రిషికొండ ప్యాలెస్‌ను టూరిజం రిసార్ట్‌గా కొనసాగించడం ఉత్తమం: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Jun 17 , 2026 | 08:09 PM
రిషికొండ ప్యాలెస్‌ను టూరిజం రిసార్ట్‌గా అభివృద్ధి చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
విశాఖపట్నం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రిషికొండ ప్యాలెస్‌ను టూరిజం రిసార్ట్‌గా అభివృద్ధి చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈరోజు (బుధవారం) మంత్రుల సబ్ కమిటీ విశాఖపట్నంలోని రిషికొండ ప్యాలెస్‌ను పరిశీలించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, డోలా బాలా వీరంజనేయస్వామి భవనాలను పరిశీలించారు. మంత్రుల వెంట పర్యాటక శాఖ, రెవెన్యూ ఉన్నతాధికారులు ఉన్నారు. రిషికొండలో జగన్ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలపై మంత్రులు పలు వ్యాఖ్యలు చేశారు. అనంతరం మీడియాతో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు.
హరిత రిసార్ట్స్‌ను తొలగించి ‘రీ డెవలప్‌మెంట్ ఆఫ్ రిసార్ట్స్’ పేరుతో సుమారు రూ.450 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. నిర్మాణాల్లో విలాసవంతమైన సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, కొన్ని బాత్‌రూమ్‌లను 21×21 అడుగుల పరిమాణంలో నిర్మించారని చెప్పారు. అలాగే భవన నిర్మాణ వ్యయంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. చదరపు అడుగుకు అసాధారణ స్థాయిలో వ్యయం చేసినట్లు వ్యాఖ్యానించారు. నిర్మాణాల వైభవాన్ని చూస్తే అప్పటి ప్రభుత్వ ప్రాధాన్యతలు అర్థమవుతాయని అన్నారు.
పలు ప్రతిపాదనలు పరిశీలన..
రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వం పలు ప్రతిపాదనలను పరిశీలించినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. హాస్పిటాలిటీ సెంటర్, మ్యూజియం, కల్చరల్ సెంటర్, వెల్‌నెస్ సెంటర్ వంటి పలు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, చివరకు టూరిజం రిసార్ట్‌గా మార్చడమే సరైన మార్గమని పేర్కొన్నారు. అయితే ప్రజల సందర్శన కోసం ఒక ప్రత్యేక కల్చరల్ సెంటర్‌ను కూడా అందుబాటులో ఉంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని కూడా ప్రోత్సహించే అవకాశం ఉంటుందని తెలిపారు.
భారీగా నిర్వహణ వ్యయం..
రిషికొండ ప్యాలెస్ నిర్వహణకు ప్రతి నెల కనీసం రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతోందని పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రస్తుతం ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారమైన ‘వైట్ ఎలిఫెంట్’ లాంటి ఆస్తిగా మారిందని వ్యాఖ్యానించారు. అందుకే ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజం రంగంలో వినియోగించడం ద్వారా ఆదాయం సమకూరేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న వారికి ఆహ్వానం..
రిషికొండ ప్యాలెస్ నిర్వహణ, అభివృద్ధి కోసం త్వరలోనే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలుస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఆసక్తి చూపే సంస్థల అర్హతలు, అనుభవం, ఆర్థిక సామర్థ్యాన్ని పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే 7 నుంచి 8 సంస్థలు రిషికొండ ప్యాలెస్‌ను సందర్శించి పరిశీలించినట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న సంస్థలకు పూర్తి వివరాలు, సదుపాయాలను చూపించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని పయ్యావుల కేశవ్ తెలిపారు.
పీపీపీ పద్ధతిలో వెళ్లాలని నిర్ణయించాం: మంత్రి కందుల దుర్గేశ్

రుషికొండ ప్యాలెస్‌పై మంత్రుల కమిటీ మూడుసార్లు సమావేశం నిర్వహించిందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. అనేకమంది అభిప్రాయాలు సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత రుషికొండ ప్యాలెస్‌ని రిసార్ట్స్‌కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. సీఎంకి, కేబినెట్‌కి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని అన్నారు. పీపీపీ పద్ధతిలో వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజాధనం వృథా కాకూడదని, ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.
ప్రజాధనం దుర్వినియోగం చేశారు: మంత్రి బాల వీరాంజనేయ స్వామి

జగన్ హయాంలో రీ డెవలప్‌మెంట్ పేరుతో రుషికొండ ప్యాలెస్ ప్రారంభించి ఎలా నిర్మించారో చూశామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలని తమ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని తెలిపారు. సబ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వానికి చెబుతామని బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సింగపూర్ తర్వాత పెట్టుబడులకు ఏపీనే ఉత్తమ గమ్యస్థానం: సీఎం చంద్రబాబు
మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోంది: ప్రహ్లాద్ జోషి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News