Share News

భారీ భవనాల్లో ఈవీ చార్జింగ్‌ యూనిట్లు

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:41 AM

ఏపీలో భవన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ‘ఏపీ బిల్డింగ్‌ రూల్స్‌-2017’కు సమగ్ర సవరణలు చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ జీవో 161 జారీ చేసింది.

భారీ భవనాల్లో ఈవీ చార్జింగ్‌ యూనిట్లు
AP Building Rules 2026

  • ఆలయాలు, చర్చి, గురుద్వారా, మసీదులకు అనుమతులు, నిర్మాణ చార్జీల మినహాయింపు

  • 24 మీటర్ల ఎత్తు దాటితే హైరైజ్‌గా గుర్తింపు

  • పర్యావరణం, ఫైర్‌ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యం

  • 50 మంది ఉద్యోగులున్న భవనాల్లో క్రెచ్‌లు

  • భవన నిర్మాణాలకు ప్రభుత్వం కొత్త నిబంధనలు

  • ఏపీ బిల్డింగ్‌రూల్స్‌లో సవరణలు, మార్పులు

అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఏపీలో భవన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ‘ఏపీ బిల్డింగ్‌ రూల్స్‌-2017’కు సమగ్ర సవరణలు చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ జీవో 161 జారీ చేసింది. కేంద్రం సూచించిన డీ-రెగ్యులేషన్‌ మార్గదర్శకాలు, ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, భవనాల భద్రత, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్‌ అనుమతుల వ్యవస్థ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలకు భిన్నంగా.. 24 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు(స్టిల్ట్‌ ఫ్లోర్‌తో కలిపి) ఉన్న ప్రతి భవనాన్నీ ‘హైరైజ్‌’ బిల్డింగ్‌గా పరిగణిస్తారు. మెట్ల గది, లిప్ట్‌ రూమ్‌, చిమ్నీలు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, అలంకార నిర్మాణాల ఎత్తును మినహాయించారు. భవన నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.


స్థానిక సంస్థలకు..

స్థానికసంస్థలకు ఆన్‌లైన్‌ అనుమతుల వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. ఫైర్‌, పర్యావరణం సహా ఇతర అనుమతులను సమన్వయం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా కామన్‌ జోనింగ్‌ రెగ్యులేషన్స్‌, స్ట్రీట్‌ వెండింగ్‌ ప్లాన్లు, డిజిటల్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ వ్యవస్థ వంటి సంస్కరణలను అమలు చేస్తోంది. ఇప్పుడు బిల్డింగ్‌ రూల్స్‌లో తాజాగా మార్పులు చేసింది. ముఖ్యంగా హైరైజ్‌ నిర్మాణాలు, ఈవీ మౌలిక వసతులు, క్రెచ్‌లు, ఫైర్‌సేఫ్టీ, పబ్లిక్‌ వర్షిప్‌ భవనాలకు ఫీజు మినహాయింపు వంటి అంశాలు ఈ జీఓలో ప్రధానంగా ఉన్నాయి.

పెట్టుబడులు, భద్రత!

తాజా జీవో ప్రకారం రెండుకీలక మార్పులు కనిపిస్తున్నాయి. 1) అనుమతుల ప్రక్రియను సరళీకరించి పెట్టుబడులను ఆకర్షించడం. 2) నగరాల్లో భద్రత, సౌకర్యాలు, ఆధునిక మౌలిక వసతులను తప్పనిసరిచేయడం. ప్రత్యేకంగా హైరైజ్‌ భవనాలు, ఈవీ చార్జింగ్‌, క్రెచ్‌లు, ఫైర్‌ సేఫ్టీ, టీడీఆర్‌, ఆన్‌లైన్‌ అనుమతులు వంటి అంశాల్లో రాష్ట్రం కొత్త దిశగా అడుగులు వేసింది. ఒకవైపు నిర్మాణ రంగానికి కొత్త అవకాశాలు కల్పిస్తూనే మరోవైపు ఫైర్‌ సేఫ్టీ, పర్యావరణ అనుమతులు, స్ట్రక్చరల్‌ స్థిరత్వం వంటి అంశాల్లో కఠిన ప్రమాణాలను కొనసాగించింది. ముఖ్యంగా హైరైజ్‌ నిర్మాణాలు, పెద్ద అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్టులు, కమర్షియల్‌ కాంప్లెక్‌లు ఇకపై మరింత సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.


కీలక మార్పులు ఇవీ..

  • ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాల నిర్మాణాలకు భవన అనుమతుల రుసుములు, ఇతర నిర్మాణ చార్జీలను మినహాయించారు. భూమి, భవనం పూర్తిగా ప్రార్థనా కార్యక్రమాలకే వినియోగించాలనే షరతు విధించారు.

  • 5వేల చదరపు మీటర్లకు పైగా నిర్మాణ విస్తీర్ణం ఉన్న కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, టౌన్‌షి్‌పలు, హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

  • ఉద్యోగుల్లో మహిళలు, పురుషులు కలిపి 50 మందికి పైగా పనిచేసే అపార్ట్‌మెంట్‌లు, పాఠశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, షాపింగ్‌మాల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ సంస్థల్లో క్రెచ్‌(పిల్లల సంరక్షణ కేంద్రాలు) ఏర్పాటు తప్పనిసరి.

  • హైరైజ్‌ భవనాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, భారీ వాణిజ్య భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి ముందస్తు అనుమతి


తప్పనిసరి.

  • నగర స్థాయి మౌలిక వసతుల ఫీజులను మూడేళ్లలో ఆరు సమాన వాయిదాల్లో చెల్లించవచ్చు. ఆలస్యమైతే 12 శాతం వడ్డీ విధిస్తారు. పర్మిట్‌ గడువు ముగిసిన తర్వాత ఏడాది(హైరైజ్‌కు రెండేళ్లు)దాటితే, రీ-వ్యాలిడేషన్‌ ఫీజులో 50 శాతంతో పాటు 10 శాతం జరిమానా చెల్లించాలి.

  • ప్రభుత్వం తొలిసారి హైరైజ్‌ భవనాలకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఎన్విరాన్‌మెంట్‌ డెక్‌ఫ్లోర్‌, సర్వీ్‌సఫ్లోర్‌, స్టిల్ట్‌ వద్ద రిసెప్షన్‌ ఏరియా, పార్కింగ్‌ ఫ్లోర్‌ ఎత్తుకు ప్రత్యేక నిబంధనలను సడలించింది.

  • సెట్‌బ్యాక్‌ బదిలీకి అవకాశం ఉంటుంది. అయితే, ఫైర్‌, స్ట్రక్చరల్‌ సేఫ్టీ ప్రమాణాల్లో ఎలాంటి సడలింపులు ఉండవు. బిల్డర్లు వాయిదాల పద్ధతిలో ఫీజులు చెల్లించవచ్చు. అలాగే, టీడీఆర్‌ వినియోగానికి మరిన్ని వెసులుబాట్లు కల్పించారు.


వార్తలు కూడా చదవండి...

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్

ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 07:13 AM