బలమైన కూటమికి బొద్దింకల ప్రణాళిక!
ABN , Publish Date - Jul 30 , 2026 | 05:34 AM
రైతులు, యువత, విద్యార్థులతో విస్తృత కూటమిని ఏర్పాటు చేసి, కేంద్రంలోని మోదీ సర్కారుకు వ్యతిరేకంగా మలి విడత ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సమాయత్తమవుతోంది....
మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విస్తృత కూటమి
రైతులు, యువత, విద్యార్థులతో కలసి ఉద్యమిస్తాం
సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా
రైతు నేత రాకేశ్ టికాయత్‌తో సీజేపీ నేతల సమాలోచనలు
న్యూఢిల్లీ, జూలై 29: రైతులు, యువత, విద్యార్థులతో విస్తృత కూటమిని ఏర్పాటు చేసి, కేంద్రంలోని మోదీ సర్కారుకు వ్యతిరేకంగా మలి విడత ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సమాయత్తమవుతోంది. ప్రముఖ రైతు నేత రాకేశ్ టికాయత్‌తో సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా తదితరులు బుధవారం ఢిల్లీలో సమాలోచనలు నిర్వహించారు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు. విద్యార్థులపై కేసుల ఉపసంహరణ విషయంలో టికాయత్ మద్దతును ఈ సందర్భంగా సీజేపీ కోరింది. సమావేశం అనంతరం అశుతోష్ రంకా మీడియాతో మాట్లాడుతూ.. రైతు సోదరులు, యువత, విద్యార్థులతో పెద్ద కూటమి కట్టి, అన్ని వైపుల నుంచి మోదీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఇటీవలి నిరసనల సమయంలో విద్యార్థులపై నమోదైన కేసులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, అవమాన పూరిత, పరువుకు భంగం కలిగించే కంటెంట్‌ను తొలగించాలంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీజేపీ తప్పుబట్టింది. పాలకులను ప్రశ్నించే హక్కు పౌరులకు ఉంటుందని పేర్కొంది. ఆన్‌లైన్‌లో విమర్శలను శాంతిభద్రతలకు విఘాతంగా పరిగణించడం.. ప్రజా విమర్శలకు ప్రధాని అతీతమన్న సందేశాన్ని పంపడమేనని పేర్కొంది. నీట్‌పై ఉద్యమం సందర్భంగా ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రధాని, ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా చేసిన పోస్టులు, వీడియో కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ పోలీసులు ఎక్స్‌ను ఆదేశించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్