Share News

ప్రేమ పేరిట ఉదయ్‌ కృష్ణారెడ్డి పైశాచికం

ABN , Publish Date - Jul 30 , 2026 | 08:17 AM

మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డిని అత్తాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణారెడ్డిని పోలీసులు విచారించిన క్రమంలో..

ప్రేమ పేరిట ఉదయ్‌ కృష్ణారెడ్డి పైశాచికం

  • అవమానించాడు.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు

  • నకిలీ ఇన్‌స్టా ఐడీలతో వేధించాడు

  • మెడపై కత్తిపెట్టి, గొంతునులిమి చంపేందుకు యత్నించాడు

  • బాధితురాలి వ్యక్తిగత వీడియోలు ఆమె భర్తకు పంపించాడు

  • పోలీసుల విచారణలో వెలుగులోకి ఉదయ్‌ అకృత్యాలు

  • నిందితుడు, ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ/రాజేంద్రనగర్‌ (ఆంధ్రజ్యోతి): మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డిని అత్తాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణారెడ్డిని పోలీసులు విచారించిన క్రమంలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్‌గా పని చేశారు. అనంతరం యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 2025 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అతిసాధారణ స్థాయి నుంచి ఐపీఎస్‌గా ఎదిగిన తన ప్రయాణాన్ని వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్టు చేశాడు. అదే సమయంలో ఐపీఎస్‌కు ఎంపికైన బాధితురాలు.. ఆ పోస్టుకు స్పందించింది. దీంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. శివరాంపల్లిలోని సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ(ఎస్‌బీపీ- ఎన్‌పీఏ)లో, లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ)లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఇరువురి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కొద్దిరోజుల్లోనే ఉదయ్‌కృష్ణారెడ్డి ప్రవర్తన అభ్యంతరకరంగా ఉండటంతో బాధితురాలు అతడిని దూరం పెట్టింది.

దాంతో కోపంతో రగిలిపోయిన ఉదయ్‌కృష్ణారెడ్డి బాధితురాలిని వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను తిట్టడం, అవమానించడం, ఆమె ల్యాప్‌టాప్‌ను విసిరి పారేయడం వంటి పనులు చేశాడు. ఇరువురి మధ్య జరిగిన చాటింగ్‌లను బయటపెడతానని, ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించాడు. అప్పట్నించి బాధితురాలు మరింత దూరం పెట్టి సోషల్‌ మీడియాలో కూడా బ్లాక్‌ చేసింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఐడీలతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇటీవల బాధితురాలి జట్టు పట్టుకొని ఆమెనుతన గదిలోకి ఈడ్చుకెళ్లిన ఉదయ్‌ కృష్ణారెడ్డి.. మెడపై కత్తి పెట్టి నిర్బంధించాడు. బాధితురాలిని అసభ్యంగా తాకడమే కాక చంపుతానని బెదిరించాడు. ఇక, బాధితురాలి ఫోన్‌లోని మెసేజ్‌లను తనకు చూపమని ఒత్తిడి తెచ్చేవాడు. అంతేకాక, బాధితురాలికి తెలియకుండా తీసిన వీడియోను ఆమె భర్తకు పంపించాడు. జూన్‌ 23న మొదలైన వేధింపులు వారాల పాటు కొనసాగగా.. జూలై 10న మరోసారి దాడి జరగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఉదయ్‌కృష్ణారెడ్డి.. ఆ తర్వాత పరారయ్యాడు. అతడి ఆచూకీ తెలుసుకున్న అత్తాపూర్‌ పోలీసులు ఉదయ్‌ కృష్ణారెడ్డిని మిర్యాలగూడ సమీపంలో మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం అతన్ని అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారించి, ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితునికి 14 రోజుల రిమాండ్‌ విఽధించింది. దాంతో పోలీసులు ఉదయ్‌ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.


ఉదయ్‌ కృష్ణారెడ్డికి దక్కని ఊరట..

లైంగిక వేధింపుల కేసులో ఉదయ్‌ కృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించలేదు. అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఉదయ్‌ కృష్ణారెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై జస్టిస్‌ శ్రీనివాసరావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. క్వాష్‌ పిటిషన్‌లో తుది తీర్పు వచ్చే వరకు పోలీసులు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. అయితే, ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ పిటిషన్‌లో వివరణ ఇవ్వాలని అత్తాపూర్‌ పోలీసులు, మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 26కు వాయిదా పడింది.

Updated Date - Jul 30 , 2026 | 08:38 AM