ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ముందడుగు
ABN , Publish Date - Mar 21 , 2026 | 06:30 PM
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు పడింది. ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో ఆర్సెలార్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవబోతుంది.
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు పడింది. ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో ఆర్సెలార్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవబోతుంది. గత 21 నెలల కూటమి ప్రభుత్వ కృషితో ఈ భారీ ప్రాజెక్టు సాకారం కాబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేయనుంది.
భారీ పెట్టుబడి .. ఆర్థిక వృద్ధి
సుమారు రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులలో ఒకటి. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నక్కపల్లి, పాయకరావుపేట, చుట్టుపక్కల ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఉక్కు కర్మాగారం వస్తే దానిపై ఆధారపడే వందలాది చిన్న తరహా పరిశ్రమలు చుట్టుపక్కల ఏర్పడతాయి. తద్వారా పరోక్ష ఉపాధి భారీగా పెరుగుతుంది. ఆర్సెలార్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ సంస్థలు ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ సంస్థలు అత్యంత ఆధునికమైన, పర్యావరణహితమైన సాంకేతికతను ఇక్కడ ఉపయోగించనున్నాయి.
23న భూమిపూజ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కలిసి ఈనెల 23వ తేదీన (సోమవారం) భూమిపూజ చేయనున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయం..
గత 21 నెలలుగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక విధానాలు, సులభతర వాణిజ్యం (Ease of Doing Business), వేగవంతమైన అనుమతుల వల్లే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. విశాఖపట్నం పోర్టుకు సమీపంలో ఉండటంతో ముడిసరుకు రవాణా , ఎగుమతులకు ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఈ ప్రాజెక్టు ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్‌ను ‘భారతదేశ ఉక్కు రాజధాని’గా మార్చే దిశగా వేసిన బలమైన అడుగని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News