Share News

గుండెపోటుతో జార్ఖండ్ మంత్రి కన్నుమూత

ABN , Publish Date - Sep 06 , 2026 | 10:10 AM

జార్ఖండ్ మంత్రి, జేఎమ్ఎమ్ సీనియర్ నేత సుదివ్య కుమార్ సోను కన్నుమూశారు. గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

గుండెపోటుతో జార్ఖండ్ మంత్రి కన్నుమూత
Jharkhand Minister Sudivya Kumar Sonu

ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌ ఉన్నత, సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి సుదివ్య కుమార్ సోను(56) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శనివారం రాత్రి అస్వస్థతకు గురైన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్ఎమ్) సీనియర్ నేతను రాంచీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు.


1970 జులై 26న జన్మించిన సోనుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. సోను 2019లో గిరిడీహ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఉన్నత విద్య, పట్టణాభివృద్ధితో పాటు పర్యాటకం, కళలు, సాంస్కృతికం, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సోను మృతిపై సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయననో విశ్వసనీయ సహచరుడు, మార్గదర్శి, జార్ఖండ్‌ ఉద్యమానికి అంకితమైన నేతగా స్మరించుకున్నారు సోరెన్. మరోవైపు.. మంత్రి మృతిపై జేఎమ్ఎమ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జేఎమ్ఎమ్ పార్టీ సహా ప్రభుత్వానికి, జార్ఖండ్‌కు ఇది తీరని లోటు అని పేర్కొంది.


కాగా.. ఇటీవలే జార్ఖండ్‌ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తూ కర్ణాటకలో పర్యటించారు సోను. అక్కడ పర్యాటక మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేసి, కర్ణాటక పర్యాటక శాఖ మంత్రితో చర్చలు జరిపారు.


ఇవీ చదవండి:

‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!

మంచుకొండపై మానవ వేడి.. 154 టన్నులు కరిగిన మంచు.!

Updated Date - Sep 06 , 2026 | 10:13 AM