భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
ABN , Publish Date - Aug 01 , 2026 | 10:37 AM
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేరుకున్నారు.
విజయనగరం జిల్లా, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) చేరుకున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే మీద మొట్టమొదటగా ప్రధాని మోదీ ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ట్రయల్ రన్ అనంతరం తొలిసారిగా ప్రధాని ప్రయాణించే విమానం ల్యాండ్ కావడంతో అందరిలోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ప్రధానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు, తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయం టెర్మినల్ భవనం వద్దకు చేరుకుని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
అరకు కాఫీ కియోస్క్‌ను సందర్శించనున్న ప్రధాని..
సుమారు 15 నిమిషాల పాటు టెర్మినల్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను మోదీ పరిశీలించనున్నారు. టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్-ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను పరిశీలించనున్నారు. అరకు కాఫీ కియోస్క్‌ను సందర్శించి అరకు కాఫీని రుచి చూడనున్నారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను ప్రధాని పరిశీలించనున్నారు. విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్‌టాప్ జీపులో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ సభకు హాజరుకానున్నారు. టెర్మినల్ నుంచి సభా వేదికకు వెళ్లే మార్గంలో వేలాది మంది గిరిజన మహిళలు ప్రదర్శించే థింసా సృత్యాన్ని వీక్షించనున్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని
బహిరంగ సభా వేదికపై నుంచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్‌ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ - టెస్టింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ప్రారంభించనున్నారు. అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. కర్నూలు-IV రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు, పెంచలకోన–యరపాడు మధ్యన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే, ఖమ్మం – దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లేన్ల బైపాస్ రహదారులను ప్రారంభించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల శిలాఫలకాల ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసగించనున్నారు.
వార్తలు కూడా చదవండి...
భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు
పవన్ కల్యాణ్ ఆదేశాలతో కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు
ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ఉన్నతాధికారుల సమీక్ష
Read Latest AP News And Telangana News And National News
And Telugu News