ఉద్యోగులపై వరాలు.. 2 డీఏలు, సరెండర్ లీవ్‌లకు సర్కారు ఓకే
ABN , Publish Date - Sep 06 , 2026 | 04:25 AM
ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన పలు కీలక అంశాల అమలుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
1 నుంచి డీఏల చెల్లింపునకు సీఎం గ్రీన్‌సిగ్నల్
పీఆర్సీకి కమిషనర్ నియామకానికి నిర్ణయం
సంక్రాంతికి సరెండర్ లీవ్ జమ... పోలీసులకు మరొకటి అదనం
నాడు రద్దుచేసిన అదనపు క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరణ
ఈహెచ్‌ఎస్ వాటాలు వైద్యసేవా ట్రస్టుకు.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సీఎం ప్రకటన
ఆందోళన చేసిన 2 సంఘాలతో సహా 11 ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు
ఈ నిర్ణయాలతో ఏటా అదనంగా రూ.2,880 కోట్ల ఖర్చు
కీలక నిర్ణయాలు
12వ పీఆర్సీకి కమిషనర్ నియామకానికి అంగీకారం
2024 జూలై 1, 2025 జనవరికి సంబంధించిన రెండు డీఏల విడుదలకు ఆమోదం.
వచ్చే నెల 1వ తేదీ నుంచి చెల్లింపు.
2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవులను వచ్చే సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాలో వేయడానికి అంగీకారం.
పోలీసులకు అదనంగా ఒక సరెండర్ లీవును దసరాకు చెల్లించేందుకు సుముఖత.
జగన్ ప్రభుత్వం రద్దు చేసిన పెన్షనర్ల అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి ఇవ్వాలని నిర్ణయం. 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర వర్తింపు.
ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌కు సంబంధించి అక్టోబరు నుంచి ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు చెల్లింపులు.
అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): 12వ పీఆర్సీకి కమిషనర్ నియామకానికి కూటమి సర్కారు సమ్మతించింది. రెండు డీఏల విడుదలకు, సంక్రాంతికి సరెండర్ లీవ్‌లను ఉద్యోగుల ఖాతాల్లో వేసేందుకు అంగీకరించింది. వైసీపీ హయాంలో రద్దు చేసిన పెన్షనర్ల అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 11 ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమైన చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు అనుకూలంగా మరికొన్ని నిర్ణయాలు కూడా ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి ప్రభుత్వానికి అదనంగా రూ.2,880 కోట్లు ఖర్చవుతాయి. ప్రభుత్వ సానుకూల వైఖరి పట్ల ఉద్యోగుల సమస్యలపై ఆందోళన చేసిన రెండు సంఘాలతో సహా మొత్తం 11 సంఘాలూ ముక్తకంఠంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఉద్యోగుల సమస్యలపై సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారికి సీఎం వివరించారు. రాష్ట్ర ఆదాయ - వ్యయాల లెక్కలను ఉద్యోగుల ముందుంచారు. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలతతో ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, ప్రభుత్వం వారికి ఎప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు. ‘‘ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పుడల్లా ఉద్యోగుల సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరిస్తాం. ఇప్పటికే పెండింగ్ బకాయిలు రూ.30,000 కోట్లు చెల్లించాం. మిగిలిన బకాయిలను కూడా వెసులుబాటు చూసుకుని చెల్లిస్తాం. ఈ విషయంలో ఉద్యోగులను అధైర్యపడొద్దని చెప్పండి’’ అని సంఘ నాయకులకు సీఎం తెలిపారు. 2014లో విభజన తర్వాత ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశామని గుర్తుచేశారు. ‘‘రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడిందే ఉద్యోగులు. వారిని గౌరవించాలన్న ఉద్దేశంతోనే 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం. ఉద్యోగులు వారి సమస్యల పరిష్కారానికి యూనియన్ల తరపున పనిచేస్తారు. కానీ, తాను రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచించాలి. ఇందులో ఉద్యోగులూ భాగమే’’నని సీఎం స్పష్టం చేశారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతి రాజు రవీంద్రరాజు జేఏసీ తరఫున సీఎంకు మెమెంటో ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.
రూ.30,000 కోట్లు చెల్లించాం: సీఎం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఉద్యోగులను సీఎం చంద్రబాబు కోరారు. ‘‘ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా గత రెండేళ్ల కాలంలో ఒకటో తేదీనే క్రమం తప్పకుండా జీతాలిస్తున్నాం. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తున్నాం. 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేశాం. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల్లో ఇప్పటి వరకు రూ.30,849 కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వడ్డీలకు అప్పులు తెచ్చింది. ఆర్థిక సంస్థలతో చర్చించి రూ.1.50 లక్షల కోట్ల మేర అప్పులపై భారీగా ఉన్న వడ్డీలను సంప్రదింపుల ద్వారా తగ్గించుకోగలిగాం. ప్రస్తుతం సరాసరి 9.1 శాతం వడ్డీని ప్రభుత్వం అప్పులపై చెల్లిస్తోంది. ఈ భారాన్ని ఇంకా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. విధ్వంసమైన వ్యవస్థలను నెమ్మదిగా గాడిన పెడుతున్నాం.’’ అని చంద్రబాబు తెలిపారు.
నా విజయాల ఆనవాళ్లు నీటి జాడల్లో కనిపించాలి: బాబు
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): సీఈవో సీఎంగా కంటే రైతులకు సాగు నీటిని అందించిన నాయకుడిగా గుర్తుండిపోవాలనేదే తన కోరిక అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ఓ ఆంగ్ల పత్రికలో... ‘సీఈవో సీఎం టు వాటర్ మాన్’ పేరుతో వచ్చిన కథనాన్ని తన పోస్టుకు ట్యాగ్ చేశారు. ‘పోలవరం ఎడమకాల్వ, వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించడం నా జీవితంలో మర్చిపోలేని మైలురాళ్లు. దశాబ్దాల కలగా ఉన్న ఈ రెండు కీలక సాగునీటి ప్రాజెక్టులు వాస్తవరూపం దాల్చడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. తాగునీటి భద్రతకు ఇవి చిరస్థాయిగా నిలిచిపోయే ఆస్తులుగా మిగులుతాయి. నా విజయాల ఆనవాళ్లు నీటి జాడల్లో కనిపించాలన్నది నా కోరిక’ అని సీఎం పేర్కొన్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు