Share News

మనవరాలి కోరిక మేరకే వైదిక వివాహం.. విమర్శలపై డీఎంకే నేత స్పందన..

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:44 PM

డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత దురైమురుగన్ మనవరాలి వివాహం సాంప్రదాయ వైదిక పద్ధతిలో జరగడంపై ద్రావిడ ఉద్యమ నేతల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దురైమురుగన్ స్పందించారు.

మనవరాలి కోరిక మేరకే వైదిక వివాహం.. విమర్శలపై డీఎంకే నేత స్పందన..
Duraimurugan

ఇంటర్నెట్ డెస్క్: డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత దురైమురుగన్ మనవరాలి వివాహం సాంప్రదాయ వైదిక పద్ధతిలో జరగడంపై ద్రావిడ ఉద్యమ నేతల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దురైమురుగన్ స్పందించారు. తన మనవరాలి కోరిక మేరకే వైదిక పద్ధతిలో వివాహం జరిపించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. జరిగిన పరిణామంపై విచారం వ్యక్తం చేస్తూనే, ఈ విషయాన్ని రాజకీయ వివాదంగా మార్చవద్దని కోరారు (Vedic Wedding Controversy).


డీఎంకే పార్టీ ద్రావిడ ఉద్యమ భావజాలాన్ని అనుసరిస్తుంది. హేతువాదం, సామాజిక సమానత్వం, స్వాభిమాన వివాహాలు ఆ పార్టీ సిద్ధాంతాల్లో కీలకమైనవి. ముఖ్యంగా పెరియార్ ప్రోత్సహించిన స్వాభిమాన వివాహాల్లో పురోహితులు, సంస్కృత మంత్రాలకు ప్రాధాన్యం ఉండదు. అయితే దురైమురుగన్ మనవరాలి పెళ్లిని పురోహితుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులు, సంస్కృత మంత్రాలతో నిర్వహించారు. దీంతో పార్టీ సిద్ధాంతాలకు, ఆచరణకు మధ్య వ్యత్యాసం ఉందంటూ విమర్శలు వచ్చాయి. ద్రావిడ ఉద్యమంలో కీలకంగా ఉన్న దురైమురుగన్ కుటుంబంలోనే వైదిక పద్ధతిలో పెళ్లి జరగడంపై ద్రవిడర్ కళగం అధ్యక్షుడు కే. వీరమణి విమర్శలు గుప్పించారు (Duraimurugan Granddaughter Wedding).


ఈ వివాదంపై దురైమురుగన్ స్పందించారు. తన మనవరాలు విదేశాల్లో చదువుకుందని, అక్కడ వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని వెల్లడించారు (Dravidian Politics). అతడినే వివాహం చేసుకోవాలనుకుంటున్నానని, వైదిక సాంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకుంటానని తన మనవరాలు కోరినట్లు తెలిపారు. ఆమె కోరికను గౌరవించాల్సిన పరిస్థితి తనకు ఏర్పడిందని, అందుకే వైదిక పద్ధతిలో వివాహం జరిపించినట్లు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఎవరూ రాజకీయంగా చూడవద్దని, చర్చనీయాంశంగా మార్చవద్దని విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..


అమెరికా దాడుల భయం.. ఇరాన్‌లో అయోడిన్ మాత్రలు పంచుతున్నారా..

Updated Date - Nov 07 , 2026 | 04:44 PM