Share News

'ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది'.. బీజేపీపై సోనియా విమర్శలు

ABN , Publish Date - Nov 07 , 2026 | 02:13 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ సంస్థల పనితీరుకు నష్టం కలిగించిందని సోనియా గాంధీ ఆరోపించారు. తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల సంఘం, మీడియా సంస్థలపై విమర్శలు చేశారు.

'ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది'.. బీజేపీపై సోనియా విమర్శలు

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ వల్ల పన్నెండేళ్లుగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ సంస్థల పనితీరుకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఆ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలు లభించడం లేదన్నారు. ఈ నెల 10న తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సందర్భంగా ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వూ ఇచ్చారామె. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం, ప్రముఖ మీడియా సంస్థలపై పట్టు సాధించడం తప్ప.. ఆ పార్టీ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.


'ఓటు చోరీ అంశం సహా చాలా విషయాల్లో ప్రజల్లో క్రమంగా అసంతృప్తి పెరుగుతోంది. దేశానికి జరిగిన నష్టాన్ని వారు గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా పోరాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి మేం పనిచేస్తున్నాం. పార్టీ విజయావకాశాలు రోజురోజుకూ మెరుగవుతున్నాయి' అని ఆశాభావం వ్యక్తం చేశారు సోనియా. ఇక అత్యవసర పరిస్థితిపై ఆమె స్పందిస్తూ.. నాటి పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఇందిరాగాంధీ స్వయంగా 1977లో ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఉల్లంఘనలపై ఆమె తర్వాత బహిరంగంగా విచారం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు.


సోనియా వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ స్పందించారు. 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మరోవైపు.. బీజేపీ నేతలు కూడా ఆమె వ్యాఖ్యలను ఖండించారు.


ఇవీ చదవండి:

60 రోజులు నిద్రపోయి రూ.9.6 లక్షలు సొంతం చేసుకున్న మహిళ!

ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.170 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన

Updated Date - Nov 07 , 2026 | 02:14 PM