రెండుగా జడ్పీ
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:04 AM
ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలోనే ఉన్న జిల్లా పరిషత్ రెండు కానున్నది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌ల స్థానంలో 28 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి పరిషత్ గడువు ఈనెల 24 వరకే ..
పశ్చిమ గోదావరి జిల్లాలో
భీమవరం కేంద్రంగా జిల్లా పరిషత్ ఏర్పాటు
అందులో 20 మండలాలు
సరిహద్దులతో మ్యాప్ ఏర్పాటు
చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు
పరోక్ష ఎన్నికలకు సిద్ధం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఇప్పటిదాకా ఏలూరు కేంద్రంగా ఉండేది. ప్రస్తుత పాలకవర్గ గడువు ఈ నెల 24తో ముగియనుంది. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఆధారంగా జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఏర్పాటుకు కసరత్తు చేయనున్నారు. ఇప్పటికే తాత్కాలిక భవనాల కోసం అన్వేషణ ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లా పరిషత్‌లో 20 మండలాలుంటాయి. కొత్త జిల్లాల ప్రాతిపాదికన పంచాయతీరాజ్ పాలన అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జడ్పీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి ప్రణాళికలు, విధాన నిర్ణయా లన్నీ ఇక కొత్త జిల్లా పరిషత్ ఆధారంగా తీసు కోనున్నారు. ముఖ్య కార్యనిర్వాహణ అధికారి, డిప్యూటీ కార్యనిర్వాహణ అధికారి, ఇతర సిబ్బం దిని నియమించనున్నారు.ఇప్పటిదాకా ఏలూరు కేంద్రంగా విధులు నిర్వహించారు. పాలకవర్గం గడువు ముగిసిన తర్వాత జిల్లాలో కార్యకలా పాలు నిర్వహించనున్నారు.
మండలాలు ఇవే
భీమవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌లో ఆచంట, ఆకివీడు, అత్తిలి, భీమవరం, యలమంచిలి, గణపవరం, ఇరగవరం, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకొల్లు, పాలకోడేరు, పెంటపాడు, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు, తాడేపల్లి గూడెం, తణుకు ఉండి, వీరవాసరం మండలా లున్నాయి. భీమా –ఉడాలో గణపవరం లేదు. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ పరిధిలో గణప వరం మండలాన్ని ఉంచారు. జిల్లా పరిధిలో ఉన్న మండల పరిషత్‌లన్నీ జిల్లా పరిషత్‌లో రాను న్నాయి. దాని ప్రకారం గణపవరంతో పాటు 20 మండలాలతో పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది.
పాలన సులభతరం
జిల్లాకు ప్రత్యేకంగా పరిషత్ ఏర్పాటు కావడం వల్ల పాలన సులభతరం కానుంది. జిల్లాకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు చేయను న్నారు. నియోజకవర్గాలకు అసరమైన రీతిలో జిల్లా పరిషత్ నిధులను కేటాయించనున్నారు. ఇప్పటిదాకా భీమవరం కేంద్రంగా కలెక్టరేట్ ఉన్నాసరే జిల్లా పరిషత్ మాత్రం ఏలూరు కేంద్రంగానే నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిఽధులంతా ఏలూరులో నిర్వహించే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేవారు. ఇకనుంచి భీమవరం కేంద్రంగా జిల్లా పరిషత్ ఏర్పాటు కావడం వల్ల పాలన అంతా ఇక్కడ నుంచే కొనసాగనుంది. ప్రస్తుతం ముఖ్య కార్యనిర్వాహఖ అధికారి, డిప్యూటీ కార్యనిర్వహఖ అధికారులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత సిబ్బంది కూడా రానున్నారు. తాత్కాలిక వసతుల కోసం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ భవన సముదాయాన్ని చూశారు. అక్కడ కాదంటే మరో భవనాన్ని చూడాల్సి ఉంటుంది.
పరోక్ష ఎన్నికలే
జిల్లా పరిషత్‌కు పరోక్ష ఎన్నికలే నిర్వహించ నున్నారు. ప్రతి మండల పరిషత్ పరిఽధిలోనూ ఒక జడ్పీటీసీని ఎన్నుకుంటారు. జిల్లాలో 20 మంది జడ్పీటీసీలు ఎన్నిక కానున్నారు. వారిలో ఒకరిని చైర్మన్‌గా జడ్పీటీసీలే ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ఎన్నికలైనా సరే పోటీలో ఉండేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు చేసుకున్నారు. కూటమి సర్దుబాటులో చైర్మన్ పదవి ఏ పార్టీకి కేటాయిస్తారరే విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీల్లోనూ జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల కోసం నాయకుల పేర్లు పార్టీ కేడర్‌లో నానుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఈసారి జనరల్ కేటగిరీకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌కు తొలి చైర్మన్ ఎవరనేది ఉత్కంఠ ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూటమి శ్రేణుల్లో సందడి కనిపిస్తోంది. జిల్లా పరిషత్‌పైనా కూటమిలో ముఖ్య నాయకులు గురిపెట్టారు.
ఏలూరు ఇక ప్రత్యేకం
(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి):
ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలోనే ఉన్న జిల్లా పరిషత్ రెండు కానున్నది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌ల స్థానంలో 28 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిలా పరిధిలో ఇప్పటివరకు 48 మండలాలు, 48 జడ్పీటీసీలు మూడు జిల్లాలు (ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి) పరిధిలో ఉన్నాయి. దీంతో ఏలూరు జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఏలూరు జిల్లా పరిషత్ కానున్నది. జిల్లా పరిషత్‌ల పునర్వ్యవసీ ్థకరణలో భాగంగా రాష్ట్రంలో అదనంగా 15 జడ్పీ సీఈవో, 15 డిప్యూటి సిఈవో పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రాంతీ యత ఆధారంగా ఉద్యోగుల విభజన కూడా జరగనుంది. ఈనెల 23 వరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ పాలక వర్గ పదవీకాలం ఉండటం, ఈనెల 24న వారి పదవీ కాలం ముగిసిన వెంటనే జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ అమలులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న మండలాలకు ఆనుగుణంగా 27 జడ్పీటీసీలు, 504 వరకు ఎంపీటీసీలు ఉండే అవకాశాలున్నాయి. ఏలూరు జిల్లాలో పాత పశ్చిమ గోదావరి జిల్లాలోని 19 మండలాలతో పాటు కృష్ణాజిల్లా నూజివీడు, కైకలూరు నియో జకవర్గాల్లోని 8 మండలాలు ఉండటంతో ఆయా ప్రాతిపదికన ఎంపీటీసీలు ,జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరస్తు ప్రారంభం కావడంతో జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా ముందస్తు సన్నాహాలు ప్రారంభం అయినాయి.