం మధ్యవర్తిత్వం వహించిందన్న వాదనను పదేపదే ఖండిస్తోంది (Donald Trump on India Pakistan Conflict).
ఫ్లోరిడాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ భారత్-పాకిస్థాన్ ఘర్షణ గురించి మాట్లాడారు. ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలని, వాటి మధ్య పోరు కొనసాగితే అమెరికాతో వాణిజ్య సంబంధాలను నిలిపివేస్తామని చెప్పినట్లు వివరించారు. 'మీరు పోరాడుతూనే ఉంటే అమెరికాతో వ్యాపారం చేయలేరు. మీపై 250 శాతం భారీ సుంకాలు విధిస్తా. అప్పుడు మీరు ఎలాంటి వ్యాపారమూ చేయలేరు' అని హెచ్చరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. తన హెచ్చరికలతో ఇరు దేశాల నాయకులు ఆగ్రహానికి గురయ్యారని, చివరకు కాల్పులు ఆపేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధంగా పలు యుద్ధాలను ఆపానని మరోసారి తనకు తానే ఘనత ఆపాదించుకున్నారు (250% Tariff Threat).
భారత్-పాకిస్థాన్ సైనిక ఘర్షణలో 11 విమానాలు కూలిపోయాయని కూడా ట్రంప్ పేర్కొన్నారు (India Pakistan Ceasefire). అయితే, ఏ దేశానికి చెందిన విమానాలు ఎన్ని కూలిపోయాయనే వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా, కాల్పుల విరమణలో అమెరికా పాత్రను భారత్ ఇప్పటివరకు నిర్ధారించలేదు. భారత్-పాక్ సైనిక ఘర్షణను నిలిపివేయాలని ఏ ప్రపంచ నాయకుడూ తనను కోరలేదని ప్రధాని మోదీ గతంలో స్పష్టం చేశారు. అయితే పాకిస్థాన్ మాత్రం అమెరికా వల్లే కాల్పుల విరమణ జరిగినట్టు పలు సందర్భాల్లో చెప్పింది.
ఇవి కూడా చదవండి..
అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..