రేవంత్‌కు రెండో చాన్స్ ఉందా...
ABN , Publish Date - Sep 06 , 2026 | 03:25 AM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వ్యవహారం టీ కప్పులో తుపానుగా చల్లబడిపోతుందా? లేక మునుముందు కొత్త సవాళ్లకు దారి తీస్తుందా? ఇది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. సురేఖ ఎపిసోడ్‌లో...
ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్టుగా రేవంత్‌రెడ్డి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏర్పడుతున్న వ్యతిరేకతను పోగొట్టడానికి ఆయనకు నికరంగా ఏడాది మాత్రమే సమయం మిగిలి ఉంది. చివరి సంవత్సరంలో ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజాభిప్రాయం మారదు.
తాను బలపడుతూ, పార్టీ కూడా బలపడేలా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌పైన పడింది. కొండా సురేఖ ఎపిసోడ్‌లో పార్టీ అధిష్ఠానం అండగా నిలబడటం రేవంత్‌కు ఒకింత ఊరట కలిగించే అంశమే.
తెలుగునాట రెండో పర్యాయం అధికారంలోకి రావడం అంత ఆషామాషీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ మాత్రమే రెండో పర్యాయం అధికారంలోకి రాగలిగారు.
పార్టీ ఏదైనా మొత్తం యంత్రాంగం ఒక్కటిగా నిలబడి ముఖ్యమంత్రిని మోసిన సందర్భాలలోనే చంద్రబాబు అయినా, రాజశేఖర రెడ్డి అయినా, కేసీఆర్ అయినా రెండోమారు అధికారంలోకి రాగలిగారు. మొత్తం పార్టీ యంత్రాంగం ముఖ్యమంత్రులను సొంతం చేసుకోని సందర్భాలలో ఇదే నాయకులు ఓడిపోయారు.
ముఖ్యమంత్రి రేవంత్ మళ్లీ అధికారంలోకి రావాలంటే ముందుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆయనను సొంతం చేసుకోవాలి. కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ రేవంత్ నాయకత్వానికి జై కొట్టాలి. అలా అందరూ తన నాయకత్వాన్ని ఆమోదించేలా చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌పైన కూడా ఉంటుంది. కాంగ్రెస్ అధిష్ఠానం అండదండలు కూడా ఉన్నందున తనను తాను బలమైన నాయకుడిగా తీర్చి దిద్దుకోవడానికి రేవంత్‌కు ఇదొక సదవకాశం.
కాంగ్రెస్‌లో గ్రూపులు ఉండటం చూసి ఆశ్చర్యపోకూడదు. లేకపోతే ఆశ్చర్యపోవాలి. ఎన్నికల్లో గెలవడానికి సామాజిక సమీకరణలు మాత్రమే సరిపోవు. మొత్తంగా ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడాలి. అదే సమయంలో సీఎం ఎవరైనా వారి నాయకత్వం పట్ల ప్రజల్లో కూడా విశ్వాసం ఏర్పడాలి.
రేవంత్ కూడా సీఎంగా ఐదేళ్లపాటు కొనసాగి పూర్తి కాలం పదవిలో ఉంటారని అనడంలో ప్రస్తుతానికి సందేహం లేదు. కాంగ్రె్‌సలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండటమే ఒక రికార్డు. అలాంటిది రెండో పర్యాయం పార్టీని గెలిపించుకొని అధికారంలో కొనసాగడం గొప్ప విషయమే అవుతుంది.
పార్టీలోని అన్ని గ్రూపులను తన వైపునకు మళ్లించుకొని అందరూ రేవంత్ గ్రూపు మాత్రమే అని రుజువు చేసుకోగలిగినప్పుడే ఆయన శక్తి సామర్థ్యాలు వెల్లడవుతాయి. రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే దాడుల నుంచి తప్పించుకొని బలంగా నిలబడే వారే నిజమైన నాయకుడిగా ఆవిష్కృతుడవుతారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వ్యవహారం టీ కప్పులో తుపానుగా చల్లబడిపోతుందా? లేక మునుముందు కొత్త సవాళ్లకు దారి తీస్తుందా? ఇది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. సురేఖ ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ వద్ద తన మాట నెగ్గించుకుని... ఆమెను బర్తరఫ్ చేసి పార్టీలో– ప్రభుత్వంలో తన పట్టు పెంచుకున్నట్టు కనిపిస్తున్నారు. కానీ, సవాళ్లు మాత్రం తొలగిపోలేదు. తెలంగాణ కాంగ్రెస్ పైకి ఒక్కటిగా కనిపిస్తున్నా అంతర్గతంగా మూడు గ్రూపులుగా ఉంది. ఇప్పటి వరకు అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అని రెండు గ్రూపులు ఉండగా... ఇప్పుడు రాజశేఖరరెడ్డి వర్గం కూడా తెర మీదకు వచ్చింది. పార్టీలో ప్రత్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పచ్చ కాంగ్రెస్ ప్రతినిధిగా అభివర్ణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారిని పచ్చ కాంగ్రెస్ వాళ్లు అని అంటున్నారు. అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత అచ్చ కాంగ్రెస్ నాయకులుగానీ, రాజశేఖరరెడ్డి వర్గంగానీ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. చివరకు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి చేతికి పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ వాస్తవాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎన్ని ఫిర్యాదులు అందినా ఆయా సందర్భాలలో అండగా నిలిచింది. తాజాగా సురేఖ ఉదంతంలో కూడా ముఖ్యమంత్రి అభిప్రాయానికి విలువ ఇచ్చి ఆమెను బర్తరఫ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే... పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకునే ముందు దాన్ని అడ్డుకొనే ప్రయత్నాలు జరగకపోలేదు. ఇద్దరు ముగ్గురు మంత్రులు బర్తరఫ్ నిర్ణయాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ కారణంగానే నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. కొండా సురేఖను బర్తరఫ్ చేయనిస్తే రేవంత్‌రెడ్డి బలపడతారన్న ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు జరిగినట్టు చెబుతున్నారు. అయితే, రేవంత్‌రెడ్డిని కాదనుకునే పరిస్థితి లేకపోవడం, జరిగిన దానిపట్ల విచారం వ్యక్తం చేయడానికి కూడా సురేఖ సిద్ధపడకపోవడంతో పార్టీ అధిష్ఠానం బర్తరఫ్ నిర్ణయం వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది.
ఏమిటి కారణం...
ఈ మొత్తం వ్యవహారంలో కొండా సురేఖది స్వయం కృతాపరాధమా? లేక వ్యూహాత్మకమా? అన్నది ఇప్పుడే చెప్పలేం. గతంలో కూడా ఆమె దుందుడుకు నిర్ణయాలు తీసుకున్న చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆమె రాజశేఖరరెడ్డి అనుచరురాలిగా ఉండేవారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అయితే, పార్టీ అధిష్ఠానం మాత్రం కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీంతో కినుక వహించిన సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తెలంగాణ వాదులు జగన్మోహన్‌రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా తెలంగాణలో ఆయన తన దుకాణం మూసుకోవలసి వచ్చింది. దీంతో సురేఖ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ కూడా ఇమడలేక ఆమె మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మూడు గ్రూపులలో ఒకటైన రాజశేఖరరెడ్డి వర్గం విషయానికి వద్దాం! రాజశేఖరరెడ్డిని విపరీతంగా అభిమానించిన వర్గం తమ ప్రాంతానికి చెందిన రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మాత్రం అంగీకరించలేకపోతోంది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వర్గంలో ఉన్నవారందరికీ ఏవో మేళ్లు చేశారని చెబుతున్నారు. ఈ కారణంగానే వారందరూ వైఎస్‌ఆర్‌ను అభిమానిస్తూ వచ్చారు. ఆర్థిక ప్రయోజనాలు కలిగించే మేళ్లు చేయడంతో పాటు రాజశేఖరరెడ్డి ఆప్యాయత ప్రదర్శించేవారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి విషయంలో ఆప్యాయతతోపాటు ఆర్థిక ప్రయోజనం కలిగించే మేళ్లు కరువయ్యాయని చెబుతున్నారు. ఈ కారణంగానే తెలంగాణలో రాజశేఖరరెడ్డి రాజ్యం తెస్తామన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం! గత వారం నేను చెప్పినట్టుగా తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులు బలంగా ఎదగకుండా రాజశేఖరరెడ్డి అడ్డుకున్నారు. ఈ కారణంగానే 2014 ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందో లేదో తెలియకపోయినా అనేక మంది ముఖ్యమంత్రి అభ్యర్థులుగా తెరమీదకు వచ్చారు. ఫలితంగా ఎన్నికల్లో పార్టీకి సారథ్యం వహించగల నాయకులు కరువయ్యారు. చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినా కాంగ్రెస్ మాత్రం అధికారానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది. గాలి వాటంగా పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కావాలనుకున్నారే కానీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎవరూ బాధ్యత తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే రాహుల్‌గాంధీ పార్టీ పగ్గాలను రేవంత్‌రెడ్డికి అప్పగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో పచ్చ కాంగ్రెస్ అని ప్రత్యర్థులు పిలుచుకొనే మూడో వర్గం అవతరించింది. ఈ వర్గంలోని వారందరూ అప్పటి వరకూ ఏక నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో ఉండి వచ్చినవారే. చంద్రబాబు నాయకత్వంలో ఆయన సలహాలు సూచనల మేరకు పనిచేసినవారు కనుక కాంగ్రెస్ సంస్కృతిని ఒంటబట్టించుకోలేకపోయారు. ఇప్పటికీ కాంగ్రెస్‌లోని ఈ వర్గానిది అదే పరిస్థితి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయమే తీసుకుందాం. ఇప్పుడు ఉన్న మంత్రులందరికంటే ఆయనే సీనియర్. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మంత్రివర్గాలలో ఆయన పనిచేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆయనను జూనియర్‌గానే చూస్తారు. తుమ్మలకు కూడా కాంగ్రెస్ అధిష్ఠానం అంటే ఏమిటో, వారితో ఎలా మెలగాలో తెలియదు. రేవంత్‌రెడ్డి కారణంగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్కది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. కాంగ్రెస్ సంస్కృతి ఒంటబట్టకపోవడం వల్ల ఈ వర్గం ఒకింత అసౌకర్యానికి గురవుతోంది. ఇప్పుడు ఈ మూడు వర్గాలనూ సమన్వయం చేసుకుంటూ తాను బలపడుతూ, పార్టీ కూడా బలపడేలా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైన పడింది.
రెండోసారి ఈజీ కాదు...
సురేఖ ఎపిసోడ్‌లో పార్టీ అధిష్ఠానం అండగా నిలబడటం రేవంత్‌రెడ్డికి ఒకింత ఊరట కలిగించే అంశమే. అయినప్పటికీ ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్టుగా ఆయన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏర్పడుతున్న వ్యతిరేకతను పోగొట్టడానికి ఆయనకు నికరంగా ఏడాది మాత్రమే సమయం మిగిలి ఉంది. చివరి సంవత్సరంలో ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజాభిప్రాయం మారదు. తెలుగునాట రెండో పర్యాయం అధికారంలోకి రావడం అంత ఆషామాషీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ మాత్రమే రెండో పర్యాయం అధికారంలోకి రాగలిగారు. ఈ ముగ్గురూ ఏ పరిస్థితుల్లో రెండోసారి అధికారంలోకి రాగలిగారో ఇప్పుడు చూద్దాం. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు 1999 ఎన్నికల్లో కూడా విజయం సాధించి అధికారంలోకి వచ్చి తొలుత రికార్డు సృష్టించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సైతం రెండో పర్యాయం అధికారంలోకి రాలేకపోయారు. 1984లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్ 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇందుకు భిన్నంగా చంద్రబాబు రెండోసారీ ఎలా గెలవగలిగారంటే, అందుకు అనేక కారణాలు ఉన్నాయి. 1995–99 మధ్య కాలంలో చంద్రబాబుకు బలమైన ఎకో సిస్టం ఉండేది. పార్టీలో అసమ్మతికి తావు లేకుండా ఆయన అనేక జాగ్రత్తలు తీసుకొనేవారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ఆయనను నెత్తిన పెట్టుకున్నారు. ‘మా చంద్రబాబు అంతటివారు ఇంతటివారు’ అని శ్లాఘించేవారు. చంద్రబాబు కూడా అనేక వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. ఆయన తల్లి ఏమి పెట్టి పెంచారోకానీ చంద్రబాబుకు అన్ని తెలివితేటలు వచ్చాయని అప్పట్లో అనేక మంది వ్యాఖ్యానించేవారు. నాయకుడిని పెంచితే పార్టీకే లాభమని అప్పుడే రుజువైంది. చంద్రబాబు గురించి గొప్పగా ప్రచారం చేయడం వల్ల 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రాగలిగింది. 1999–2004 మధ్య కాలంలో చంద్రబాబు వైఖరిలో మార్పు రావడంతో పార్టీ శ్రేణులు కూడా ఆయనకు దూరమయ్యాయి. ఫలితంగా 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖరరెడ్డిని కాంగ్రెస్ నాయకులు తమ సహజ లక్షణానికి దూరం జరిగి నెత్తిన పెట్టుకున్నారు. ప్రారంభంలో వ్యతిరేకించడానికి కొంతమంది ప్రయత్నించినా... అటు అధిష్ఠానాన్ని, ఇటు పార్టీ శ్రేణులను ఆకర్షించడంలో రాజశేఖరరెడ్డి సక్సెస్ అయ్యారు. అదే సమయంలో ఫీజుల చెల్లింపు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆకట్టుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, కాంగ్రెస్ నాయకులు అందరూ ముక్తకంఠంతో ఆయన నాయకత్వాన్ని పొగిడేవారు. ఆయన గుణగణాలను పొగుడుతూ ఊరూ వాడా ప్రచారం చేశారు. ఈ కారణంగానే 2009 ఎన్నికల్లో ఆయన మళ్లీ అధికారంలోకి రాగలిగారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఉండకపోయినా, తెలంగాణ రాష్ట్ర సమితితో టీడీపీ పొత్తు పెట్టుకొని ఉండకపోయినా 2009 ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి ఓడిపోయి ఉండేవారన్న అభిప్రాయం ఇప్పటికీ ఉంది. దీన్నిబట్టి తెలుగునాట రెండోసారి అధికారంలోకి రావాలంటే ప్రజలను ఎంతగానో మెప్పించాలన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇక కేసీఆర్ విషయానికి వద్దాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ ప్రభుత్వంలో క్రమశిక్షణను తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అవినీతిని, ముఖ్యంగా రాజకీయ అవినీతిని పూర్తిగా అరికట్టలేకపోయినా... కట్టడి మాత్రం చేయగలిగారు. కేసీఆర్ అంటే చండశాసనుడు అన్న అభిప్రాయం కలిగించారు. అదే సమయంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలను అమలు చేశారు. చంద్రబాబు, రాజశేఖరరెడ్డి వలె అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణుల నోట కేసీఆర్ అన్న మాట మాత్రమే వినిపించేది. కార్యకర్తల నుంచి నాయకుల వరకూ అందరూ ఆయన నాయకత్వాన్ని పెంచే పనిచేశారు. అంత చేసినా లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలకూ కలిసి వెళితే గెలుస్తామన్న నమ్మకం కొరవడటంతో శాసనసభ ఎన్నికలు ఆరు నెలలు ముందుగా జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఒప్పించి ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అయితే, ఈ ఒక్క కారణంగా మాత్రమే ఆయన రెండోసారి అధికారంలోకి రాలేదు. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీచేశారు. ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును బూచిగా చూపించి, తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిలించి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత చంద్రబాబువలె కేసీఆర్ కూడా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చాక పార్టీ శ్రేణులకు దూరమయ్యారు. ఫలితంగానే ఈ ఇరువురు నాయకులు మూడోసారి అధికారంలోకి రాలేకపోయారు. మొత్తం మీద తెలుగునాట రెండవ పర్యాయం అధికారంలోకి రావడం ఆషామాషీ కాదని రుజువైంది. పార్టీ ఏదైనా మొత్తం యంత్రాంగం ఒక్కటిగా నిలబడి ముఖ్యమంత్రిని మోసిన సందర్భాలలోనే చంద్రబాబు అయినా, రాజశేఖరరెడ్డి అయినా, కేసీఆర్ అయినా రెండోమారు అధికారంలోకి రాగలిగారు. మొత్తం పార్టీ యంత్రాంగం ముఖ్యమంత్రులను సొంతం చేసుకోని సందర్భాలలో ఇదే నాయకులు ఓడిపోయారు. దశాబ్దం విరామం తర్వాత, అది కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఐదేళ్లకే 2019లో ఓడిపోయారు. పాత వాసనలను వదులుకోలేకపోవడంవల్ల అప్పుడు ఆయన పార్టీ శ్రేణులకు దూరమయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి కూడా రెండోసారి ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాలను కూడా చూడాలి.

గ్రూపులన్నీ ఒక్కటైతేనే...
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలంటే ముందుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆయనను సొంతం చేసుకోవాలి. కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ రేవంత్ నాయకత్వానికి జై కొట్టాలి. అలా అందరూ తన నాయకత్వాన్ని ఆమోదించేలా చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైన కూడా ఉంటుంది. కాంగ్రెస్ అధిష్ఠానం అండదండలు కూడా ఉన్నందున తనను తాను బలమైన నాయకుడిగా తీర్చిదిద్దుకోవడానికి రేవంత్‌రెడ్డికి ఇదొక సదవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా లేదా అన్నదాన్నిబట్టి రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఒక బీసీ మంత్రిని తొలగించినందున మరో బీసీ మంత్రిని తీసుకుంటే లెక్కలు సరిపోవు. రాజకీయాలలో రెండు రెళ్లు నాలుగు కాదని చెబుతారు. అలా అనుకుంటే 2014 ఎన్నికల్లో తెలంగాణలో బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయినా ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఎన్నికల్లో గెలవడానికి సామాజిక సమీకరణలు మాత్రమే సరిపోవు. మొత్తంగా ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడాలి. అదే సమయంలో ముఖ్యమంత్రి ఎవరైనా వారి నాయకత్వం పట్ల ప్రజల్లో కూడా విశ్వాసం ఏర్పడాలి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల దేశ ప్రజల్లో విశ్వాసం ఉన్నందునే భారతీయ జనతా పార్టీ మూడవ పర్యాయం కూడా కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉండటం చూసి ఆశ్చర్యపోకూడదు. గ్రూపులు లేకపోతే ఆశ్చర్యపోవాలి. రాజశేఖరరెడ్డి ఒక్కరే కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ తరహాలో నడిపారు. అంతకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారెవరూ పార్టీపై అంత పట్టు సాధించలేకపోయారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వంటి బలమైన నాయకుడికి కూడా గ్రూపుల బెడద ఉండేది. ఆయన నాయకత్వంలో 1978, 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా గ్రూపుల కారణంగానే అర్ధంతరంగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తప్పుకోవలసి వచ్చింది. తెలుగునాట ఇప్పటి వరకు రాజశేఖరరెడ్డి ఒక్కరే ఇందుకు మినహాయింపు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు కొనసాగి పూర్తి కాలం పదవిలో ఉంటారని అనడంలో ప్రస్తుతానికి సందేహం లేదు. కాంగ్రెస్‌లో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండటమే ఒక రికార్డు. అలాంటిది రెండో పర్యాయం పార్టీని గెలిపించుకొని అధికారంలో కొనసాగడం గొప్ప విషయమే అవుతుంది. ఇప్పటి వరకు రాజశేఖరరెడ్డికి మాత్రమే సొంతమైన ఈ రికార్డును రేవంత్‌రెడ్డి అధిగమిస్తారా? లేదా? అన్నది కాలమే నిర్ణయించాలి. కొండా సురేఖ విషయంలో రేవంత్‌రెడ్డి పైచేయి సాధించి ఉండవచ్చునుగానీ పార్టీలోని అన్ని గ్రూపులను తన వైపునకు మళ్లించుకొని అందరూ రేవంత్ గ్రూపు మాత్రమే అని రుజువు చేసుకోగలిగినప్పుడే ఆయన శక్తి సామర్థ్యాలు వెల్లడవుతాయి. రాజకీయాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు.
వేగంగా మారిపోవడానికి ఒక్క సంఘటన చాలు. కొండా సురేఖ వంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఇంకెంత మంది ఉన్నారో తెలియదు. ముఖ్యమంత్రి రేవంత్‌పై తిరుగుబాటు చేయడానికి ఏయే శక్తులు ఏయే రూపాలలో కాచుకొని ఉన్నాయో తెలియదు. రాజకీయాలలో ఇదొక సహజ పరిణామం. ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే దాడుల నుంచి తప్పించుకొని బలంగా నిలబడేవారే నిజమైన నాయకుడిగా ఆవిష్కృతుడవుతారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం!
ఆర్కే
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News