Share News

గంగబాయిలమ్మ ఆకుకూర

ABN , Publish Date - Sep 06 , 2026 | 10:51 AM

తెలుగులో ‘గంగ’ అనే మాటనే పెద్దది, శ్రేష్ఠమైనది, స్వచ్ఛమైనది ఇలా చెప్పటానికి వాడుతుంటాం. గంగాళం నుంచి గంగిరెద్దు దాకా చాలా వాటికి ఈ గంగ విశేషణం ఉంది.

గంగబాయిలమ్మ ఆకుకూర
Vantalu

తెలుగులో ‘గంగ’ అనే మాటనే పెద్దది, శ్రేష్ఠమైనది, స్వచ్ఛమైనది ఇలా చెప్పటానికి వాడుతుంటాం. గంగాళం నుంచి గంగిరెద్దు దాకా చాలా వాటికి ఈ గంగ విశేషణం ఉంది. పావిలి రోడ్డు పక్కన పెరిగే చిన్న మొక్క. ఇందులో చిన్న ఆకులున్న చిన్నపావిలికన్నా పెద్ద ఆకులున్న పెద్దపావిలి శ్రేష్ఠమైనది కాబట్టి, దాన్ని ‘గంగపావిలి’ అన్నారు. అది జనం నోళ్లలో పడి గంగపాయలకూర - గంగబాయిల కూరగా మారింది! గోళికూర అని కూడా అంటారు, ఇందులో సన్నపాయల, ఫుల్లపాయల, పెద్దపావిలీ, బొడ్డుపాయిల అని 4 రకాలున్నాయి.


ఆకుకూరలన్నీ ఆహార ఔషధాలే! వాటిలో పావిలి గొప్పది. ఎర్రని కాడలతో ఎర్రగలిజేరు లాగా నేలమీద పాకుతూ పసువుపచ్చని పూలతో సులభంగా పెరుగుతుంది. ఆసియా ఖండంలో పుట్టిన పర్స్‌లేన్‌ అనే ఈ పావిలిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘గ్లోబల్‌ పానేషియన్‌ మొక్క’ అని ప్రకటించింది. ఈ ఆకుల్లో ఆరోగ్య దాయకమైన కొవ్వుపదార్థాలు (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌) ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం. అవి గుండెకు, మెదడుకు, జాయింట్లకు మేలు చేస్తాయి. చర్మాన్ని మృదువు పరుస్తాయి. రక్తంలో చెడ్డ కొవ్వుని తగ్గించే స్టాటిన్స్‌ అనే ఔషధాల పని తీరుతో ఇది సమానం అని చెప్తారు.


బాగా లేతవిగా ఉన్న పావిలాకుల్నే వండుకోవటానికి ఎంచుకోవాలి. నేలపైన పాకే మొక్క కాబట్టి, ఇసుక మట్టి పోయేలా, బాగా కడగటం అవసరం. చిన్న పావిలాకులకన్నా పెద్ద పావిలాకులు ఉప్పగా, పుల్లగా వగరుగా ఉంటాయి. ఈ ఆకుల్ని తరిగి, తాలింపు నూనె /నెయ్యిలో వేసి మూతపెట్టి, మెత్తగా అయ్యే వరకూ మగ్గనిస్తారు. ఇందులో అల్లం వెల్లుల్లి వగైరా ఇష్టమైన సుగంధద్రవ్యాల్ని చేర్చు కోవచ్చు. నానబెట్టిన పెసరపప్పు లేదా కంది పప్పు కూడా చేర్చుకోవచ్చు. పప్పు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. సహజంగా పులుపు ఉంటుంది కాబట్టి అతిగా చింతపండు వాడాల్సిన పని లేదు. క్యాల్షియం ఐరన్‌ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దంతాలకు ఎముకలకూ మేలు చేస్తుంది. ఎదిగే పిల్లలకు పెడితే, శరీర నిర్మాణానికి దోహదపడ్తుంది.


book6.2.jpgఈ పొడికూరలో కొద్దిగా అన్నాన్ని, కావల్సినసుగంధ ద్రవ్యాల్ని చేర్చి కొద్దిసేపు వేగనిస్తే అది పావిలాకు ఫ్రైడ్‌ రైస్‌. ఈ అన్నంలో చింతపండు రసం కలిపి ఇంగువ తాలింపు పెట్టి కమ్మని పులిహార కూడా చేసుకోవచ్చు.

పావిలాకుల్ని మగ్గబెట్టి, అందులో చాలినంత పెరుగు కలిపి తాలింపు పెట్టుకున్నది పావిలాకు పెరుగుపచ్చడి. బాగా చలవ నిస్తుంది. తేలికగా అరుగుతుంది. ఈ మొక్కని దిండుకింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు రావనే నమ్మకం కొన్ని దేశాలవారికుంది.


పావిలాకుల్ని వండుకుని తింటే తల మీద జుత్తు పెరుగుతుంది. మెత్తగా గుజ్జుచేసి తలకు పట్టించినా ఉపయోగపడ్తుంది. పావిలాకుల రసం రోజూ తాగవచ్చు. టీ కాచుకుని కూడా తాగవచ్చు. ఒక కప్పు మోతాదులో తీసుకుంటే మలమూత్రాలు ఫ్రీగా అవుతాయి. మొలల వ్యాధిలో రక్తస్రావాన్ని ఆపుతుంది కూడా. స్థూలకాయం తగ్గించు కోవటానికి ఇది మంచి ఉపాయం. జ్వరం తగ్గి చెమటలు పడతాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల వాతం, గౌట్‌ వ్యాధుల్లో ఔషధంగా పనిచేస్తుంది. మూత్రపిండాల వ్యాధుల్లోనూ,


జీర్ణకోశ వ్యాధుల్లోనూ, ముఖ్యంగా అల్సర్లతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది. ఆపరేషన్లయిన వారికి, గాయాలైనవారికి పావిలాకు వండి పెట్టదగినది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఉబ్బస రోగులకు ఉపశమనాన్నిస్తుంది.ఎలర్జీ లక్షణాలను తగ్గిస్తుందని ప్రతీతి. విషదోషాల్ని హరించే యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పావిలికి ఉన్నాయని ఆధునిక పరిశోధకులు చెప్తున్నారు. ప్రకృతి మనకు ఉచితంగా అందించిన అరుదైన ఔషధాహారం గంగబాయిలమ్మ. దానిని వండుకోవటమే ఆ మహౌషధికి మనం ఇచ్చే గుర్తింపు, గౌరవం.

-- డా. జి.వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

హాథీ.. హమారా సాథీ!

ఉద్యోగులపై వరాలు.. 2 డీఏలు, సరెండర్‌ లీవ్‌లకు సర్కారు ఓకే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 11:15 AM