రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..
ABN , Publish Date - Nov 07 , 2026 | 03:31 PM
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరు దేశాలు తొలిసారిగా ఒక ఒప్పందానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరు దేశాలు తొలిసారిగా ఒక ఒప్పందానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ యుద్ధానికి సంబంధించి త్వరలోనే భారీ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కేవలం రష్యా, ఉక్రెయిన్ దేశాలకే పరిమితం కాకుండా యూరప్‌లోని ఇతర దేశాలను కూడా కలుపుకోవచ్చని వెల్లడించారు (Trump about Russia Ukraine War).
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిత్రివ్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమైన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ దేశాలు తొలిసారిగా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఒకే వేదికపైకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తనకు అనిపిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య పెద్ద ఒప్పందం కుదరవచ్చని పేర్కొన్నారు. 'ఇది చాలా పెద్ద ఒప్పందం కాబోతోంది. యూరప్ మొత్తానికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉండవచ్చు' అని ట్రంప్ అభిప్రాయపడ్డారు (Russia Ukraine Peace Deal).
యూరప్ భద్రత, నాటో పాత్ర, భవిష్యత్తులో యుద్ధం మళ్లీ తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలు కూడా చర్చల్లోకి వచ్చే అవకాశం ఉంది (Europe Peace Agreement). కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ ప్రతిపాదనపై ఆచితూచి స్పందించారు. రష్యా, యూరప్ మధ్య కుదిరే భద్రతా ఒప్పందం అంత సులభమైన విషయం కాదని, కొన్ని ప్రతిపాదనలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. యుద్ధాన్ని ముగించే ఒప్పందం కుదరాలంటే ముందుగా ఇరు దేశాల మధ్య ప్రధాన సమస్యలకు పరిష్కారం లభించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి...
జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం
భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్.. అరెస్ట్