‘పుర‘పోరుకు రెఢీ
ABN , Publish Date - Jul 30 , 2026 | 02:37 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా జరగనున్న మునిసిపల్ పోరుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీ విషయంలో అధిష్ఠానాల నుంచి స్పష్టత కూడా రావడంతో ఆ వైపు దృష్టిసారిం చాయి.
దూకుడుగా తెలుగుదేశం పార్టీ
వార్డుల విభజనపై వచ్చిన స్పష్టత
కందుకూరు, పొదిలిలో కోర్టు కేసులపై దృష్టి
కీలకం కానున్న ఒంగోలు కార్పొరేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా జరగనున్న మునిసిపల్ పోరుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీ విషయంలో అధిష్ఠానాల నుంచి స్పష్టత కూడా రావడంతో ఆ వైపు దృష్టిసారిం చాయి. కూటమిలో ప్రధానమైన తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తోంది. ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు ఏడు మునిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉన్నాయి. వీటిలో కార్పొరేషన్‌తోపాటు ఆరు మునిసిపా లిటీలు, ఒక నగర పంచాయతీలో ఎన్నికలు జరగాల్సి ఉంది.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవడంతో సెప్టెం బరు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. అదేసమయం లో తొలుత కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగరపంచాయతీలకు ఆతర్వాత మండల, జిల్లా పరిషత్‌లకు.. చివరగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా సెప్టెంబరులోనే పురపోరు జరిగే అవకాశం ఉంది. ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం పూర్తయినందున వార్డుల విభజనపై ఉన్న కోర్టు కేసులు పరిష్కారం కాబోతున్నాయి. వార్డులు, డివిజన్‌ల సంఖ్య పెరగబోతోంది. తదనుగుణంగా స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ అధిష్ఠానం ఆపార్టీ నాయకులను ఆదేశించింది. స్థానిక సంస్థలలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై కూడా స్పష్టతనిచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్ కందుకూరు, మార్కాపురం, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు, అద్దంకి మునిసిపాలిటీలతోపాటు పొదిలి నగర పంచాయతీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. దర్శి మునిసిపాలిటీ పాలకవర్గానికి పదవీకాలం పూర్తికానందున వీటితోపాటు ఎన్నికలు జరిగే అవకాశం లేదు.
కేసుల పరిష్కారంపై దృష్టి
కందుకూరు మునిసిపాలిటీతోపాటు పొదిలి నగరపంచాయతీ ఎన్నికలకు కోర్టు కేసులు అడ్డంకిగా ఉన్నాయి. కందుకూరులో కొన్ని గ్రామాల విలీనాన్నివ్యతిరేకిస్తూ గతంలో వైసీపీ నాయకులు కోర్టులో పిటిషన్ వేయించారు. పొదిలిలో కొన్ని గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా తెలుగుదేశం నాయకులు కోర్టుకెక్కారు. కందుకూరులో విలీనమైన గ్రామాలలో పూర్తిగా టీడీపీ పట్టు ఉంటుంది. కాగా ఆ కేసు పరిష్కారం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. దానిపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దృష్టి సారించారు. ఆ గ్రామాలు విలీనమైనా లేక వైసీపీ నాయకులు కోరుకుంటున్నట్లు వాటిని తొలగించైనా తాము ఎన్నికలకు సిద్ధమని సవాల్ విసిరారు. దీంతో ఇప్పుడు స్పందించాల్సిన అవసరం వైసీపీ నేతలపై పడింది. కేసును వెనక్కు తీసుకుని ఎన్నికలకైనా సిద్ధం కావాలి లేక ఎమ్మెల్యే సవాల్ విసిరినట్లు ఆ గ్రామాలను తీసివేస్తే తాము సిద్ధమని వైసీపీ నేతలు ప్రకటించాలి. ఈ రెండింటిలో ఒకదానికి వైసీపీ నేతలు సిద్ధమై ముందుకొస్తారా అంటే అనుమానమే. అయితే సామ, దాన, భేద దండోపాయాలు వినియోగించైనా ఇలాంటి సమస్యలు ఉన్న అన్ని మునిసిపాలిటీలలో లీగల్ అంశాలను పరిష్కరించి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పొదిలి విషయంలో కొన్ని గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా