Share News

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు.. 12 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ

ABN , Publish Date - Jul 30 , 2026 | 08:27 AM

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపిలేని వానల ధాటికి..

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు.. 12 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ

  • జయశంకర్‌, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా 19.4 సెంటీమీటర్ల వర్షపాతం

  • రాష్ట్రవ్యాప్తంగా 587 మండలాల్లో వర్షం.. స్తంభించిన జనజీవనం

  • పొంగి పొర్లిన వాగులు, చెరువులు.. పలు చోట్ల రహదారులపైకి నీరు

  • వాగులో కొట్టుకుపోయి ఒకరి మృతి, మరొకరు గల్లంతు

  • నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపిలేని వానల ధాటికి పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగగా, చెరువులు తెగిపోయి, రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల పంటలు నీటమునిగాయి. ముఖ్యంగా నిర్మల్‌ జిల్లా బల్లివాగు దాటుతూ ఒక గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోగా, ములుగు జిల్లా మేడారం వనదేవతల దర్శనానికి వచ్చి, జంపన్నవాగులో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుకవాగు ఉప్పొంగడంతో జాతీయ రహదారి 163పైకి నీరు చేరింది. చీకుపల్లి వద్ద ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగత జలపాతం వరదనీటితో ఉరకలేస్తోంది. దీంతో జలపాతం సందర్శనను నిలిపివేశారు. నిర్మల్‌ జిల్లా సోన్‌-ధర్మారం మధ్య ప్రధాన రహదారి వరద నీటికి దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకు విఘాతం కలగగా, పెంబి మండలంలో కడెం వాగు పొంగిపొర్లుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం నాటికి 30 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వర్షాల ధాటికి పలు జిల్లాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. తెలంగాణలో 621 మండలాలుంటే ఏకంగా 587 చోట్ల మంగళవారం వర్షం పడింది. 30 మండలాల్లో అయితే ఏకంగా 10-20 సెంటీమీటర్ల మధ్య భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది.


సింగరేణిలో నిలిచిన ఉత్పత్తి..

జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్‌కా్‌స్ట మైన్‌ 2, 3లో ఉత్పత్తి నిలిచిపోగా,సంస్థకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. మల్హర్‌ మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్టులో 18 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, మంచిర్యాల జిల్లాలోనూ వర్షాల వల్ల సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. వర్షపు నీరు చేరడంతో గనుల్లో భారీ యంత్రాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కరోజులో దాదాపు 32 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌ను ముసురువాన కప్పేసింది. రోజంతా పలుమార్లు కురిసిన చిరుజల్లులతో నగరం తడిసిముద్దయింది. దీంతో చిరువ్యాపారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు.


భారీ వర్ష సూచన..

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఆ జిల్లాల్లో 20-40 సెంటీమీటర్ల మధ్య కుండపోత కురిసే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ నిపుణులు బాలాజీ వెల్లడించారు. ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. కాగా మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

వర్షపాతం వివరాలు..

  • జిల్లా- మండలం- సెంటీమీటర్లు

  • జయశంకర్‌- పలిమెల- 19.4

  • జగిత్యాల-సారంగాపూర్‌-19.4

  • జగిత్యాల-బుగ్గారం-18.3

  • జగిత్యాల-వెల్గటూరు-17.5

  • జగిత్యాల-ఎండపల్లి-15.3

వరద నీటిలో కొట్టుకుపోయి మహిళ మృతి..

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని చామన్‌పెల్లికి చెందిన మర్సుకోల పారుబాయి(50) వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణం కోల్పోయింది. తన భర్త మధుతో కలిసి బుధవారం ఉదయం పింఛన్‌ డబ్బులు తీసుకోవడానికి పారుబాయి సోమార్‌పేట్‌ (ఎర్వచింతల్‌) వెళ్లింది. కూరగాయల కొనుగోలుకు ఒంటరిగా వెళ్లిన పారుబాయి.. తిరిరి చామన్‌పెల్లికి బయలుదేరింది. మార్గమధ్యంలో బల్లివాగు దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ కొట్టుకుపోయింది. ఓ చెట్టు వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. అలాగే, ములుగు జిల్లాలోని జంపన్నవాగులో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన కారు డ్రైవర్‌ పీట్ల తిమ్మయ్య(45) ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని సమ్మక్కసారలమ్మ దర్శనానికి వెళ్లాడు. జంపన్నవాగు ఘాటు వద్ద మెట్లపై పుణ్యస్నానం ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు వరద నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా అతడి ఆచూకీ లభించలేదు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామలో ఇల్లు కూలి ఆత్రం లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి.

Updated Date - Jul 30 , 2026 | 09:08 AM