అక్రమార్కులపై చర్యలేవీ!
ABN , Publish Date - Jul 30 , 2026 | 09:22 AM
జేఎన్‌టీయూలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ జయలక్ష్మి తాజాగా జారీచేసిన సర్క్యులర్ యూనివర్సిటీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.
జేఎన్‌టీయూలో విచారణ జరిపి నివేదికలు ఇచ్చిన కమిటీలు
ఉన్నతాధికారుల స్థాయిలోనే బుట్టదాఖలు
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ జయలక్ష్మి తాజాగా జారీచేసిన సర్క్యులర్ యూనివర్సిటీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. సదరు సర్క్యులర్ కాపీలను అన్ని విభాగాలకు పంపి, ఉద్యోగులు, ఆచార్యులతో సంతకాలు తీసుకుంటున్న రిజిస్ట్రార్ తీరును కొన్ని వర్గాల వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.
అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోకుండా, సక్రమంగా విధులు నిర్వహిస్తున్న తమకు హెచ్చరికలు పంపడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలోని పలు విభాగాల్లో జరిగిన అక్రమాలపై ఉన్నతస్థాయి కమిటీలు విచారణ జరిపి, చర్యలకు సిఫారసు చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా రిజిస్ట్రార్ మిన్నకుండడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
జిరాక్స్ కుంభకోణం..
యూనివర్సిటీ లైబ్రరీలో సుమారు రూ.3 కోట్ల జిరాక్స్ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలపై 10 మంది సీనియర్ ఆచార్యులు, ఉద్యోగులతో విచారణ కమిటీ వేశారు. అనధికారికంగా వ్యాపారం జరిగినట్లు కమిటీ నిగ్గుతేల్చింది. ఇందుకు బాధ్యులను గుర్తించి వారిపై చర్యలకు కమిటీ సిఫారసు చేసింది. అయితే ఇది జరిగి నెలలు గడుస్తున్నా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వర్సిటీ ఉద్యోగులు ప్రశిస్తున్నారు. కొత్త రిజిస్ట్రార్ బాధ్యతలు చేపట్టి నెలన్నర గడిచినా అక్రమ జిరాక్స్ వ్యవహారంపై దృష్టి సారించకపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు.
మార్కుల కుంభకోణంపై..
గతేడాది పరీక్షల విభాగంలో మార్కుల కుంభకోణం జరిగిందని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రస్తుత వీసీ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ మేరకు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చైర్మన్‌గా నలుగురు ఆచార్యులు ఆరునెలలు విచారణ జరిపి నివేదికలు సమర్పించారు. అయినప్పటికీ నివేదికలో పొందుపరిచిన వాస్తవలేంటో బహిర్గతం చేయలేదు. ఈ విషయంలో ఇద్దరు, ముగ్గురు మాజీ డైరెక్టర్లకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా ఆ నివేదికలను ఉన్నతాధికారులు బయట పెట్టకుండా బుట్టదాఖలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సర్క్యులర్‌పై పలు సంఘాల విస్మయం
ఒకవైపు రెగ్యులర్ ప్రొఫెసర్లకు కోట్లాది రూపాయలను అక్రమంగా కట్టబెట్టిన వర్సిటీ యాజమాన్యం, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వేతన సవరణ చేయడంపై మీనమేషాలు లెక్కిస్తోందని బాధిత వర్గాలు వాపోతున్నాయి. గతంలో అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, భవిష్యత్తులో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ తాజాగా సర్క్యులర్ జారీచేయడం పట్ల ఉద్యోగ, విద్యార్థి సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
ఏరియర్స్ సొమ్ము..
అర్హత లేకున్నా సీనియర్ ఆచార్యులు కొందరు తాము 2009నుంచే ప్రొఫెసర్లుగా చలామణిలో ఉన్నట్లు చెప్పి రూ.10కోట్ల మేరకు ఏరియర్స్ తీసుకున్నట్లు విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. అయినా.. సదరు ప్రొఫెసర్ల నుంచి ఏరియర్స్ సొమ్మును ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
భారీ భవనాల్లో ఈవీ చార్జింగ్ యూనిట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News