అప్పట్లో టీడీపీ వర్గీయులే కోర్టులో కేసు వేశారు. పొదిలి పంచాయతీలో టీడీపీకి ఉన్న ఆధిక్యతను దెబ్బకొట్టేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం సుదూరంలో ఉన్న కొన్ని గ్రామాలను నగరపంచాయతీలో చేర్చింది. ఆ గ్రామాలన్నీ వైసీపీకి ఆధిక్యతను ఇచ్చేవే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆ గ్రామాల్లో వైసీపీ శ్రేణులను చాలామందిని టీడీపీ వైపు తిప్పుకున్నారు. దీంతో విజయంపై ధీమాతో తమ పార్టీ నేతలతో కేసును ఉపసంహరింపజేయడం ద్వారా ఎన్నికలకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
అభ్యర్థులపై టీడీపీ కసరత్తు
‘స్థానిక’ ఎన్నికల విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ దూకుడుగా కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు, శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికలు జరగాల్సిన ప్రాంతాలన్నీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పరిధి లోనే ఉన్నాయి. దీంతో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని కూడా ఈ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అన్నిచోట్లా వార్డుల విభజనపై స్పష్టతకు వచ్చారు. నేడో, రేపో కోర్టు సమస్య పరిష్కారం కాగానే అన్ని ప్రాంతాలలో వార్డులు ఖరారైపోనున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధుల సూచనకు అనుగుణంగానే వార్డుల విభజన ఉంటుందన్న విషయంలో అనుమానాలు లేవు. రిజర్వేషన్లు తేలనప్పటికీ ఆర్థిక, అంగబలం ఉన్న అభ్యర్థుల విషయంపై కూడా టీడీపీ నేతలు కసరత్తు ప్రారంభించారు.
ఒంగోలు నగరంపైనే అందరి కన్ను
ఒంగోలు కార్పొరేషన్ వ్యవహారం రాజకీయంగా కూటమి పార్టీల మధ్యనే ప్రత్యేక చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో కూటమిలోని ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, జనసేన అధినాయకులు ఇప్పటికే ఒంగోలు వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒంగోలు ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన దామచర్ల జనార్దన్ ఉండగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన విషయం విదితమే. ఒంగోలులో ప్రధాన పార్టీల తరఫున వీరిద్దరే ప్రస్తుతానికి బలమైన నాయకులు. వారు కలిసి పయనిస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమికి విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. ప్రస్తుతానికి వారిద్దరి మధ్య సఖ్యత లేదు. ఇటీవల ఒక లేఖ విషయంపై అంతర్గతంగా మరింత రాద్దాంతం జరుగుతోంది. వెంటనే ఇరు పార్టీల నాయకులు జోక్యం చేసుకుని ఎవరూ బహిరంగ విమర్శలకు దిగొద్దని హెచ్చరించారు. దీంతో విషయం బజారుకెక్కకపోయినా అంతర్గతంగా సమస్యగానే మిగిలింది. ఇదేసమయంలో ఒంగోలు కార్పొరేషన్‌పై రెండు పార్టీలు దృష్టి సారించాయి. జిల్లాలో తమ పార్టీకి ప్రాతినిఽథ్యం లేదని, ఒంగోలు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థే కొనసాగుతున్నందున కార్పొరేషన్ మేయర్ పదవిని తమ పార్టీకి కేటాయించాలని జనసేన అడిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదనుగుణంగా బాలినేని పావులు కదుపుతున్నారని సమాచారం. అయితే దీన్ని ముందుగానే ఊహించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కీలకమైన ఒడా ఛైర్మన్ పదవిని పట్టుబట్టి జనసేనకు ఇప్పించారని విశ్లేషకుల అంచనా. ఒడా చైర్మన్ పదవి జనసేన చేతిలో ఉన్నందున మేయర్ తమకే కావాలని పట్టుబట్టాలని టీడీపీ నాయకులు భావిస్తున్నట్లు తెలిసింది. అయితే పైస్థాయిలో టీడీపీ, జనసేనల మధ్య ఉన్న సఖ్యతకు కిందిస్థాయి సమస్యలు ఇబ్బంది అయితే ఇరుపార్టీల అధినాయకులు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అందువలన ఒంగోలు కార్పొరేషన్ వ్యవహారం రాజకీయంగా ఏ మలుపు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది.