Share News

నిమజ్జనం వేళ.. ఈ జాగ్రత్తలు పాటించండి

ABN , Publish Date - Sep 18 , 2026 | 08:07 AM

పండుగల్లో గణపతి నవరాత్రులకు ఉన్న ప్రత్యేకత వేరు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో పాల్గొంటారు. ఈ వేడుకల్లో నిమజ్జన కార్యక్రమం మరింత ప్రత్యేకం.

నిమజ్జనం వేళ.. ఈ జాగ్రత్తలు పాటించండి
Ganesh immersion

  • చివరి అంకానికి గణపతి నవరాత్రులు

  • జిల్లాలో నదులు, చెరువులు అధికం..

  • సుదీర్ఘ సముద్రతీర ప్రాంతం సైతం

  • జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే

  • రెండేళ్ల కిందట శ్రీకాకుళం హడ్కో కాలనీలో జరిగిన వినాయక నవరాత్రి వేడుకల్లో బాలుడు విద్యుత్‌ ప్రమాదంలో చనిపోయాడు. విద్యుత్‌ తీగలు తగలడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

  • ఐదేళ్ల కిందట పొందూరు మండలం బురిడికంచరాం గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ట్రాక్టర్ చక్రాలు బురదలో కూరుకుపోవడంతో పైనున్న విగ్రహం పడి యారబాటి వేణుగోపాల్‌ అనే ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు.

  • ఐదేళ్ల కిందట వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా నరసన్నపేటలో విద్యుత్‌ లైటింగ్‌ కడుతుండగా ప్రమాదానికి గురై అలిగి హేమంత్‌కుమార్‌ అనే యువకుడు మృతిచెందాడు. విద్యుత్‌ తీగలకు లైటింగ్‌ కర్ర తగలడంతో అక్కడే కుప్పకూలిపోయాడు.

  • ఐదేళ్ల కిందట సారవకోట మండలం బుడితిలో వినాయక నిమజ్జనోత్సవంలో ట్రాక్టర్‌పై ఉన్న ధర్మాన రాంబాబు అనే వ్యక్తికి విద్యుత్‌ తీగలు తగలడంతో కుప్పకూలి పోయాడు. అందరూ చూస్తుండగానే చనిపోయాడు.


తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్లలో బుధవారం వినాయక నిమజ్జనం వేళ చెరువులో దిగి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యంగా యువత, చిన్నపిల్లలు అప్రమత్తంగా వ్యవహారించాలి. ఉత్సాహంతో గణనాథుడిని సాగనంపే సమయంలో ఏమరపాటుతో ఉంటే అంతే సంగతులు.

రణస్థలం/నరసన్నపేట, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): పండుగల్లో గణపతి నవరాత్రులకు ఉన్న ప్రత్యేకత వేరు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో పాల్గొంటారు. ఈ వేడుకల్లో నిమజ్జన కార్యక్రమం మరింత ప్రత్యేకం. ఈ సమయంలో అప్రమత్తంగా వ్యవహారించడం ద్వారా మరింత ఆనందాన్ని మదిలో నింపుకోవచ్చు. అప్రమత్తంగా లేకపోవడం వల్ల జిల్లాలో గతంలో ఎన్నో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్‌శాఖ పరంగా మాత్రమే కాదు.. ఎవరికివారు స్వీయ రక్షణ, భద్రత పాటిస్తే నిమజ్జనోత్సవం ఆనందమయంగా సాగుతుంది.


ఇదీ పరిస్థితి..

జిల్లాలో దాదాపు 10 వేల విగ్రహాలు ఏర్పాటై ఉంటాయన్నది ప్రాథమిక అంచనా. ఇప్పటికే నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో వంశధార, నాగావళితో పాటు వాగులు, గెడ్డలు, వేలాది చెరువులు ఉన్నాయి. వీటికితోడు 198 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. 11 తీర మండలాల్లో దాదాపు 20 బీచ్‌లు ఉన్నాయి. వినాయక నిమజ్జనం ప్రారంభం కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం నగరంలో నాగావళి నదిలో నగరవాసులతో పాటు ఎచ్చెర్ల, ఆమదాలవలస మండలానికి చెందిన వారు విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ కొత్త, పాత వంతెనల వద్ద మరింత గస్తీ పెంచితే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రధాన బీచ్‌లలో సైతం ప్రత్యేక ఏర్పాట్లు, పోలీసుల పర్యవేక్షణ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

కమిటీ సభ్యులను అప్రమత్తం చేశాం - డి.లక్ష్మణరావు, డీఎస్పీ, టెక్కలి

ఎస్పీ ఆదేశాల మేరకు నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండాలని కమిటీ సభ్యులను అప్రమత్తం చేశాం. ప్రతీ గ్రామానికి దత్త పోలీసు ఆధ్వర్యంలో ఊరేగింపులు నిర్వహిస్తాం. నిమజ్జనం సమయంలో తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మద్యానికి దూరంగా ఉండాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.


ఇవి పాటించాలి

  • ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, నదులు నిండుగా ఉన్నాయి. ఈత తెలిసిన వారు మాత్రమే అదీ ఒడ్డున ఉంటూ కార్యక్రమం పూర్తి చేయాలి. జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో నిమజ్జనానికి చెరువులతో పాటు నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయ నదులు, కాలువలే ఎంచుకుంటారు.

  • ఉపాధి పనులు చేపట్టడం వల్ల చెరువులు లోతుగా ఉన్నాయి. ఊరేగింపు సమయంలో లోతు తెలియని వారు చెరువుల్లో దిగరాదు. గుంతల్లోకి దిగితే మునిగే ప్రమాదం ఉంది.

  • ఊరేగింపులోకి మద్యం సేవించి వచ్చేవారిని దూరంగా ఉంచాలి. నిమజ్జనానికి వెళ్లేటప్పు డు రహదారులపై వాహన రాకపోకలను గమనించాలి.

  • ఎత్తైన విగ్రహాలను వాహనాల్లో తరలించే సమయంలో విద్యుత్‌ తీగలు గమనించాలి.

  • నిమజ్జనంలో అధిక శబ్దాలు వచ్చే డీజే వంటి బాక్సులను ఏర్పాటు చేయరాదు. పోలీసులు సూచనలు కచ్చితంగా పాటించాలి.

  • పోలీసులు సూచించిన మార్గంలోనే ఊరేగింపు చేయాలి. వేషదారణలపై ముందుస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

  • మందుగుండు సామగ్రి పేల్చే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రధాన రహదారులపై పేల్చరాదు.


జాగ్రత్తలు అవసరం - ఎం.అవతారం, జేఆర్‌ పురం సీఐ

నిమజ్జనోత్సవంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులు, డీజేలు వినియోగించకూడదు. నిర్దేశించిన ప్రదేశాల్లో, సురక్షితమైన ప్రాంతాల్లో మాత్రమే నిమజ్జనాలు చేయాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీస్ శాఖలో పోస్టుల‌ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

యువ క్రీడాకారులకు జ్యోతి యర్రాజీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు: మంత్రి లోకేశ్

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 08:37 AM