ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 02 , 2026 | 03:58 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో పర్యటించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ఎడమ కాల్వను పరిశీలించి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు.
అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (బుధవారం) అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో పర్యటించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ఎడమ కాల్వను పరిశీలించి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసి జలహారతి ఇచ్చారు. ముఖ్యమంత్రికి సంప్రదాయ కోలాటంతో స్వాగతం పలికారు.
పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు నీరు ఇస్తున్నందుకు సూచికగా పాయకరావుపేట వద్ద శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శిలాఫలకం వద్ద సీఎం చంద్రబాబు ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎడమ కాలువ నుంచి అనకాపల్లి జిల్లా వరకూ వచ్చిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేశారు. ఎడమ కాల్వ ద్వారా వదిలే నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది.
ఎడమ కాలువ నిర్మాణానికి రూ.4,192 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎడమ కాలువ ద్వారా వచ్చిన నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జల వనరుల శాఖ ప్రణాళిక రచించింది. గోదావరి జలాలతో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడి గడ్డ ఆయకట్టు పరిధిలోని 46,620 ఎకరాలను ప్రభుత్వం స్థిరీకరణ చేస్తోంది. 23.44 టీఎంసీల గోదావరి జలాలతో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు, తాగు, సాగునీటికి నీరు ఇచ్చేలా ప్రణాళిక చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్
సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్
ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News