Share News

హాథీ.. హమారా సాథీ!

ABN , Publish Date - Sep 06 , 2026 | 09:43 AM

ఘర్షణ వల్ల అశాంతీ, ఆందోళనా తప్పవు. ఫలితమూ ఉండకపోవచ్చు. అసోమ్‌లోని గ్రామీణ ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్య మూలమేమిటో గ్రహించి, విజ్ఞతతో వ్యవహరించారు.

 హాథీ.. హమారా సాథీ!
Hathi Hamara Sathi

ఘర్షణ వల్ల అశాంతీ, ఆందోళనా తప్పవు. ఫలితమూ ఉండకపోవచ్చు. అసోమ్‌లోని గ్రామీణ ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్య మూలమేమిటో గ్రహించి, విజ్ఞతతో వ్యవహరించారు. దాంతో ఒకప్పుడు గజరాజుల దూకుడుకు గజగజ వణికే పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది. కొందరికైతే గమ్మత్తుగా వాటితో చెలిమీ ఏర్పడింది!

హాథీ.. హమారా సాథీ!

అసోమ్‌లోని ఉదల్గురి జిల్లా సరిహద్దు గ్రామాల రైతులకు వరిపంట చేతికి వచ్చే సమయం వచ్చిందంటే చాలు... కంటిమీద కునుకు ఉండేది కాదు. భూటాన్‌ కొండలూ, పరిసరాల్లోని అడవుల నుంచి గుంపులు గుంపులుగా వచ్చే ఏనుగులు... పొలాలపై పడి, పంటలను నేలమట్టం చేసేవి. దారుణంగా నాశనం చేసేవి. ఆ దండును తరిమేందుకు రకరకాల ప్రయత్నాలు చేసేవారు. ఫలితంగా రెండు వైపులా గాయపడటాలూ, ప్రాణనష్టమూ జరిగేది. ముఖ్యంగా హాథీకులి, రోంగ్‌హాంగ్‌ గ్రామస్థులకు ఈ సమస్య ఎక్కువగా ఉండేది. ఒకప్పుడు లేని ఈ చిక్కులు కొత్తగా ఎందుకు వచ్చాయో, వాటి మూల కారణాలేమిటో బాగా ఆలోచించారు. శతాబ్దాలుగా ఏనుగులు తిరిగిన అటవీ మార్గాలను మనుషులు ఆక్రమించారు. దీంతో అవి ఆహారం దొరక్క, గ్రామాల్లోని పంటలపై పడి మేస్తూ ధ్వంసం చేస్తున్నాయని గుర్తించారు. ‘హాథీ బంధు’ లాంటి పర్యావరణ సంస్థల సహకారం తీసుకుని, ఒక వినూత్నమైన ఆలోచన చేశారు.


book4.2.jpg

  • దారిలోనే పచ్చటి విందు

గ్రామమంతా ఏకమై సుమారు 66 ఎకరాల బీడు భూమిని ప్రత్యేకంగా అడవి ఏనుగుల కోసమే కేటాయించారు. అక్కడ వాటికి ఇష్టమైన నేపియర్‌ గడ్డినీ, వెదురునూ, అరటి, పనస లాంటి పండ్ల మొక్కలనూ విరివిగా నాటారు. గ్రామంలోకి వెళ్లే దారికి ముందే ఈ పచ్చటి విందు సిద్ధంగా ఉండటంతో అద్భుతమే జరిగింది. కొండల నుంచి దిగి వచ్చిన గజరాజులు ఆ ఆహార ప్రాంతంలోనే కడుపునిండా తినడం, పంటల జోలికి వెళ్లకుండానే అడవిలోకి తిరిగి వెళ్లిపోవడం ప్రారంభించాయి.

ఈ ప్రయోగం మానవ- వన్యప్రాణి ఘర్షణను పూర్తిగా తగ్గించి ఆ గ్రామానికే కాదు, చుట్టుపక్కల పల్లెలకూ శాంతిని చేకూర్చింది. ప్రకృతితో, ప్రకృతిలో భాగమైన జంతుజాలంతో ఘర్షణ పడేకన్నా... వాటితో స్నేహపూర్వకంగా ఉండే సహజీవనమే అసలైన పరిష్కారమని గ్రామస్థులు ఆచరణపూర్వకంగా నిరూపించారు.


