ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:07 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆర్నబ్ తుఫాన్ పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో తుఫాన్ పరిహారాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ప్రకటించారు. ఆర్నబ్ తుఫాన్‌తో పంట, ఆస్తి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం నుంచి సీఎం మీడియాతో మాట్లాడారు. ఆర్నబ్ తుఫాన్ గురించి పలు విషయాలను వెల్లడించారు.
సీఎం ప్రకటించిన పరిహారం వివరాలిలా..
మత్స్యకారులకు, చేపల చెరువులకు సాయం.
దెబ్బతిన్న వలల మరమ్మతులకు రూ.5 వేల సాయం.
కొత్త వలల కొనుగోలుకు రూ.10 వేల పరిహారం.
వలలతో సహా పూర్తిగా దెబ్బతిన్న మోటారు లేని పడవలకు రూ.27 వేల సాయం.
వలలతో సహా పూర్తిగా దెబ్బతిన్న ఫిషింగ్ బోట్లకు రూ.25 వేల పరిహారం.
చేపల చెరువుల పునరుద్ధరణకు రూ.17 వేల సాయం.
దెబ్బతిన్న షెడ్లకు రూ.25 వేల పరిహారం.
పశుసంపద, కోళ్ల పెంపకానికి పరిహారం.
ఆవు మృతిచెందితే రూ.50 వేల పరిహారం.
గేదె మృతికి రూ.40 వేల సాయం.
దూడ మృతికి రూ.25 వేల పరిహారం.
గొర్రె, మేక మృతికి రూ.7,500 సాయం.
కోళ్లు మృతిచెందితే ఒక్కోదానికి రూ.100 చొప్పున పరిహారం.
కోళ్లకు సంబంధించి ఒక్కో లబ్ధిదారుకు గరిష్ఠంగా రూ.10 వేల సాయం.
దెబ్బతిన్న క్యాటరింగ్ షెడ్లకు రూ.5 వేల పరిహారం.
బ్యాటరీ షెడ్ల నష్టానికి రూ.500 సాయం.
పంటలకు హెక్టారుకు పరిహారం.
పలు పంటలకు నష్టం ఆధారంగా హెక్టారుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పరిహారం.
అరటి, పసుపు, యామ్ వంటి పంటలకు హెక్టారుకు రూ.35 వేల సాయం.
తమలపాకుల తోటలకు హెక్టారుకు రూ.75 వేల పరిహారం.
మిరప, బొప్పాయి, టమాటా, ఉల్లి పంటలకు హెక్టారుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు సాయం.
మామిడి, నిమ్మ, దానిమ్మ, సపోటా, జీడిమామిడి తోటలకు హెక్టారుకు రూ.35 వేల పరిహారం.
కాఫీ, డ్రాగన్ ఫ్రూట్ తోటలకు హెక్టారుకు రూ.35 వేల సాయం.
కూరగాయలు, పుచ్చకాయలు, నర్సరీలకు హెక్టారుకు రూ.25 వేల పరిహారం.
టపియోకా పంటకు హెక్టారుకు రూ.10 వేల సాయం.
ఆయిల్ పామ్, కొబ్బరి చెట్ల నష్టానికి ఒక్కో చెట్టుకు రూ.15 వేల పరిహారం.
పంటలు, వృత్తులు, ఆస్తుల నష్టాలకు పరిహారం అందించేలా ప్రభుత్వం నిర్ణయం.
పరిహారం పంపిణీలో అధికారులు పారదర్శకత పాటించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరితే 25 కేజీల బియ్యం ఇవ్వాలని ఆదేశం.
చేనేత మగ్గాలు, మత్స్యకారులకు 50 కేజీల బియ్యం, కేజీ చొప్పున ఉల్లిపాయలు, వంటనూనె, కందిపప్పు రేషన్ ఇస్తాం.
షెల్టర్ క్యాంపుల్లో తలదాచుకున్న వారికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం.
మృతిచెందిన వారి కుటుబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం.
ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైతే రూ.10 వేలు, దుకాణాలకు రూ.25 వేలు సాయం అందిస్తాం.
ఎంఎస్ఎంఈలకు కేటగిరీల వారీగా ఆర్థిక సాయం, ద్విచక్ర వాహనానికి రూ.3 వేల సాయం.
త్రిచక్ర వాహనాలకు రూ. 10 వేలు, పుష్ కార్ట్‌లకు రూ.20 వేలు, వీవర్ కమ్యూనిటీకి రూ.25 వేలు, ఫిషింగ్ బోట్, వలలు ధ్వంసమైతే రూ.25 వేలు సాయం.
హెక్టారు పత్తికి రూ.25 వేలు, చెరకుకు రూ.25 వేల చొప్పున, ఇతర పంటలకు ఆయా కేటగిరీల వారీగా ఆర్థిక సాయం.
అరటి పంటకు హెక్టారుకు రూ.35 వేల చొప్పున ఆర్థిక సాయం.
టమోటాకు రూ.25 వేల చొప్పున సాయమందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అమిత్ షాకు తుఫాన్ తీవ్రత గురించి వివరించా..
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, శానిటేషన్ సమస్యలు రాకుండా పూర్తి శ్రద్ధ పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. తుఫాన్ నష్టంపై ఇవాళ కేంద్రానికి లేఖ రాయటంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా ఫోన్‌లో మాట్లాడానని ప్రస్తావించారు. అమిత్ షాకు తుఫాన్ తీవ్రత, రాష్ట్రంపై దాని ప్రభావం అంశాలను వివరించానని అన్నారు. ప్రాథమికంగా నష్ట తీవ్రత అంచనాను కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. పూర్తిస్థాయి సమగ్ర నివేదికను కూడా త్వరలోనే పంపేలా చర్యలు చేపడతామని చెప్పారు.
రైతులను ఆదుకుంటాం..
వ్యవసాయ, ఉద్యాన పంటల ఎన్యుమరేషన్ చేసి రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి మాటిచ్చారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని వివరించారు. రేపటి నుంచే ప్రభావిత జిల్లాల్లో పంటలు మినహా మిగతా చోట్ల బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. రేపు (గురువారం) జరిగే వర్చువల్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రేపు మధ్యాహ్నం క్షేత్రస్థాయికి వెళ్లి నష్ట తీవ్రతను పరిశీలిస్తామని చెప్పారు. బాధ్యతగా, ప్రజలకు వేగంగా సేవలు అందించి ఓ నమ్మకాన్ని, భరోసాను కల్పించటమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటించి ప్రజలు కూడా పూర్తిగా సహకారం అందించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్నబ్ తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు సిద్ధం చేయండి: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో కూటమి ధర్మం పాటించాల్సిందే.. శ్రేణులకు చంద్రబాబు, పవన్, మాధవ్ దిశానిర్దేశం
ఆర్నబ్ తుఫాన్ ప్రభావం.. ఏపీ ప్రభుత్వం సర్వత్రా అప్రమత్తం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News