Share News

విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్

ABN , Publish Date - Mar 18 , 2026 | 06:27 PM

విశాఖపట్నం రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. వైజాగ్‌లోని ముడసర్లోవ వద్ద 52.2 ఎకరాల భూమిని ఆగస్టు 2024లో రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించిందని ప్రస్తావించారు.

విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్
Ashwini Vaishnaw

ఢిల్లీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) స్పష్టం చేశారు. ఈరోజు(బుధవారం) లోక్‌సభలో ఆయన మాట్లాడారు. వైజాగ్‌లోని ముడసర్లోవ వద్ద 52.2 ఎకరాల భూమిని ఆగస్టు 2024లో ఏపీ ప్రభుత్వం రైల్వేశాఖకు అప్పగించిందని ప్రస్తావించారు. సౌత్ కోస్ట్ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి రూ.106.89 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 2025 జనవరిలో ఈ జోన్‌కు శంకుస్థాపన జరిగిందని.. ప్రస్తుతం ప్రధాన కార్యాలయ భవన పునాది పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. జోన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు VMRDA భవనం ‘ది డెక్’ సిద్ధమైందని అన్నారు. త్వరలోనే అక్కడి నుంచే పాలన జరుగుతుందని చెప్పుకొచ్చారు.


ఉన్నతాధికారుల నియామకం..

రైల్వేజోన్ కోసం జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకం పూర్తి చేస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 2009-2014 మధ్య సగటున రూ. 886 కోట్లు ఉంటే, 2025- 26లో ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయిలో రూ.9,417 కోట్ల కేటాయింపులు జరిగాయని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రైల్వేట్రాక్ నిర్మాణ వేగం రెట్టింపు అయిందని వివరించారు. ప్రతి ఏటా సగటున 143 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఎర్రుపాలెం - అమరావతి - నంబూరు కొత్త రైల్వేలైన్ (57 కిలోమీటర్ల) కోసం రూ. 2047 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఏపీలో ప్రస్తుతం రూ. 70,232 కోట్ల విలువైన 39 రైల్వే ప్రాజెక్టులు (కొత్త లైన్లు, డబ్లింగ్) పనులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. విజయవాడ - గూడూరు మూడవ రైల్వేలైన్, గుంతకల్ - గుంటూరు డబ్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు

మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్

గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 06:47 PM