ఆల్మండ్స్‌తో అదిరిపోయే రుచులు!
ABN , Publish Date - Sep 06 , 2026 | 08:40 AM
‘బ్రేక్‌ఫాస్ట్ వద్దు... ఆల్మండ్ స్మూతీ తాగేస్తా’... ‘డిన్నర్‌లో ఆల్మండ్ బార్ మాత్రమే తింటా’... ఇలా ఉంది ఈకాలం పిల్లల ధోరణి.
‘బ్రేక్‌ఫాస్ట్ వద్దు... ఆల్మండ్ స్మూతీ తాగేస్తా’... ‘డిన్నర్‌లో ఆల్మండ్ బార్ మాత్రమే తింటా’... ఇలా ఉంది ఈకాలం పిల్లల ధోరణి. ఆల్మండ్స్... సూపర్ ఫుడ్ అన్నది కాదనలేని సత్యం. అయితే నేడు బాదంపప్పు వాడకం బాగా పెరిగింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా పది వేల రకాల కొత్త ఉత్పత్తుల్లో దీన్ని చేర్చారట. దీనికి కారణం జెన్‌జీ రుచులకు తగినట్టు ఆహార ఉత్పత్తులు సరికొత్తగా వస్తున్నాయని వేరే చెప్పక్కర్లేదు.
ఉదయం టిఫిన్... మధ్యాహ్నం భోజనం... రాత్రి డిన్నర్... మన భారతీయ ఆహార సమయాలివి. అయితే జెన్‌జీ, మిలీనియల్స్ ఇలాంటి నియమాలన్నింటినీ మార్చేస్తున్నారు. సమయానికి ఏదో ఒకటి తినడం కాదు... పోషకాహారం మాత్రమే తినడానికి ఇష్టపడుతున్నారు. పైగా పర్యావరణ స్పృహ ఎక్కువ. అందుకే మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. అంతేకాదు... భోజన విరామాల్లో... ఒక్కోసారి భోజనానికి బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకుంటున్నారు. అందుకే ఇది ‘స్నాకింగ్ జనరేషన్’ అంటున్నారు. ఇప్పుడు ఆహారంలో ఆల్మండ్ ఎనర్జీ బార్స్ ఓ భాగం. ఆల్మండ్స్‌తో స్వీట్లు, కుకీస్, స్మూతీలు, జ్యూస్‌లు... ఇలా అనేకం అందుబాటులో ఉన్నాయి. ఈమధ్య ఈ ధోరణి మరీ పెరిగింది.
అన్నింట్లోనూ మిక్స్...
2026కి సంబంధించిన ఫుడ్ ట్రెండ్స్‌లో ప్రొటీన్, గట్ హెల్త్, ఇండల్జెన్స్, బేవరేజెస్, ప్లాంట్ బేస్డ్, మైండ్‌ను బ్యాలెన్స్ చేసే ఆహార పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆరు రకాల ఆహారాల్లోనూ ఆల్మండ్స్ ఉండడం విశేషం.
జెన్ జీలు ఎక్కువగా ఆల్మండ్స్, పీనట్స్, వాల్‌నట్స్, హజెల్‌నట్స్, పిస్తా, జీడిపప్పును తీసుకుంటున్నారట. భోజనాల మధ్య స్నాక్స్‌గా ఇవి బాగా పాపులర్ అవుతున్నాయి. ఏ ఆహారానికైనా ప్రధానంగా కావలసింది రుచి. ఆల్మండ్స్ వల్ల రుచితోపాటు, ఆరోగ్యం కూడా దక్కుతుంది. పైగా వీటిలో తక్కువ చక్కెర, ఎక్కువ ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. నలభై శాతం మంది జెన్ జీలు ఓ పూట భోజనానికి బదులుగా స్నాక్స్‌తో లాగించేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.
రాత్రి నీటిలో నానబెట్టిన 6-8 బాదం పలుకులతో ఉదయాన్ని ప్రారంభించడం మన ఇళ్లల్లో మామూలే. కొంతమంది టిఫిన్‌లో భాగంగా ఆల్మండ్స్‌ను తీసుకుంటారు. అయితే స్నాక్‌గా తీసుకోవడం కొత్త ఒరవడి. అందులో కూడా ఆల్మండ్స్‌కు సంబంధించినవే ఎక్కువగా ఉండడం విశేషం.
అన్నీ ఆల్మండ్స్‌తోనే...
నేడు మార్కెట్‌లో ఆల్మండ్స్‌కి సంబంధించి సరికొత్తగా వస్తోన్న కొన్ని ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం.
చిక్కని పాలు
‘డెయిరీ ఫ్రీ’ లైఫ్ స్టయిల్‌లో చక్కటి ప్రత్యామ్నాయంగా బాదం పాలు మార్కెట్లోకి వచ్చేశాయి. బాదం పప్పును నీళ్లల్లో నానబెట్టి, పొట్టు తీసేసి బ్లెండ్ చేస్తే చిక్కని పాలు తయారవుతాయి. ఈ సులభపద్ధతి వల్ల గేదె పాలతో చేసే ఆహార పదార్థాలకు బదులుగా బాదం పాలను వినియోగించడం ఇటీవల ఎక్కువయ్యింది. దీనివల్ల ఆయా పదార్థాల రుచి పెరిగింది. పైగా మరిన్ని పోషకాలు వచ్చి చేరాయి. ఉదయం సెరెల్స్‌లో, బ్రౌనీల్లో, పోరిడ్జ్‌లలో ఈ పాలే ఉంటున్నాయి. దీంతో నట్టీ ఫ్లేవర్ జతై, ఆహార పదార్థాలు మరింత యమ్మీగా మారుతున్నాయి.
