తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:49 PM
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు ఆదుకోవడమే తమ మొదటి ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తుఫాన్ బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
పశ్చిమగోదావరి జిల్లా, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ బాధితులకు ఆదుకోవడమే తమ మొదటి ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. తుఫాన్ బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎన్నికల కంటే బాధితుల సంక్షేమమే తమకు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఈరోజు (శుక్రవారం) పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలంలో ముఖ్యమంత్రి పర్యటించారు. క్షేత్రస్థాయిలో తుఫాన్ ప్రభావాన్ని పరిశీలించారు. మొగల్తూరు మండలం మెట్రేవు గ్రామంలో తుఫాన్ బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తుఫాన్ మొదలైన దగ్గర నుంచి తాను ఎప్పటికప్పుడు పరిశీలించానని తెలిపారు. రాబోయే రబీ పంటకు సాగునీరు ఇబ్బంది ఉండదని వ్యాఖ్యానించారు. తుఫాన్ వర్షాలతో అన్ని రిజర్వాయర్లు నిండాయని పేర్కొన్నారు.
ప్రాణ నష్టం తగ్గింది..
ఆస్తినష్టం, ప్రాణనష్టం నివారణకు తాము చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తుఫాన్ నష్ట నివారణకు ప్రజల్లో అవగాహన తీసుకువచ్చామని అన్నారు. అధికార యంత్రాగాన్ని అన్నింటికి సిద్ధం చేశామని తెలిపారు. టెక్నాలజీ, క్షేత్రస్థాయి అంశాలను కలిపి సమీక్ష చేశామని.. దీంతో చాలావరకు ప్రాణనష్టం తగ్గిందని వెల్లడించారు. దురదృష్టవశాత్తు ఒకరిద్దరు మృతిచెందారని అన్నారు. తుఫాన్ రోజున 12,500 చెట్లు, 4500 విద్యుత్ స్థంభాలు పడిపోయాయని చెప్పారు. తెలంగాణ నుంచి కూడా విద్యుత్ సిబ్బందిని పంపాలని తాము కోరామని తెలిపారు. ఎల్లుండి ఉదయానికి ఇళ్లకు కరెంటు ఇస్తామని అన్నారు. ఆ తర్వాత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థను రేపు ఉదయంలోగా పూర్తిగా పునరుద్ధరిస్తామని తెలిపారు. రేపు, ఎల్లుండో కేంద్ర బృందం ఏపీకి వస్తుందని పేర్కొన్నారు.

ఉద్యానవన, వరి పంటలు దెబ్బతిన్నాయి..
రెండు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉద్యానవన, వరి పంటలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. బీమా కట్టిన రైతులకు బీమా వస్తుందని తెలిపారు. దానికి అదనంగా హెక్టారుకు రూ.25 వేల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. బీమా కట్టని రైతులకు ఇబ్బంది వస్తోందని.. వారు కూడా భవిష్యత్తులో బీమా కట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు, కిరాణా దుకాణాలకు రూ.25 వేల నష్టం ఇస్తామని స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు రూ. 25 వేల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

వశిష్ట గోదావరి నది ప్రక్షాళనకు అధ్యయనం చేస్తాం..
65 రకాల పంటలకు ఏ మేరకు నష్టపరిహారం ఇవ్వాలో నిర్ణయించామని సీఎం అన్నారు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత నష్టం అంచనాలు వేస్తామని వివరించారు. ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసేంతవరకు సహాయక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజల్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించాలని చెప్పుకొచ్చారు. ఎన్ని పనులు ఉన్నా తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ప్రాధాన్యం ఇస్తామని మాటిచ్చారు. అక్వారంగానికి జరిగిన నష్టంపైనా సమీక్షిస్తామని చెప్పారు. ప్రజల్లో బాధ్యత రావాలని.. అవగాహన పెంచుకోవాలని సూచించారు. డ్రైనేజ్ వ్యవస్థను రూ.3 వేల కోట్లతో ప్రక్షాళన చేస్తామని అన్నారు. దెబ్బతిన్న సోలార్ ప్లాంట్లకు సహాయం చేస్తామని... వశిష్ట గోదావరి నది ప్రక్షాళనకు అధ్యయనం చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: హోం మంత్రి అనిత
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News