Share News

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ..

ABN , Publish Date - Nov 07 , 2026 | 03:51 PM

E20 పెట్రోల్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. E20 పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్ ఉందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించడంతో వివాదం మొదలైంది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ..
MP Rahul Gandhi

న్యూఢిల్లీ: E20 పెట్రోల్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. E20 పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్ ఉందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించడంతో వివాదం మొదలైంది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి పలు సూటి ప్రశ్నలు సంధించారు.


ఈ సందర్భంగా పెట్రోల్‌లో పరిమితికి మించి ఇథనాల్ కలుపుతున్నారంటూ కేంద్రంపై ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్‌లో 20 శాతం మాత్రమే ఇథనాల్ ఉందని కేంద్రం చెబుతుండగా.. వాస్తవంగా అంతకంటే ఎక్కువ మోతాదులో కలుపుతున్నట్లు ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం ఏడు జిల్లాల నుంచి సేకరించిన పెట్రోల్ నమూనాలను గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షించగా.. ఈ విషయం బయటపడిందని తెలిపారు. మొత్తం 14 నమూనాలకు గానూ 11 నమూనాల్లో 20 శాతానికి మించి ఇథనాల్ ఉన్నట్లు తేలిందని రాహుల్ వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) పెట్రోల్‌లో 31.2 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం (HPCL)లో 30.5 శాతానికి మించి ఉన్నట్లు వెల్లడైందన్నారు.


ప్రభుత్వ రంగ సంస్థలైన ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎస్‌తో పాటు ప్రైవేటు సంస్థలైన నయారా, షెల్ కంపెనీల పెట్రోల్ నమూనాల్లోనూ నిర్దేశిత 20 శాతం పరిమితికి మించి ఇథనాల్ ఉందని రాహుల్ ఆరోపించారు. ఆయా కంపెనీల సొంత ప్రయోగశాలలు మాత్రం దీనిని వెల్లడించలేదని విమర్శించారు. పెట్రోల్‌లో అధిక మోతాదులో ఇథనాల్ కలపడం వల్ల వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆగ్రహించారు. దీని వల్ల వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు తరచూ మరమ్మతులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. అధిక ధర చెల్లించి పెట్రోల్ కొనుగోలు చేస్తున్న ప్రజలకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకుల్లో విక్రయిస్తున్న ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో తెలిపే సమాచార వ్యవస్థ కూడా అందుబాటులో లేదని మండిపడ్డారు. దీంతో వాహనదారులకు తాము ఎలాంటి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నామో తెలుసుకునే అవకాశం లేకుండా పోతోందని విమర్శించారు.


పెట్రోల్‌లో వాస్తవంగా ఎంత శాతం ఇథనాల్ కలుపుతున్నారో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నిర్దేశిత 20 శాతం పరిమితిని మించి కలుపుతున్న కంపెనీలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిజంగా ఎవరికి ప్రయోజనం కలుగుతోందో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాగా, కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన పెట్రోల్ నమూనాల పరీక్షల ఫలితాలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ చేసిన ఈ పోస్టు రాజకీయంగా చర్చనీయాంశమైంది.


ఈ వార్తలు కూడా చదవండి

మత్తుమందు ఇచ్చి లైంగిక దాడులు! కేరళ డాక్టర్ కేసు కొత్త మలుపు

'ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది'.. బీజేపీపై సోనియా విమర్శలు

Updated Date - Nov 07 , 2026 | 04:24 PM