  • భయం పోయి... గౌరవం పెరిగింది...

ఏనుగుల కడుపు నింపడానికి ప్రత్యేకంగా ఆహార ప్రాంతాన్ని (ఫుడ్‌ ఫారెస్ట్‌) ఏర్పాటు చేసిన తర్వాత గ్రామ ప్రజల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. గతంలో గుంపులుగా దూసుకువచ్చే ఏనుగులను చూసి, భయపడి వాటిని శత్రువుల్లా భావించేవారు. కానీ ఇప్పుడు ‘గణేశుడి’ ప్రతిరూపంగా వాటికి గౌరవం ఇస్తున్నారు. వాటితో స్నేహంగా ఉంటున్నారు. ‘‘మేం వాటి స్థలాన్ని లాక్కున్నాం. అందుకే అవి మా పంటలమీదకు వచ్చాయి. ఇప్పుడు వాటికి ఆహారం ఇస్తున్నాం కదా? అందుకే అవి మా జోలికి రాకుండా ప్రశాంతంగా ఉంటు న్నాయి’’ అని గ్రామ పెద్దలు చెపుతున్నారు.


book4.3.jpg

  • ఆర్థిక భరోసా, మనశ్శాంతి

ఏటా పంట నష్టపోయి, అప్పులపాలయ్యే రైతులకు ఇప్పుడు పంట మొత్తం భద్రంగా చేతికి వస్తోంది. రాత్రుళ్లు కాపలా కాయాల్సిన అవసరం తప్పి, నిశ్చింతగా కంటినిండా నిద్ర పోతున్నారు. ఏనుగులను తరిమే క్రమంలో మనుషులూ; విద్యుత్‌ షాకులూ, బాణసంచా వల్ల ఏనుగులూ గాయపడటం, మరణించడం పూర్తిగా ఆగిపోయాయి.


  • ఆసక్తికర అనుభవం

‘ఫుడ్‌ ఫారెస్ట్‌’ ప్రయోగంలో ఆశ్చర్య పరుస్తున్న అంశం... ఏనుగుల సహజ ప్రవర్తన, క్రమశిక్షణ. సాధారణంగా ఏనుగుల గుంపునకు ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఓ రోజు కొండల నుంచి దిగిన ఏనుగుల దండు 66 ఎకరాల ఫుడ్‌ ఫారెస్ట్‌ జోన్‌లోకి ప్రవేశించింది. అక్కడ నాటిన పచ్చగడ్డినీ, అరటి పండ్లనూ కడుపునిండా తింటున్నాయి. ఒక గున్న ఏనుగు ఉత్సాహంతో పక్కనే ఉన్న రైతుల వరిపొలం వైపు వెళ్లేందుకు ప్రయత్నించింది. గుంపునకు నేతృత్వం వహిస్తున్న పెద్ద ఏనుగు అది చూసింది. వెంటనే ఘీంకరించి, తొండంతో ఆ గున్నను వెనక్కి లాగి, గడ్డివైపు మళ్లించింది.


తమకు కేటాయించిన సరిహద్దు దాటి, పంట పొలాల్లోకి ఒక్క అడుగు కూడా వేయకుండా గుంపు మొత్తం ఆ ఆహార వనంలోనే ఉండి పోయి, తెల్లవారేసరికి నిశ్శబ్దంగా అడవిబాట పట్టాయి. వాటి క్రమశిక్షణ, కట్టడీ గమనించిన గ్రామ ప్రజలు అబ్బురపడిపోయారు. ‘మనం వాటికి గౌరవంగా ఆహారం ఇస్తే... అవి మన హద్దులను గౌరవిస్తాయి’ అని నిరూపించిన ఈ సంఘటన వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రకృతి వనరులను పర్యవేక్షించే ‘కన్జర్వేషన్‌ టూరిజా’నికి ఇప్పుడు హాథీకులి గ్రామం ఓ గమ్యస్థానంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

రేవంత్‌కు రెండో చాన్స్‌ ఉందా...

ఉద్యోగులపై వరాలు.. 2 డీఏలు, సరెండర్‌ లీవ్‌లకు సర్కారు ఓకే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 09:44 AM