తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 29 , 2026 | 03:42 PM
ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా కల్పించారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా కల్పించారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుఫాన్‌ను అనుక్షణం పర్యవేక్షించంతో ప్రాణనష్టం తగ్గిందని వ్యాఖ్యానించారు. తుఫాన్ బాధితులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు (గురువారం) ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాల్లోని పంటలను సీఎం పరిశీలించారు. పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఏపీలో ఆర్నబ్ తుఫాన్ ప్రభావం దారుణంగా ఉంది..
ఏపీలో ఆర్నబ్ తుఫాన్ ప్రభావం దారుణంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. చెట్లు ఎక్కడా కూడా రోడ్డుకు అడ్డంగా లేకుండా వేగంగా కట్ చేసి క్లియర్ చేశామని తెలిపారు. జనరేటర్లు పెట్టాలని చెప్పినా కొందరు అధికారులు ఆ పని చేయలేదని.. దానివల్ల కొంత ఇబ్బంది వచ్చిందని అన్నారు. కోనసీమలో 8వేల విద్యుత్ స్తంభాలు పడిపోయాయని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కరెంట్ సరఫరా పునరుద్దరిస్తామని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు నుంచి విద్యుత్ సిబ్బందిని పిలిపించి రెండు రోజుల్లో చివరి ప్రాంతం వరకు కరెంట్ అందిస్తామని చెప్పారు. తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధాానాన్ని తెస్తామని అన్నారు. రాష్ట్రంలో తుఫాన్‌కు రూ.6500 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తుఫాన్ నష్టం అంచనా బృందాలు వస్తాయని.. అవసరమైతే కోనసీమకు మళ్లీ తాను వస్తానని మాటిచ్చారు. పంటలకు భీమా చేయించడంతో నష్ట పరిహారం వస్తుందని చెప్పారు. తుఫాన్ క్రాస్ అయ్యే సమయంలో 35,000 మంది అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో తాను పాల్గొన్నానని తెలిపారు. తీర ప్రాంత మండలాల్లో విద్యుత్ కేబుల్స్ అండర్ గ్రౌండ్లో వేస్తే నష్టం తగ్గించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఏరియల్ వ్యూ ద్వారా పంటల పరిశీలన..
ఏరియల్ వ్యూ పర్యటనలో భాగంగా తొలుత అమరావతి నుంచి సీఎం బయలుదేరి కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చేరుకున్నారు. మార్గం మధ్యలో ఏరియల్ వ్యూ ద్వారా ఆర్నబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన వరిచేలు, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను ముఖ్యమంత్రి పరిశీలించి, రైతులకు భరోసా కల్పించారు. ఏరియల్ వ్యూ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావాన్ని పరిశీలించారు. నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలను, కూలిన కొబ్బరి చెట్లను పరిశీలించి అన్నదాతలతో మాట్లాడారు. ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగిందనే అంశాలను సీఎం చంద్రబాబుకు.. తన సెక్రటరీ ప్రద్యుమ్న వివరించారు.
రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి..
వేట్లపాలెంలో ఆర్నబ్ తుఫాన్ బాధిత రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. నీట మునిగిన పొలాలను ఆయన పరిశీలించారు. అధికారులు చేపడుతున్న సహయక చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తుఫాన్‌పై తమ ప్రభుత్వం వెంటనే వేగంగా స్పందించిందని ముఖ్యమంత్రి అన్నారు. స్థానికంగా ఉన్న ఉద్యోగులు తమకు సూచనలను అందించారని స్థానికులు తెలిపారు. 15 రోజుల్లో కోతకు వచ్చే దశలో సాగు ఉండగా తుఫాన్ రావడంతో నష్టపోయామని.. దిగుబడి పడిపోతుందని సీఎం దృష్టికి స్థానిక రైతులు తీసుకువచ్చారు. పంటల బీమా చేయించారా..?, లేదా..? అని స్థానిక అధికారులను ముఖ్యమంత్రి అడిగారు. చేయించామని అధికారులు తెలిపారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించారు. మువ్వ మొత్తం రాలిపోయిందని దీని వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందని కొబ్బరి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. 1996లో హరికేన్ తుఫాన్ సమయంలో చంద్రబాబు ముమ్మిడివరంలో హెలీకాప్టర్‌తో రోడ్డు మీద ల్యాండైన విషయాన్ని స్థానిక రైతులు గుర్తు చేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తమ ప్రాంత వాసులకు ముందుగా చంద్రబాబే గుర్తుకువస్తారని స్థానికులు వివరించారు. సీఎం చంద్రబాబు పర్యటనలో మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కోనసీమ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట
ఆర్నబ్ తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా వేయండి.. అధికారులకు సీఎం ఆదేశం
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు పూర్తి అండగా ఉంటాం: హోం మంత్రి అనిత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News