రుచికరమైన జున్ను
బాదంపప్పుతో చేసే జున్ను అచ్చం పాలతో చేసిన దానిలాగానే ఉంటుంది. నిలువ ఉండే కొద్దీ ఈ జున్ను తీరు కూడా అచ్చం పాలలాగే మారుతుంది. లాక్టోజ్ పడనివాళ్లు... వేగాన్‌లకు, డైయిరీ ఫ్రీ ఆహార పద్ధతుల్లో ఉన్న వాళ్లకి ఇది మంచి ఛాయిస్. వేగాన్ మోజరెల్లా ఛీజ్‌లో కూడా ఆల్మండ్ పాలే ఉండడం విశేషం.
సాస్, స్ప్రెడ్‌లలో కూడా...
ఇటీవల ఆసియా వంటకాల్లో ఆల్మండ్ సాస్‌లు, స్ర్పెడ్‌ల వాడకం మొదలైంది. బ్రెడ్ టోస్ట్‌లకు ఆల్మండ్ బటర్ పూయడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. రోజూ కొద్దిగా బాదం పప్పు తీసుకున్నా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు. అయితే బాదం పాలు, జున్ను తయారుచేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే నానబెట్టిన బాదం పలుకులను కలిపి వివిధ రకాల స్మూతీలను తయారుచేస్తున్నారు. పలుకుల్ని పలుచగా కోసి స్మూతీలు, జ్యూసుల పైన వేసి అలంకరిస్తున్నారు. ఇంకా బెర్రీలు, యోగర్ట్ తదితర స్మూతీలలో ఆల్మండ్ ప్రొటీన్ పోడర్‌ను కలిపి, హెల్తీడ్రిండ్‌లను తయారుచేసుకోవచ్చు.
బార్స్, స్నాక్స్...
ఆరోగ్యానికి సంబంధించిన స్పృహ పెరగడం వల్ల కూడా అంతటా ఆల్మండ్స్ వాడకం పెరిగింది. ఈ ఉరుకుల పరుగుల జీవనంలో ఏ సమయానికి ఎక్కడ ఉంటామో తెలియని పరిస్థితి. అందుకే బ్యాక్‌ప్యాక్‌లో సేఫ్‌సైడ్‌గా ఆల్మండ్ బార్లను పెట్టుకుంటున్నారు. అలాగే మెట్రోల్లో, బస్సుల్లో ఇంటికీ కాలేజీకి, ఆఫీసుకు వెళ్లివచ్చే సందర్భాల్లో తినేందుకు కూడా వీటినే ఆశ్రయిస్తున్నారు. వీటిని సులభంగా క్యారీ చేయొచ్చు. బిస్కట్లూ, చాక్లెట్ల స్థానంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆల్మండ్స్‌తో చేసిన స్నాక్స్ వచ్చి, రుచులకు కొత్తదనాన్ని అందిస్తున్నాయి. అటు ఆరోగ్యం ఇటు చక్కటి రుచి... అందుకే ఆల్మండ్స్ అందరికీ ఫేవరెట్ అయ్యాయి.
రోజుకు ఏడు....
బాదం పప్పులో ఏం ఉంది అనేకన్నా, ఏం లేదు అనే చర్చ ఈమధ్య బాగా పెరిగింది. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, హెల్దీ ఫ్యాట్స్, ఫోటోకెమికల్స్... ఇలా ఎన్నో పోషకాలు బాదం పప్పుల సొంతం. చాలా దేశాల్లో రోజుకి ఏడు ఆల్మండ్స్ అనే అప్రకటిత నియమాన్ని ఫాలో అవుతుంటారు. రోజూ ఏడు బాదం పలుకులు తినడం వల్ల క్యాలరీలను పెంచకుండానే పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లను పొందవచ్చని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మెదడును చురుకుగా ఉంచుతుంది. షుగర్, బీపీని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అందుకే బరువు తగ్గేందుకు దోహదపడతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇలా బాదం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అయినప్పటికీ మితంగా తీసుకోవడం మంచిది అన్నది మర్చిపోకూడదు.
ఇన్‌స్టా కథల్లో...
ఒక్కో తరానికి ఒక్కో రకమైన నియమాలు, పద్ధతులు ఉండడం సర్వసాధారణమే. 90ల్లో కండరాల పుష్టి, బేసిక్ ప్రొటీన్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేవాళ్లు, నేటితరం చర్మ, కేశ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. చర్మానికి విటమిన్ ఇ ఎంతో మేలు చేస్తుంది. అందుకే విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆల్మండ్స్ ఈ తరానికి దగ్గరయ్యాయి. జెన్ జీలకి ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. తమ ఇన్‌స్టా కథల్లోకి ఎక్కగలిగేలా ఉండాలి. అందుకే ఆల్మండ్స్ ఆల్‌టైమ్ హిట్ అంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
రేవంత్‌కు రెండో చాన్స్ ఉందా...
ఉద్యోగులపై వరాలు.. 2 డీఏలు, సరెండర్ లీవ్‌లకు సర్కారు ఓకే
Read Latest AP News And Telangana News And International News And Telugu News