Share News

దేవుడికి, కన్నతల్లికి జగన్ గౌరవం ఇవ్వరు.. ఎంపీ కలిశెట్టి ధ్వజం

ABN , Publish Date - Mar 22 , 2026 | 03:28 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లల్లో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.

దేవుడికి, కన్నతల్లికి జగన్ గౌరవం ఇవ్వరు.. ఎంపీ కలిశెట్టి ధ్వజం
TDP MP Kalisetti Appala Naidu

అమరావతి, మార్చి22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP MP Kalisetti Appala Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లల్లో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రను ఉత్తుత్తి ఆంధ్రగా మార్చి అభివృద్ధిని అడ్డుకున్నారని ఆగ్రహించారు. ఈరోజు(ఆదివారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ద్రోహిగా జగన్ నిలిచిపోయారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్ర వనరులను వైసీపీ దొంగలు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి కన్నతల్లిని కూడా మోసం చేశారని ఆరోపించారు. కన్నతల్లిపైనే సొంత పత్రికలో తప్పుగా మాట్లాడించి వార్తలు రాయిస్తున్నారని దుయ్యబట్టారు. విజయమ్మపై అవమానకరంగా వైసీపీ సైకోలతో జగన్ మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. సమాజం, తల్లి, చెల్లి పట్ల కనికరం లేని జగన్ నాయకుడిగా ఎలా రాణిస్తారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.


అభివృద్ధిని అడ్డుకునేలా కేసులు..

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా కేసులు వేయిస్తూ.. రాక్షసుడిలా జగన్ అడ్డుకుంటున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. జగన్ బాబాయ్‌, మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హత్య చేసి గుండెపోటని, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ విష ప్రచారం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆడబిడ్డగా ఎవరికైనా అన్యాయం జరిగితే అండగా నిలిచే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు. అది విజయమ్మ అయినా మరే ఇతర మహిళ అయినా న్యాయం కావాలంటే అండగా నిలబడతామని స్పష్టం చేశారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన ప్రతి మాట మోసమని ఐదేళ్ల పాలనలో చూశామని అన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ చెప్పిందంతా అబద్ధం, చేసిదంతా మోసమని ఎద్దేవా చేశారు. తల్లిని, చెల్లిని ఎరగా చూపి ఎన్నికల్లో లబ్ధి పొంది నేడు రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. జగన్ తల్లి విజయలక్ష్మిని, చెల్లెళ్లు షర్మిళ, సునీతాలకు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహించారు.


హిందూ సంప్రదాయాలను జగన్ చులకనగా చూశారు..

హిందూ ధర్మాన్ని హిందూ సంప్రదాయాలను జగన్ చులకనగా చూశారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూను అపవిత్రం చేసి మహాపాపం చేశారని ఫైర్ అయ్యారు. దేవుడు, కన్నతల్లి, వ్యవస్థ, చట్టం అంటే జగన్‌కు గౌరవం లేదని దుయ్యబట్టారు. ఆయన లాంటి వ్యక్తి సమాజానికి ప్రమాదమని హెచ్చరించారు. జగన్‌ను సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


ఉపాధి కల్పించేలా ఆర్సెలార్ మిట్టల్

దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఆర్సెలార్ మిట్టల్ ఉత్తరాంధ్రకు వచ్చిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించేలా ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టు‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారని ప్రస్తావించారు. రూ.1.05 లక్షల కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు 2029లోగా పూర్తి అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రకు మరో మణిహారంగా నిలవబోతోందని చెప్పుకొచ్చారు. జూన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని 20 నెలల్లో సీఎం చంద్రబాబు చేసి చూపించారని వ్యాఖ్యానించారు. 20 నెలల్లోనే ఏపీలో మంచి పాలన చూశామని ప్రజలు సంతోషిస్తున్నారన్నారు. చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ముందడుగు

విమాన టికెట్ల ధరలపై కేంద్రం దృష్టి.. ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తాం: రామ్మోహన్ నాయుడు

తిరుమలలో అత్యాధునిక పరికరాలతో ఆహార నాణ్యత పరీక్షలు: మంత్రి సత్యకుమార్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 03:37 PM