బంగారం షాపులో యువతి చోరీ.. నగల బాక్స్‌తో పరుగో పరుగు..
ABN , Publish Date - Sep 06 , 2026 | 07:37 AM
ఓ యువతి బంగారం షాపులో దొంగతనం చేసింది. 20 లక్షల రూపాయలు విలువ చేసే ఉంగరాల బాక్స్‌తో పారిపోవడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం విఫలమై షాపు యజమానికి దొరికిపోయింది. ఈ సంఘటన రాజస్థాన్‌లో గురువారం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ యువతి బంగారం షాపులో దొంగతనం చేసింది. 20 లక్షల రూపాయలు విలువ చేసే ఉంగరాల బాక్స్‌తో పారిపోవడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం విఫలమై షాపు యజమానికి దొరికిపోయింది. ఈ సంఘటన రాజస్థాన్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం ఉదయం 11: 30 గంటల ప్రాంతంలో ఓ యువతి జైపూర్, లక్ష్మీ నగర్‌లోని భవానీ జ్యువెలర్స్ షాపులోకి వచ్చింది. తనకు ఉంగరాలు చూపించమని షాపు యజమాని త్రిలోక్ చంద్ ప్రజాపత్‌ను అడిగింది. అతడు 25 ఖరీదైన ఉంగరాలు ఉన్న బాక్స్‌ను ఆమె ముందు పెట్టాడు. ఆమె ఓ రెండు ఉంగరాలను సెలెక్ట్ చేసుకుంది.
వాటి ధర ఎంతని అడిగింది. త్రిలోక్ చంద్ వాటి ధర చెప్పాడు. అప్పుడు ఆ యువతి ‘మా నాన్నకు ఫోన్ చేశాను. ఆయన ఆన్‌లైన్ పేమెంట్ చేస్తాడు’ అని చెప్పింది. నగల బాక్స్‌లోని ఉంగరాలను చూస్తూ ఉండిపోయింది. త్రిలోక్ చంద్ తన దృష్టిని వేరే కస్టమర్ వైపు మళ్లించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ యువతి నగల బాక్స్‌తో అక్కడినుంచి పరుగులు పెట్టింది. త్రిలోక్‌తో పాటు షాపులో పని చేసే మరో వ్యక్తి ఆమెను వెంబడించారు. 500 మీటర్ల తర్వాత ఆ యువతి దొరికిపోయింది. త్రిలోక్ నగల బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నాడు.
త్రిలోక్‌కు దొరికిపోయిన తర్వాత ఆ యువతి ‘నేను జైలుకు వెళ్లాలనే ఇలా దొంగతనం చేశాను’ అని చెప్పింది. త్రిలోక్ ఆమెను జోత్‌వారా పోలీసులకు అప్పగించాడు. త్రిలోక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ‘ఆమె బ్యాగులో కారం పొడి, పెప్పర్ స్ప్రే ఉన్నాయి. ఆమె నగల బాక్స్‌తో పారిపోవడానికి కంటే ముందు ఓ ఫోన్ కాల్ వచ్చింది’ అని పేర్కొన్నాడు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం