Share News

విలక్షణ నేత వెంకయ్య

ABN , Publish Date - Sep 06 , 2026 | 01:23 PM

దేశ రాజకీయాల్లో జాతీయస్థాయిలో ముఖ్యమైన పాత్ర పోషించిన తెలుగువారు తక్కువ. వారిలో మన కనుల ముందు కనిపిస్తున్న వ్యక్తుల్లో వెంకయ్యనాయుడు ఒకరు.

విలక్షణ నేత వెంకయ్య
M Venkaiah Naidu

దేశ రాజకీయాల్లో జాతీయస్థాయిలో ముఖ్యమైన పాత్ర పోషించిన తెలుగువారు తక్కువ. వారిలో మన కనుల ముందు కనిపిస్తున్న వ్యక్తుల్లో వెంకయ్యనాయుడు ఒకరు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామంలో జన్మించినప్పటికీ, ఎలాంటి రాజ కీయ నేపథ్యం లేకపోయినప్పటికీ... వెంకయ్య కేంద్రమంత్రిగా, భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడుగా, ఉపరాష్ట్రపతిగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయగలిగారు.


వాగ్ధాటి, ఆహార్యం, హుందాతనం, రాజకీయ చాతుర్యం, సమయస్ఫూర్తి వల్ల ఆయన తన ప్రత్యేకతను చాటుకోగలిగారు. అయితే ఒక రాజకీయనాయకుడుగా విజయం సాధిం చాలంటే కేవలం ఈ లక్షణాలు సరిపోవు. కష్టపడే మనస్తత్వాన్ని అలవాటు చేసు కోవడం... స్వంత కోరికలు, స్వంత ఇష్టాలు కొంత ప్రక్కన పెట్టడం... మనం కోసం మనం కాకుండా, జనం కోసం జీవించడం... నిరంతరం అధ్యయనం చేయడం... ఈ నాలుగు లక్షణాలు రాజకీయనాయకుడికి అవసరమని ఆయనే చెప్పారు.


ప్రజల్లో ఆకర్షణ రావడం అనేది కేవలం ప్రసంగం వల్ల జరగదని, సిద్ధాంతం, వ్యవహారం, ఆచరణ శైలి, మాట్లాడే పద్ధతి, సంస్కారం... వీటన్నింటిని బట్టి నాయకుడు అనేవాడు ఎలాంటి వ్యక్తో ప్రజలకు సరిగా అర్థమవుతుందని, అతడి పట్ల గౌరవం పెరుగు తుందని వెంకయ్యనాయుడు 2014లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శాసన సభ్యులకు పునశ్చరణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ చెప్పారు. వెంకయ్య చెప్పిన లక్షణాలు ఇవాళ్టి ప్రజాప్రతినిధుల్లో ఎంతమందిలో ఉన్నాయో చెప్పడం కష్టం. కానీ వెంకయ్య తాను చెప్పిన లక్షణాలు తానే సాధ్యమైనంత మేరకు పాటించే ప్రయత్నం ఇవాళ్టీకీ చేస్తున్నారు.


వెంకయ్యనాయుడును కేవలం ఒక వ్యక్తిగా చూసి అంచనా వేయలేం. ఆయన వెనుక కనీసం అయిదు దశాబ్దాల భారత దేశచరిత్ర ఉన్నదని చెప్పక తప్పదు. వెంకయ్య ‘నాయకుడు’ (ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకూ)... ఒక స్ఫూర్తి ప్రదాత జీవిత చరిత్ర పేరుతో సీనియర్‌ జర్నలిస్టు మాశర్మ రచించిన పుస్తకం. వెంకయ్య జీవితంలో జరిగిన కీలక ఘట్టాలను ఆమూలాగ్రంగా పూసగుచ్చినట్లు వివరించారు. ఈ రచనను అధ్యయనం చేస్తే వెంకయ్యనాయుడు స్వాతంత్ర్యానంతరం దేశం సృష్టించిన అరుదైన నాయకుల్లో ఒకరని అర్థమవుతుంది.


మాశర్మ వెంకయ్యనాయుడు పరిణామ క్రమంలోని కీలక ఘట్టాలన్నిటినీ అద్భుతంగా చిత్రించారు. చిన్నతనంలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరడం, జనసంఘ్‌తో అనుబంధం... విద్యార్థి నాయకుడుగా రాణించిన వెంకయ్య జీవితాన్ని జై ఆంధ్రా ఉద్యమం మలుపు తిప్పింది. విశాఖ పట్టణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఆయనకు స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం మార్గదర్శకత్వంలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో పాల్గొనడంతో... ఆయన అనివార్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎమర్జెన్సీలో జైలు పాలై బయటకు వచ్చిన తర్వాత అతి పిన్న వయసులో ఆయన జనతా పార్టీ తరపున లోక్‌సభకు పోటీ చేసినా, అసెంబ్లీకి ఎన్నిక కావడం... ఆయన తనను తాను ఉత్తమ ప్రజాప్రతినిధిగా నిరూపించు కోవడానికి అవకాశం కలిగించింది.


zzz.jpgతెలుగుదేశం పార్టీ ఆవిర్భవించకపోతే ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో వెంకయ్య తదితరుల నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేదేమో. ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన కుట్రల మూలంగా కాంగ్రెేసతర శక్తులన్నీ ఏకం కావల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనూ ఉదయగిరి నుంచి రెండోసారి గెలిచిన వెంకయ్య... అడ్వాణీ రథయాత్రను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించడంతో ఢిల్లీ దృష్టిలో పడ్డారు. నాగ పూర్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్నప్పుడు సభలో అందరు స్తబ్దుగా ఉన్న సమయంలో వెంకయ్య వాక్ప్రవాహం అందర్నీ తట్టి లేపిందని, ఈ ప్రవాహంలో కొట్టుకుపోయిన వాజపేయి, అడ్వాణీఆయనను ఢిల్లీకి తీసుకురావాలని నిర్ణయించారని నాటి పరిణామాలను రికార్డు చేసిన జర్నలిస్టుల కథనం. తొలుత జాతీయ ప్రధాన కార్యదర్శిగా 1993లో ఢిల్లీకి వచ్చిన ఆయనను అయిదేళ్లలోనే పార్టీ రాజ్యసభకు పంపింది.


ఢిల్లీకి వచ్చిన తర్వాత అశోక రోడ్‌లోని కార్యాలయంలో ఆయన నిర్వహించిన పాత్రే బీజేపీ ఆయనను జాతీయ స్థాయి నాయకుల్లో ఒకరిగా చేసింది. అందువల్లే వెంకయ్యను వాజపేయి తన కేబినెట్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నియమించారు. అదే ఆయనకు క్లిష్టకాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యేందుకు కారణమైంది.


వెంకయ్య అధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే గుజరాత్‌ అల్లర్లు జరగడం ఆయన రాజకీయ జీవితంలో మరో కీలక పరిణామం. వాజపేయి అభిప్రాయాలకు భిన్నంగా అత్యంత సంక్షోభ సమయంలో నరేంద్రమోదీకి ఆయన మద్దతు నీయాల్సి వచ్చింది. నాడు అడ్వాణీ కూడా మోదీకి మద్దతునిచ్చారు. కాని అదే అద్వాణీ 2014లో మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకించి నప్పుడు కూడా వెంకయ్య తన గురువును కాదని మోదీకి మద్దతునిచ్చారు. మోదీకి ఉన్న జనాదరణ వల్ల బీజేపీ అంతటా ఘన విజయం సాధిస్తుందని వెంకయ్య నమ్మడమే అందుకు కారణం.


ఒక రకంగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ స్థిరపడడానికి, దేశ ప్రధానిగా 12 ఏళ్లు పాలించడానికి వెంకయ్య నాయుడు పోషించిన కీలక పాత్ర చరిత్ర ఘట్టంలో ఎవరూ చెరిపివేయలేనిది. బహుశా ఈ కృతజ్ఞతతోనే మోదీ ఆయనను ఉపరాష్ట్రపతి పదవిలో నియమించారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉండగానే రాష్ట్ర విభజన జరగడం, ఇరు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోవాలని సూచించి... ఏ రాష్ర్టానికీ అన్యాయం జరగకుండా చూడాలన్న దృక్పథాన్ని అవలంబించారు. ఆ సమయంలో ఆయన నిర్వహించిన పాత్ర అనన్య సామాన్యం.


వక్తృత్వం, కర్తృత్వం, నేతృత్వం, మిత్రత్వం కలగలిపి ఉన్న వెంకయ్యను ఒక విజ్ఞాన భాండాగారంగా మాశర్మ అభివర్ణించారు. ‘ఆయన జీవితం ఒక సింధువు అయితే తాను స్పృశించినది ఒక బిందువు’ అని మాశర్మ చెప్పుకున్నప్పటికీ... వెంకయ్య జీవితం గురించి ఆయన ఒక విహంగ వీక్షణం చేశారు. స్వాతంత్ర్యానంతర భారత దేశ చరిత్రలో ఆయా ఘట్టాల్లో కీలకపాత్ర పోషించిన పలు నాయకుల్లో వెంకయ్య నాయుడు విస్మరించలేని అరుదైన, విలక్షణమైన నాయకుడని వివరించేందుకు ఈ పుస్తకం ద్వారా మాశర్మ చేసిన ప్రయత్నం మెచ్చదగినది.

  • ఎ.కృష్ణారావు


ఈ వార్తలు కూడా చదవండి:

హాథీ.. హమారా సాథీ!

గంగబాయిలమ్మ ఆకుకూర

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 01:25 PM