బ్రిటిష్ పోర్టులపై అదానీ కన్ను!
ABN , Publish Date - Jul 30 , 2026 | 03:38 AM
ప్రముఖ బ్రిటిష్ కంపెనీలు ఒక్కొక్కటిగా భారత కంపెనీల పరమవుతున్నాయి. బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ టీ బ్రాండ్ ‘టెట్లీ’, కోరస్ స్టీల్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు...
ఏబీపీలో మెజారిటీ వాటా కోసం చర్చలు
న్యూఢిల్లీ: ప్రముఖ బ్రిటిష్ కంపెనీలు ఒక్కొక్కటిగా భారత కంపెనీల పరమవుతున్నాయి. బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ టీ బ్రాండ్ ‘టెట్లీ’, కోరస్ స్టీల్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు ఇప్పటికే టాటా గ్రూపు పరమయ్యాయి. ఇప్పుడు అదానీ గ్రూపు కూడా బ్రిటిష్ కంపెనీలపై కన్నేసింది. అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ (ఏబీపీ)లో 63.88 శాతం వాటా కొనుగోలుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీసెజ్) సిద్ధమైంది. ఇందుకోసం 1,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.95,000 కోట్లు) వరకు చెల్లించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
ఏబీపీ చరిత్ర: ఏబీపీకి బ్రిటన్ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కంపెనీ ఇప్పటికే ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన 21 ప్రముఖ నౌకాశ్రయాలను నిర్వహిస్తోంది. గత ఏడాది ఈ నౌకాశ్రయాల ద్వారా 425 లక్షల టన్నుల ఎగుమతి, దిగుమతులతో 81.98 కోట్ల పౌండ్ల ఆదాయం, 58.65 కోట్ల పౌండ్ల నిర్వహణ లాభం ఆర్జించింది. యూకే సముద్ర వాణిజ్యంలో దాదాపు 25 శాతం ఈ నౌకాశ్రయాల ద్వారానే జరుగుతోంది. సరుకు రవాణా పరంగా యూకేలో అతిపెద్ద ఓడరేవు అయిన ఇమ్మింగ్‌హమ్, అత్యధిక ఎగుమతులు జరిగే సౌతాంప్టన్ కూడా ఏబీపీ నిర్వహణలోనే ఉన్నాయి.
ఎవరి నుంచి?: ఏబీపీ ఈక్విటీలో కెనడాకు చెందిన రెండు పెన్షన్ ఫండ్ సంస్థలకు 63.88 శాతం వాటా ఉంది. సింగపూర్, కువైట్‌తోపాటు మరో రెండు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) కంపెనీల చేతిలో మరో 30 శాతం వాటా ఉంది. కెనడా పెన్షన్ ఫండ్స్ చేతిలో ఉన్న 63.88 శాతం వాటా కొనుగోలు కోసం అదానీ పోర్ట్స్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ చర్చలు ఫలిస్తే బ్రిటిష్ నౌకా రంగంలో ఒక భారతీయ కంపెనీ పెట్టే అత్యధిక పెట్టుబడి అవుతుందని భావిస్తున్నారు. అయితే అదానీ గ్రూపు ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు.
అదానీ పోర్ట్స్ లాభం రూ.3,649 కోట్లు: ఈ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్(ఏపీసెజ్) రూ.3,649 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10.23 శాతం ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.9,422.18 కోట్ల నుంచి రూ.11,673.71 కోట్లకు చేరింది.
నష్టాల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్: జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.32,923.98 కోట్ల ఆదాయంపై రూ.1,160.23 కోట్ల నష్టాలు ప్రకటించింది. ఆదాయం దాదాపు 50 శాతం పెరిగినా ఈ ఏడాది మేలో యూఎస్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (ఓ ఎఫ్‌ఏసీ) కింద రూ.2,644.02 కోట్లు (27.5 కోట్ల డాలర్లు)చెల్లించాల్సి రావడంతో లాభాలకు భారీగా గండి పడింది.
ఇవి కూడా చదవండి
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!
విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా