పిల్లలకు డబ్బు విలువ తెలియాల్సిందే...
ABN , Publish Date - Sep 06 , 2026 | 10:20 AM
‘ఈరోజుల్లో పిల్లలకు చిన్న వయసులోనే ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలి’ అంటున్నారు ఆర్థిక నిపుణులు.
‘ఈరోజుల్లో పిల్లలకు చిన్న వయసులోనే ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలి’ అంటున్నారు ఆర్థిక నిపుణులు. లేదంటే వారికి డబ్బు విలువ తెలియకుండా పోతుంది. పెరిగి, పెద్దయ్యాక ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినప్పుడు... వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడతారు. పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరిగేందుకు ఏం చేయాలంటే...
దాచుకోవడం, ఖర్చు చేయడం, పంచుకోవడం.... ఈ లేబుల్స్‌ను మూడు డబ్బాలకు అతికించాలి. పిల్లలకు ఇచ్చిన పాకెట్ మనీని ఈ మూడు డబ్బాలలో విభజించి వేయమని చెప్పాలి. ఇలా చేయడం ద్వారా డబ్బు వేటికి ఎక్కువగా ఖర్చవుతోంది? ఎక్కడ వృథా అవుతోంది? పొదుపు ఎందుకు అవసరం? తదితర విషయాలు పిల్లలకు సులభంగా అర్థమవుతాయి.
చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఇంటిపనుల్లో ఇన్వాల్వ్ చేయరు. వాళ్లకు ఇప్పుడే ఎందుకు డబ్బుల తలనొప్పులు అంటుంటారు. అయితే అది సరైన విధానం కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. అప్పుడప్పుడు పిల్లలకు చిన్న మొత్తంలో డబ్బులిచ్చి, కొనాల్సిన కిరాణా సరుకుల లిస్ట్ ఇవ్వాలి. ధరల్లో తేడాలను గమనిస్తూ, తక్కువ ఖర్చుతో అవసరమైన వస్తువులను మాత్రమే ఎంచుకుంటూ, మొత్తం బిల్లు... బడ్జెట్‌లో పూర్తయ్యేలా చూడమని చెప్పాలి. దీనివల్ల డబ్బుకు తగ్గ విలువను అంచనా వేయడం, ఖర్చులను నియంత్రించడం నేర్చుకుంటారు. మార్కెట్ సరళి కూడా వారికి తేలిగ్గా అర్థమవుతుంది.
చిన్న మొత్తంలో చేసే కొనుగోలుకు పిల్లలతో స్వయంగా నగదు లేదా కార్డు ద్వారా చెల్లించనివ్వాలి. బిల్లు చెల్లించగా ఇచ్చిన చిల్లరను లెక్కించమనాలి. దీంతో డబ్బు లెక్కించడం, చెల్లింపులు చేయడం వంటి ప్రాథమిక ఆర్థిక నైపుణ్యాలు అలవడతాయి.
పిల్లలు దీర్ఘకాలిక లక్ష్యం కోసం పొదుపు చేస్తున్నప్పుడు, తల్లిదండ్రులు కొంత మొత్తాన్ని అదనంగా ఇవ్వాలి. వాళ్లు దాచే ప్రతీ వంద రూపాయలకు రూ.20 అదనంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఓపికగా పొదుపు చేయడం, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం డబ్బును దాచడం వంటి అలవాట్లు పెరుగుతాయి. పైగా మీరిచ్చే అదనపు బహుమతి వారికి లాభంగా అనిపిస్తుంది.

ఇంట్లో వస్తువులను ‘అవసరాలు, కోరికలు’ అని రెండు విభాగాలుగా పిల్లలతో వేరు చేయించాలి. ఉదాహరణకు ఆహారం అవసరం, కొత్త బొమ్మ కొనడం కోరిక అని చెప్పాలి. ఈ చిన్న ఆట పిల్లలకు ఏది నిజంగా అవసరమో, ఏది కేవలం కోరికనో ఆలోచించే అలవాటును పెంచుతుంది. భవిష్యత్తులో అనవసరమైన కొనుగోళ్లను తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది.
పిల్లల పేరుతో తల్లిదండ్రుల పర్యవేక్షణలో పొదుపు ఖాతాను ప్రారంభించొచ్చు. బ్యాంకులో డబ్బు జమ చేయడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా వారికి బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన ఏర్పడుతుంది. అలాగే వడ్డీ ఎలా వస్తుంది? డబ్బు ఎలా పెరుగుతుంది? అనే విషయాలను ఆచరణలో అర్థం చేసుకుంటారు.
ఒకరోజు కుటుంబం మొత్తం తినే భోజనాన్ని పిల్లలు ప్లాన్ చేసే అవకాశం ఇవ్వాలి. ముందుగా వారికి కొంత బడ్జెట్ ఇవ్వాలి. ఏ వంటకాలు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? వాటి ధర ఎంత? అనే విషయాలను పరిశీలించి, మొత్తం ఖర్చు బడ్జెట్‌లో ఉండేలా చూడమని చెప్పాలి. దీనివల్ల రోజువారీ ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం, అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు.
మోనోప్లే, క్యాష్ ఫ్లో ఫర్ కిడ్స్, ది గేమ్ ఆఫ్ లైఫ్ టుగెదర్ వంటి ఆటలను పిల్లలతో కలిసి ఆడాలి. వీటి ద్వారా అప్పులు, పెట్టుబడులు, నగదు ప్రవాహం, రిస్క్ వంటి ఆర్థిక అంశాలను నేర్చుకుంటారు. ఇలాంటి ఆటలు పిల్లల్లో వ్యూహాత్మక ఆలోచన, డబ్బు నిర్వహణ, రిస్క్‌ను అంచనా వేయడం వంటి నైపుణ్యాలను పెంచుతాయి. ముఖ్యంగా, పిల్లలకు డబ్బు గురించి చెప్పడం కన్నా, చిన్న చిన్న పనుల ద్వారా ఆచరణలో నేర్పిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఉద్యోగులపై వరాలు.. 2 డీఏలు, సరెండర్ లీవ్‌లకు సర్కారు ఓకే
Read Latest AP News And Telangana News And International News And Telugu News