ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:42 PM
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినడంతో ఏపీకి తెలంగాణ ప్రభుత్వం సాయం అందించనుంది. ఈ నేపథ్యంలో సాయం కోసం ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ సానుకూలంగా స్పందించింది.
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినడంతో ఏపీకి తెలంగాణ ప్రభుత్వం సాయం అందించనుంది. ఈ నేపథ్యంలో సహాయం కోసం ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సహాయక చర్యలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు.
తుఫాన్‌తో ఏపీలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని చంద్రబాబు తెలిపారు. 16 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ పునరుద్ధరణకు సాంకేతిక బృందాలు, యంత్రాలు పంపాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. భట్టి విక్రమార్క ఆదేశాలతో రంగంలోకి TGSPDCL అధికారులు దిగారు.
విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం ఏపీకి తెలంగాణ విద్యుత్ సిబ్బంది బయలుదేరి వెళ్లారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మతుల్లో సహాయక బృందాలు సేవలు అందించనున్నాయి. విపత్తు వేళ ఏపీకి తెలంగాణ అండ.. తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావానికి నిదర్శనమని మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News