Share News

ఇంధన నాణ్యతపై వివాదం.. చమురు సంస్థలపై రాహుల్‌ విమర్శలు

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:09 PM

కర్ణాటకలోని 7 జిల్లాల నుంచి సేకరించిన 14 పెట్రోల్ నమూనాల్లో 11 నమూనాలకు 20 శాతానికి మించి ఇథనాల్‌ ఉన్నట్లు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఐఓసీఎల్‌ నమూనాలో గరిష్ఠంగా 31.2 శాతం ఉన్నట్లు వెల్లడించారు.

ఇంధన నాణ్యతపై వివాదం.. చమురు సంస్థలపై రాహుల్‌ విమర్శలు
E20 has become 420: Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపే పరిమితిని చమురు సంస్థలు ఉల్లంఘిస్తున్నాయా? వాహనదారులకు తెలియకుండానే అధిక మోతాదులో ఇథనాల్‌ కలిపిన ఇంధనాన్ని విక్రయిస్తున్నాయా? అంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్ణాటకలోని 7 జిల్లాల నుంచి సేకరించిన పెట్రోల్‌ నమూనాల్లో 20 శాతానికి మించి ఇథనాల్‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని ఎక్స్ వేదికగా ఆయన ఆరోపించారు.


మొత్తం 14 నమూనాలను గుర్తింపు పొందిన ఓ ప్రయోగశాలలో పరీక్షించగా.. 11 నమూనాల్లో ఇథనాల్‌ 20 శాతానికి మించి ఉన్నట్టు వెల్లడించారు రాహుల్. అందులో గరిష్ఠంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీఎల్‌) నమూనాలో 31.2 శాతం, హిందుస్థాన్‌ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్‌) నమూనాలో 30.5 శాతం ఇథనాల్‌ ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఇథనాల్‌ మిశ్రమ విధానంపై విమర్శలు గుప్పిస్తూ.. 'ఈ20 కాస్తా 420గా మారింది.. ప్రజల వాహనాల్లోని పెట్రోల్‌ను దోచుకుంటున్నారు' అని వ్యాఖ్యానించారు.


కాగా.. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం, చమురు విక్రయ సంస్థల మధ్య ఇప్పటికే వివాదం నెలకొంది. మరోవైపు.. ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌ వంటి పలు సంస్థలు ఈ ఆరోపణల్ని ఖండించాయి. శాంపిల్ కలెక్షన్స్, టెస్టింగ్ విధానంలో లోపాలున్నాయని వ్యాఖ్యానించాయి. తాము విక్రయిస్తున్న ఈ20 పెట్రోల్‌.. భారత ప్రమాణాల సంస్థ(బీఐఎస్‌) నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగానే ఉందని స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షించిన 893 నమూనాల్లోనూ ఇథనాల్‌ శాతం 19 నుంచి 21 మధ్యే ఉన్నట్లు తెలిపాయి. వీటిలో కర్ణాటకకు చెందిన 56 నమూనాలు కూడా ఉన్నాయన్నాయి.


ఇవీ చదవండి:

60 రోజులు నిద్రపోయి రూ.9.6 లక్షలు సొంతం చేసుకున్న మహిళ!

ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.170 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన

Updated Date - Nov 07 , 2026 | 12:18 PM