నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎంపీ శ్రీ భరత్
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:41 AM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ వ్యాఖ్యానించారు. ఎంపీ నిధుల ద్వారా సునీల్ శర్మ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టిన అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
విశాఖపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ (Visakhapatnam MP Sri Bharat) వ్యాఖ్యానించారు. ఎంపీ నిధుల ద్వారా సునీల్ శర్మ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టిన అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ నిధులతో పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు భవనాలకు పెయింటింగ్, గ్రిల్స్ ఏర్పాటు, విద్యుత్ సౌకర్యాల మెరుగుదల, పాఠశాల మైదానం లెవెలింగ్ వంటి పనులు చేపట్టామని తెలిపారు. . దీంతో విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం అందుబాటులోకి వచ్చిందని చెప్పుకొచ్చారు.
తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరుగుతోంది..
పాఠశాల అభివృద్ధి పనుల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరుగుతోందని ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 80 మంది కొత్త విద్యార్థులు ఈ పాఠశాలలో చేరడం విశేషంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలలే మొదటి ఎంపికగా మారేలా విద్యా ప్రమాణాలను పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేసే దిశగా చర్యలు..
నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీ శ్రీ భరత్ వ్యాఖ్యానించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దడం, నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖలో జరిగిన ఈ అభివృద్ధి పనులు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడమే కాకుండా, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచుతున్నాయని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి: అనిత
ట్రంప్, పుతిన్‌లకు కూడా ఫిర్యాదు చేయండి.. నానిపై శివనాథ్ సెటైర్లు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News