ఆశగా.. ఆసక్తిగా.. మళ్లీ తెరపైకి ‘రాజీవ్ యువ వికాసం’
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:47 AM
రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఏడాదిన్నరకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రోత్సాహకంపై ఇటీవల ప్రభుత్వ ప్రకటన
నవంబర్‌లోగా అందించేందుకు చర్యలు
సంతోషం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ యువత
త్వరలో సాయం అందుతుందని ఎదురుచూపులు
హైదరాబాద్ సిటీ: రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఏడాదిన్నరకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అర్హులను ఎంపిక చేసి తగిన ప్రోత్సాహక సాయం అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది నవంబరులోగా ప్రక్రియను పూర్తిచేసి వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ముందుకు సాగుతోంది. నిరుద్యోగ యువతీ యువకులకు, కుటుంబ పోషణకు ఏ ఆధారం లేని 55 ఏళ్లలోపు వ్యక్తులకు స్వయం ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ పథకం కింద తొలి విడతగా అర్హులైన లబ్ధిదారులకు రూ.4లక్షల వరకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించింది. ఇందులో రూ.50వేల వరకు ఉండే యూనిట్‌కు 100 శాతం రాయితీ, రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఉండే యూనిట్‌కు 90 శాతం రాయితీ ఇవ్వనుండగా, 10 శాతం బ్యాంకు రుణం కల్పిస్తామని చెప్పింది. అలాగే రూ.లక్ష నుంచి రూ.2లక్షల యూనిట్‌కు 80 శాతం సబ్సిడీ 20 శాతం బ్యాంకు లోన్, రూ.2 లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఉండే యూనిట్‌కు 70 శాతం రాయితీ ఇస్తుండగా.. 30 శాతం బ్యాంకు రుణం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
జిల్లాలో 1,31,548 దరఖాస్తులు
రాజీవ్ యువ వికాసం పథకం కింద హైదరాబాద్ జిల్లాలో 1,31,548 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2025 మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు నెలరోజులపాటు ఆన్‌లైన్ బెనిఫిషియరి మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఓబీఎంఎంఎస్) దరఖాస్తులను స్వీకరించారు. అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకున్నారు. అత్యధికంగా ఆసి్‌ఫనగర్, బండ్లగూడ, బహదూర్‌పురా, ఖైరతాబాద్, నాంపల్లి, సైదాబాద్, చార్మినార్ మండలాల నుంచి వచ్చాయి. ఇందులో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు 67,321, బీసీ, ఈబీసీ కార్పొరేషన్లకు 34,719, ఎస్సీ కార్పొరేషన్‌కు 26,260, ఎస్టీ కార్పొరేషన్‌కు 3,248 అప్లికేషన్లు అందజేశారు. కాగా, వివిధ మండలాల్లో వ్యక్తిగత యూనిట్‌తోపాటు గ్రూపుల వారీగా యూనిట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీల(ప్రింటెడ్ ప్రతుల)ను గతేడాది ఏప్రిల్ 30లోగా తమ నివాస ప్రాంతాల్లోని జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాల్లో అందజేశారు.
కలెక్టరేట్‌కు దరఖాస్తుదారుల పరుగులు
రాజీవ్ యువ వికాసానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో దరఖాస్తుదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తెలంగాణ సర్కారు తమకు సాయం అందించి అండగా నిలుస్తోందని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో పథకానికి సంబంధించిన తాజా సమాచారం తెలుసుకునేందుకు కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు. అధికారులను సంప్రదిస్తూ ఎంపిక పక్రియ ఎప్పుడు జరుగుతోందని వాకబు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా తమకు స్పష్టమైన సమాచారం రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, లబ్ధిదారుల ఎంపిక కమిటీలో మండల కన్వీనర్‌గా తహసీల్దార్, ఇతర విభాగాలకు చెందిన ఆరుగురు అధికారులను గతంలోనే నియమించారు. ఏది ఏమైనా రాజీవ్ యువ వికాసం పథకం మళ్లీ తెరపైకి రావడంతో నిరుద్యోగులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్ షాప్‌ల బంద్
Read Latest AP News And Telangana News And International News And Telugu News