Share News

నిమ్స్‌లో ఇదేం గోల..!

ABN , Publish Date - Sep 23 , 2026 | 08:26 AM

నిమ్స్‌లో కొంతమంది ఉన్నతాధికారులు, విభాగాల అధిపతులపై తరచూ ఏసీబీ దాడులు చేస్తుండడంతో ఆందోళన నెలకొంటోంది.

నిమ్స్‌లో ఇదేం గోల..!
NIMS Hyderabad

  • తరచూ ఏసీబీ దాడులు..

  • పరికరాల కొనుగోళ్లలో గోల్‌మాల్‌..

  • పలువురు అధికారులపై అవినీతి మరకలు

హైదరాబాద్‌ సిటీ: నిమ్స్‌లో కొంతమంది ఉన్నతాధికారులు, విభాగాల అధిపతులపై తరచూ ఏసీబీ దాడులు చేస్తుండడంతో ఆందోళన నెలకొంటోంది. తాజాగా ఆదాయం కంటే అధిక ఆస్తులున్నాయనే ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు నిమ్స్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మి భాస్కర్‌రావు ఇళ్లపై మంగళవారం దాడులు నిర్వహించారు. నిమ్స్‌ అధికారులపై గతంలో కూడా ఏసీబీ దాడులు జరిగాయి. ముగ్గురు డైరెక్టర్ల హయాంలో అవినీతి ఆరోపణలు బాగా వినిపించాయి. ఓ డైరెక్టర్‌ హయాంలో కోట్ల రూపాయల అవినీతి నిర్ధారణ కావడంతో అప్పట్లో సదరు అధికారిని తప్పించారు. 2013 జనవరిలో అప్పటి సీనియర్‌ డాక్టర్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కంపెనీకి చెందిన వ్యక్తి నుంచి రూ.1.6 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇలాంటి ఘటనలు నిమ్స్‌లో అనేకం చోటు చేసుకున్నాయి.


పరికరాల కొనుగోళ్లలో..

2011 నుంచి 2013 వరకు వైద్య పరికరాల కొనుగోళ్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు అవినీతి నిరోధకశాఖ నిర్ధారణకు వచ్చింది. అప్పట్లో పనిచేసిన ఉన్నతాధికారుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లెక్కకు మించి ఆస్తులున్నట్లు గుర్తించారు. నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌, అడిషనల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌, ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌ ఇళ్లల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అప్పట్లో దాదాపు రూ.80 కోట్లతో కొనుగోలు చేసిన పరికరాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. కొత్త బ్లాక్‌ నిర్మాణంలో కూడా నిబంధనలను తుంగలో తొక్కారు. ఏడాది సమయంలో కొనుగోలు చేయాల్సిన పరికరాలను కేవలం నెలలో కొనుగోలు చేశారు. టెండర్లను పిలవకుండానే ఏకపక్షంగా కొనుగోలు చేసినట్లు అప్పట్లో అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీనిపై ఈటల రాజేందర్‌ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు.


మంచాల కొనుగోలులో..

అవసరం లేకపోయినా గతంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి మంచాలను కొనుగోలు చేశారు. విభాగాల అధికారులకు తెలియకుండా, పాత మంచాల వివరాలు అందించకుండా కొత్తవి కొన్నట్లు విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందాయి. ఇంటెన్సివ్‌ కేర్‌ వార్డుల కోసం ఒక్కో మంచాన్ని రూ.56వేలు పెట్టి దాదాపు 260 మంచాలు కొనుగోలు చేశారు. ఐసీయూ వార్డులో వినియోగించే ఫంక్షన్‌ మంచాలను ఒక్కొక్కటి రూ.18వేలు పెట్టి 600 మంచాలు కొనుగోలు చేశారు. పాత మంచాలు బాగానే ఉన్నప్పటికీ కొత్తవి కొనుగోలు చేయడంలో గోల్‌మాల్‌ జరిగిందనే ఫిర్యాదులు విజిలెన్స్‌కు అందాయి. అవసరం లేకుండా వంద వెంటిలేటర్లను రూ.35 కోట్లు పెట్టి కొనుగోలు చేశారని, మార్కెట్‌ ధర కంటే ఎక్కువగా పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు విమర్శలు వచ్చాయి.


city3.2.jpgదారి తప్పిన నిధులు

గతంలో ట్రామా కేర్‌ సెంటర్‌, స్పెషాలిటీ బ్లాక్‌ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎంఎ్‌సఎన్‌వై కింద రూ.150 కోట్లు కేటాయించింది. కిరణ్‌ కుమార్‌ ప్రభుత్వం మరో రూ.50కోట్లు, బీబీనగర్‌ క్యాంపస్‌ కోసం మరో రూ.60 కోట్లు మంజూరు చేసింది. కేంద్రం ఇచ్చిన రూ.150 కోట్లలో 50 శాతం నిధులను భవన నిర్మాణానికి, మిగతా నిధులను పరికరాలు, ఇతర మౌలిక సదుపాయలకు వెచ్చించాలని నిర్ధేశించింది. అంతకు ముందు రోశయ్య ప్రభుత్వం కూడా 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు కేటాయించింది. నిమ్స్‌కు కోట్ల రూపాయంలో నిధులు రావడంతో ఉన్నతాధికారులు, ఇతర అధికారుల కన్ను పడిందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు వంతపాడుతూ అధిక నిధులను నిర్మాణాలకే మళ్లించారు. ట్రామా కేర్‌ సెంటర్‌, స్పెషాలిటీ బ్లాక్‌ కోసం రూ.150 కోట్ల వరకు, బీబీనగర్‌ క్యాంపస్‌ కోసం మరో 70 కోట్ల వరకు ఖర్చు చేశారు. మిగిలిన దాదాపు 89 కోట్లతో కొనుగులు చేసిన పరికరాల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులు వచ్చాయి.


మూడు లక్షల వెంటిలేటర్‌కు రూ.9.56 లక్షలు

వైద్య పరికరాల కొనుగోలు విషయంలో పర్చేజింగ్‌ కమిటీని నిమ్స్‌ అధికారులు తప్పుదారి పట్టించినట్లు అప్పటి ప్రభుత్వం గుర్తించింది. వివిధ విభాగాల్లో 14 ఆపరేషన్ల టేబుళ్లను ఒక్కొక్కటి రూ.42 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. ఇక రెండు, మూడు లక్షల్లో వచ్చే వెంటిలేటర్లను రూ.9.56 లక్షలు పెట్టి 95 వెంటిలేటర్లను కొనుగోలు చేశారు. అంతేకాకుండా అనస్థీషియా వర్క్‌స్టేషన్లు, రేడియాలజీ, డిజిటల్‌ ఎక్స్‌రే మిషన్లు, యూరాలజీ మిషన్లు, ఆపరేటింగ్‌ మైక్రో స్కోప్ లు మొదలైనవి కూడా అధిక ధరలకు కొన్నారు. ఎల్‌-1, ఎల్‌-2 కంపెనీల నుంచి కాకుండా, ఎల్‌-3 కంపెనీల ద్వారా కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ధర్మరక్షక్‌ బాధ్యతలు చేపట్టిన మొదటి నుంచి అనేక ఆరోపణలు, ఫిర్యాదులు చోటు చేసుకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్‌ షాప్‌ల బంద్‌

నీళ్లడిగితే రాజకీయం అంటారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 08:26 AM