Share News

జగన్ హయాంలో వివేకా హత్య కేసులో ఏ ఒక్క ఆధారమైనా ఎందుకు బయటపెట్టలేదు.. షర్మిల ధ్వజం

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:03 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి.. వివేకా కుమార్తె సునీత మీద చేసిన వ్యాఖ్యలకు తాను చాలా బాధపడ్డానని అన్నారు.

జగన్ హయాంలో వివేకా హత్య కేసులో ఏ ఒక్క ఆధారమైనా ఎందుకు బయటపెట్టలేదు.. షర్మిల ధ్వజం
YS Sharmila

విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై (Viveka Case) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (బుధవారం) విశాఖపట్నంలో షర్మిల పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి.. వివేకా కుమార్తె సునీత మీద చేసిన వ్యాఖ్యలకు తాను చాలా బాధపడ్డానని అన్నారు. వివేకాకు గుండెపోటు వచ్చిందని సునీతానే చెప్పారని.. అవినాశ్‌రెడ్డి మాట్లాడటం చాలా దారుణమని అన్నారు. అవినాశ్‌రెడ్డికి పలుకుబడి, డబ్బు ఉందని, ఎన్ని తప్పులు చేసిన తప్పించుకోవచ్చని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాను చేతిలో పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేయాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు.


సాక్షి మీడియాలోనే మొదటగా ప్రచారం..

వివేకానంద గుండెపోటుతో చనిపోయారని సాక్షి మీడియాలోనే మొదటగా ప్రచారం చేశారని షర్మిల ప్రస్తావించారు. స్థానికంగా ఉన్న అవినాశ్‌రెడ్డి, సాక్షి యజమాని భారతిరెడ్డి ఎందుకు గుండెపోటని ప్రచారం చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ హత్య ముమ్మాటికీ కడప ఎంపీ టిక్కెట్టు విషయంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై వివేకానంద స్వయంగా తనతో చర్చించారని తెలిపారు. అవినాశ్‌రెడ్డికి టిక్కెట్టు ఇస్తే, వివేకానంద సపోర్ట్ చేశారని గుర్తుచేశారు. ఎప్పటికైనా వివేకానంద బతికి ఉంటే, తనకు ఇబ్బంది అవుతుందనే కారణంతోనే అవినాశ్‌రెడ్డి ఈ హత్య చేశారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో మొదటగా సీబీఐ విచారణ కావాలని జగన్ అన్నారని, ఆ తర్వాత వద్దని కూడా ఆయనే చెప్పారని తెలిపారు. వివేకా కేసును సిట్ అధికారులతో విచారణ చేయిస్తే సరిపోతుందని జగన్ చెప్పారని అన్నారు. ఈ కేసులో సీబీఐ అన్ని ఆధారాలను సేకరించిందని, ప్రధానంగా అవినాశ్‌రెడ్డి పేరును ప్రస్తావించిందని తెలిపారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఎందుకు ఒక్క ఆధారం కూడా బయటపెట్టలేకపోయారని ప్రశ్నల వర్షం కురిపించారు.


సునీతకు ప్రాణహాని..

సునీతారెడ్డి చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని చెబుతూ.. అవినాశ్‌రెడ్డిని కాపాడుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని షర్మిల అన్నారు. సునీతకు ప్రాణహాని ఉందని, అయినా ఆమె పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తన తండ్రి హత్య వెనుక ఉన్న నిజాన్ని బయటకు తీసుకురావాలని సునీత పోరాటం చేస్తున్నారని అన్నారు.

కూసింతైనా కనికరం లేదా..?

‘జగన్ అన్నకు కూసింతైనా కనికరం లేదా..? ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అనవసరం.. అన్నా అనే పదానికే ఆయనో కళంకం. జగన్ మోహన్‌రెడ్డి బాధితులపట్ల కాకుండా నిందితులపట్ల నిలబడ్డారనే విషయం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలిస్తే ఎంతగానో బాధపడేవారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసమే చంద్రబాబును కలిశారని.. నిరంతరం పోరాటం సాగిస్తున్నారని.. కానీ న్యాయం మాత్రం జరగట్లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు

మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్

గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 06:20 PM